Viral Video: భారీ వర్షాలకు కాలేజీ భవనం ఎలా కూలిపోయిందో చూడండి.. రాష్ట్రంలో ఎంత మంది చనిపోయారంటే..?

ABN , First Publish Date - 2023-08-14T12:27:32+05:30 IST

ఉత్తర భారతదేశాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు భారీ వర్షాలకు కకావికలమవుతున్నాయి. ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా డెహ్రాడూన్‌లోని డిఫెన్స్ కాలేజీ భవనం పేకమేడలా కుప్పకూలింది.

Viral Video: భారీ వర్షాలకు కాలేజీ భవనం ఎలా కూలిపోయిందో చూడండి.. రాష్ట్రంలో ఎంత మంది చనిపోయారంటే..?

ఉత్తరాఖండ్: ఉత్తర భారతదేశాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు భారీ వర్షాలకు కకావికలమవుతున్నాయి. ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా డెహ్రాడూన్‌లోని డిఫెన్స్ కాలేజీ భవనం పేకమేడలా కుప్పకూలింది. మాల్‌దేవతా జిల్లాలో గల గఢ్వాల్ హిమాలయాల సమీపంలో బండల్ నది ఒడ్డున ఉన్న ఈ కాలేజీ ఉంది. అయితే రాష్ట్రంలో గత 24 గంటలుగా కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా నది ఉధృతంగా ప్రవహించడంతో సోమవారం ఉదయం డిఫెన్స్ కాలేజీ భవనం కుప్పకూలింది. కాలేజీ భవనంలోని సగ భాగం నదిలో పడి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రమాదం సమయంలో కాలేజీలో ఎవరూ లేకపోవడంతో పెను విషాదం తప్పింది. కాగా ఈ కాలేజీలో ఐఐటీ, టెక్నికల్ కోర్సులతోపాటు నేషనల్ డిఫెన్స్ అకాడమీ, డిఫెన్స్ సర్వీసెస్ పరీక్షల కోసం విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. అయితే భారీ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో ఈ డిఫెన్స్ కాలేజీలో కూడా విద్యార్థులేవరు లేరు.


ఇక ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు 60 మంది చనిపోయారు. మరో 17 మంది అదృశ్యమయ్యారు. కొండచరియలు విరిగిపడటంతో జాతీయ రహదారులతోపాటు పలు రహదారులను మూసివేశారు. తెహ్రీలోని కుంజపురి బగర్ధర్ సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో రిషికేశ్-చంబా జాతీయ రహదారిని మూసివేశారు. రిషికేశ్-దేవప్రయాగ్-శ్రీనగర్ జాతీయ రహదారులపై సఖ్నిధర్ వద్ద వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాల కారణంగా దాదాపు 1,169 ఇళ్లు, పెద్ద మొత్తంలో వ్యవసాయ భూములు కూడా దెబ్బతిన్నాయి. మరోవైపు డెహ్రాడూన్, చంపావత్‌లలో ఈ రోజు విద్యాసంస్థలన్నింటిని మూసివేయాలని అధికారులు ఆదేశించారు. వరదల దృష్ట్యా జిల్లా మేజిస్ట్రేట్‌లు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆదేశించింది.

Updated Date - 2023-08-14T12:30:07+05:30 IST