Mamata Banerjee: కేంద్ర నిధులపై మమత సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-04-13T20:29:53+05:30 IST

అవసరమైతే చీరకొంగుపట్టి బెంగాళీ మాతల దగ్గర బిచ్చం అడుక్కుంటాను కానీ బిచ్చమెత్తుకునేందుకు ఢిల్లీకి మాత్రం వెళ్లబోనని మమతా బెనర్జీ చెప్పారు.

Mamata Banerjee: కేంద్ర నిధులపై మమత సంచలన వ్యాఖ్యలు
Mamata Banerjee

కోల్‌కతా: కేంద్ర ప్రభుత్వ నిధులపై తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి, పశ్చిమబెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 వరకూ కేంద్ర నిధులు ఇక రాబోవనే ప్రచారం జరుగుతోందని ఆమె చెప్పారు. అంతేకాదు అవసరమైతే చీరకొంగుపట్టి బెంగాళీ మాతల దగ్గర బిచ్చం అడుక్కుంటాను కానీ బిచ్చమెత్తుకునేందుకు ఢిల్లీకి మాత్రం వెళ్లబోనని దీదీ చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు (2024 Lok sabha elections) గడువు దగ్గరపడుతుండటంతో మమత వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఓ పక్క ప్రతిపక్షాల మధ్య ఐక్యత కోసం బీహార్ సీఎం నితీశ్ (Nitish) సారథ్యంలో ఢిల్లీలో సమావేశాలు జరుగుతుండగా కేంద్ర నిధులపై మమత చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌లో 42 స్థానాలకు గాను తృణమూల్ 22 చోట్ల గెలిచింది. బీజేపీ 18 చోట్ల గెలిచింది. 2014లో తృణమూల్ 34 సీట్లను గెలుచుకుంది. అయితే 2019కి వచ్చేసరికి పశ్చిమబెంగాల్‌లో బీజేపీ దూసుకుపోయింది. దాదాపు సగం ఎంపీ సీట్లను దక్కించుకోగలిగింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ, తృణమూల్ మధ్య టఫ్ ఫైట్ నడిచింది. అయితే మమత పార్టీ 294 స్థానాలకు 215 చోట్ల నెగ్గి స్వీప్ చేసింది. బీజేపీ 70 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షమైంది.

పశ్చిమబెంగాల్‌లో బీజేపీ బలపడుతున్నప్పటినుంచీ దీదీకి, బీజేపీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తృణమూల్ పార్టీలోని కీలక నేతలను పార్టీలో చేర్చుకోవడంతో జాతీయవాద అంశాలతో బెంగాల్‌లో బీజేపీ పాగా వేసింది. దీనికి తోడు శారదా చిట్‌ఫండ్ స్కాం, మైనింగ్ స్కాం, ఇసుక స్కాం, టీచర్ రిక్రూట్‌మెంట్ స్కాం పాటు అనేక కుంభకోణాల్లో తృణమూల్ మంత్రులు చిక్కుకున్నారు. అనేక సందర్భాల్లో టీఎంసీ మంత్రులు నగదుతో సీబీఐ, ఈడీలకు దొరికిపోయారు. ప్రస్తుతం అనేకమంది టీఎంసీ మంత్రులు జైళ్లలో ఉన్నారు. దీనికి తోడు శ్రీరామనవమి సందర్భంగా అల్లర్లు జరగడంతో కమలనాథులు మమత సర్కారును ఇరుకునపెడుతున్నారు. దీంతో బీజేపీకి, టీఎంసీకి క్షణం పడని వాతావరణం నెలకొంది. రెండు పార్టీల నేతలూ ఢీ అంటే ఢీ అంటున్నారు. దీంతో పశ్చిమబెంగాల్‌లో తరచూ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బెంగాల్‌లో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలు సంపాదించి విపక్షాల ప్రధాని అభ్యర్థిగా నిలవాలని మమత తలపోస్తున్నారు. ఈ తరుణంలో ఆమె కమలనాథులపై విమర్శల తీవ్రతను పెంచారు.

Updated Date - 2023-04-13T20:29:57+05:30 IST