West Bengal : పోలీసులపై మూకదాడి.. ప్రాణభిక్ష కోసం పోలీసుల వేడుకోలు..

ABN , First Publish Date - 2023-04-27T19:02:05+05:30 IST

పశ్చిమ బెంగాల్‌లో పోలీసులపైనే మూక దాడులు జరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసి, ఆమెను హత్య చేసినట్లు

West Bengal : పోలీసులపై మూకదాడి.. ప్రాణభిక్ష కోసం పోలీసుల వేడుకోలు..
West Bengal , Kaliaganj

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో పోలీసులపైనే మూక దాడులు జరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసి, ఆమెను హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేయడంతో వందలాది మంది దుండగులు పోలీసులపై దాడి చేశారు. పోలీస్ స్టేషన్‌ను తగులబెట్టారు. ప్రైవేట్ ఇళ్లలో దాక్కున్న పోలీసులపై కూడా దాడి చేసి, తీవ్రంగా కొట్టి గాయపరిచారు. పోలీసులు ప్రాణ రక్షణ కోసం ఆ దుండగులను వేడుకున్నారు.

ఉత్తర దీనాజ్‌పూర్‌, కలియాగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 17 ఏళ్ళ బాలికపై ఎవరో అత్యాచారం చేసి, అనంతరం ఆమెను హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆమె గత గురువారం అదృశ్యం కాగా, గత శుక్రవారం ఆమె మృతదేహం కనిపించింది. ఈ కేసులో పోలీసులు జావేద్ అక్తర్‌ను, ఆయన తండ్రిని అరెస్ట్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆమె విష ప్రభావంతో మరణించినట్లు రాయ్‌గంజ్ ఎస్పీ చెప్పారు.

ఈ నేపథ్యంలో మంగళవారం దాదాపు 200 మంది దుండగులు మూకుమ్మడిగా రెచ్చిపోయారు. కలియాగంజ్ పోలీస్‌ స్టేషన్‌ను తగులబెట్టారు. 65 ఏళ్ళ వయసుగల సూర్య పాల్‌ నివసిస్తున్న ఇంట్లో దాదాపు 25 మంది పోలీసులు దాక్కున్నారు. వారు అక్కడ దాక్కున్నట్లు గుర్తించిన దుండగులు వారిపై కత్తులు, కర్రలు, రాడ్లతో దాడి చేసి, విపరీతంగా కొట్టారు. ఆ పోలీసులు రక్తపు మడుగులో కూలిపోయి, ప్రాణభిక్ష పెట్టాలని ఆ మూకను వేడుకున్నారు. ఆ దుండగులు ఆ ఇంట్లోని వస్తువులను యథేచ్ఛగా ధ్వంసం చేశారు. ఈ భయానక సంఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన పాల్ బుధవారం జాతీయ మీడియాకు ఈ వివరాలను తెలిపారు. తన ఇంట్లో తాను దాచుకున్న రూ.30,000ను ఈ దుండగులు దోచుకుపోయారని రోదించారు.

ఈ భయానక దాడిలో 17 మంది పోలీసులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దుండగులు సివిక్ వాలంటీర్లను, పోలీసుల కుటుంబ సభ్యులను కూడా వదిలిపెట్టలేదు. ఇద్దరు వాలంటీర్లు భయంతో వణికిపోతూ సువేందు దాస్ ఇంట్లోకి చొరబడి, తలుపులు మూసేయాలని బతిమాలారు. తలుపులు వేసిన కొద్ది క్షణాల్లోనే దుండగులు తలుపులు, కిటికీలు ధ్వంసం చేసి, ఇంట్లోకి ప్రవేశించి, ఆ ఇద్దరితోపాటు దాస్‌ను కూడా చితక్కొట్టారు. ఆ ఇంట్లోని తలుపులు, వంటగది శ్లాబులు, పైపులు వంటివాటిని ధ్వంసం చేశారు.

రాడ్లు, కర్రలతో దెబ్బలు తింటున్న పోలీసులు, వాలంటీర్లు ప్రాణ భిక్ష పెట్టాలని ఆ దుండగులను కోరుతున్నట్లు కనిపిస్తున్న వీడియోలు అందరి మనసులను కలచివేస్తున్నాయి. ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు 33 మంది అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ హింసాకాండలో ప్రమేయం ఉన్నవారినందరినీ పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. రాయ్‌గంజ్ పోలీస్ సూపరింటెండెంట్ మహమ్మద్ సనా అక్తర్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ, ప్రణాళికాబద్ధంగా ఈ హింసాకాండ జరిగిందన్నారు. చాలా మందిని సంఘటన స్థలంలోనే అరెస్టు చేశామన్నారు. కొందరిని వీడియో ఫుటేజ్ ద్వారా గుర్తించామని చెప్పారు. ప్రత్యక్ష సాక్షుల స్టేట్‌మెంట్లను రికార్డు చేస్తున్నామన్నారు. ఏప్రిల్ 28 ఉదయం వరకు కలియాగంజ్‌ పట్టణంలోని నాలుగు వార్డుల్లో సెక్షన్ 144 నిబంధనలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి :

దలైలామా చేతికి రామన్‌ మెగసెసె అవార్డు

Modi Vs Jairam Ramesh : కాంగ్రెస్‌పై మోదీ వ్యాఖ్యలు.. ఘాటుగా బదులిచ్చిన జైరామ్ రమేశ్..

Updated Date - 2023-04-27T19:02:05+05:30 IST