Uddhav Thackeray: అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం తర్వాత గోద్రా తరహా అల్లర్లు.. ఉద్ధవ్ థాకరే సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-09-11T13:33:38+05:30 IST

శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో గల రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా గోద్రా తరహా అల్లర్లు జరగొచ్చని ఆరోపించారు.

Uddhav Thackeray: అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం తర్వాత గోద్రా తరహా అల్లర్లు.. ఉద్ధవ్ థాకరే సంచలన వ్యాఖ్యలు

ముంబై: శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో గల రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా గోద్రా తరహా అల్లర్లు జరగొచ్చని ఆరోపించారు. "రామాలయ ప్రారంభోత్సవానికి ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ప్రజలను ఆహ్వానించే అవకాశం ఉంది. దీంతో బస్సులు, ట్రక్కులలో చాలా మంది అయోధ్య చేరుకుంటారు. అయితే వారి తిరుగు ప్రయాణంలో గోద్రాలో జరిగినట్లుగానే అల్లర్లు జరగొచ్చు" అని ఆయన వ్యాఖ్యనించారు. 27 ఫిబ్రవరి 2002న గుజరాత్‌లో అయోధ్య నుంచి సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లో తిరిగి వస్తున్న కర సేవకుల రైలు కోచ్‌పై పలువురు దాడి చేశారు. ఆ దాడిలో రైలు కోచ్‌ను తగలబెట్టారు. దీంతో ఇది గుజరాత్ వ్యాప్తంగా భారీ ఎత్తున అల్లర్లకు దారి తీసింది. ఈ అల్లర్లలో పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. కాగా లోక్‌సభ ఎన్నికలకు నెల రోజుల ముందు అంటే 2024 జనవరిలో రామమందిరం ప్రారంభోత్సవం కార్యక్రమం జరుగుతుందని ఉద్ధవ్ థాకరే చెప్పారు.


ఈ సందర్భంగా బీజేపీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌పై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ తన తండ్రి బాల్ థాకరే వారసత్వాన్ని నిందించే ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. అలాగే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు సొంతంగా విజయాలు లేవని అన్నారు. కాగా 2019 ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేశాయి. కానీ ఆ తర్వాత వచ్చిన విబేధాల కారణంగా బీజేపీ నుంచి తప్పుకున్న శివసేన కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఉద్ధవ్ థాకరేను ముఖ్యమంత్రి పదవి వరించింది. దీంతో బాల్ థాకరే ఆదర్శాలను వదిలిపెట్టి ఉద్ధవ్ థాకరే సీఎం అయ్యారని బీజేపీ తరచుగా ఆరోపిస్తోంది. గతేడాది జూన్‌లో శివసేన రెండుగా చీలిపోయిన తర్వాత ఈ దాడులు మరింత పెరిగాయి. తామే బాల్ థాకరే హిందుత్వానికి నిజమైన అనుచరులమని బీజేపీ, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన చెప్పుకుంటున్నాయి.

Updated Date - 2023-09-11T13:36:37+05:30 IST