Yogi Adityanath : మాఫియాను మట్టిలో కలుపుతాం : యోగి

ABN , First Publish Date - 2023-02-25T15:39:46+05:30 IST

బహుజన్ సమాజ్ పార్టీ (BSP) ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో సాక్షి ఉమేశ్ పాల్‌ ప్రయాగ్‌రాజ్‌లో హత్యకు గురైన నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ శాసన సభ

Yogi Adityanath : మాఫియాను మట్టిలో కలుపుతాం : యోగి
Yogi Adithyanath, Akhilesh Yadav

లక్నో : బహుజన్ సమాజ్ పార్టీ (BSP) ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో సాక్షి ఉమేశ్ పాల్‌ ప్రయాగ్‌రాజ్‌లో హత్యకు గురైన నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ శాసన సభ గురువారం దద్దరిల్లింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath), సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. మాఫియాకు సమాజ్‌వాదీ పార్టీ అండదండలు అందిస్తోందని యోగి ఆరోపించారు. ‘‘వారిని మట్టిలో కలిపేస్తాం’’ అని హెచ్చరించారు.

ఉమేశ్ పాల్‌ ప్రయాగ్‌రాజ్‌లోని తన నివాసంలో ఉండగా, శుక్రవారం ఆయనపై పెట్రోలు బాంబులతో దాడి చేసి, కాల్పులు జరిపి, హత్య చేశారు. ఆయనకు భద్రత కల్పిస్తున్న సెక్యూరిటీ గార్డు కూడా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఉమేశ్ పాల్‌పై దాడికి పాల్పడినవారు ఆయన ప్రయాణించిన కారును వెంటాడారు. తమ బ్యాగుల్లో క్రూడ్ బాంబులను తీసుకొచ్చారు. ఓ నిందితుడు తన బ్యాగులో నుంచి ఓ క్రూడ్ బాంబును తీసి, ఉమేశ్‌పై విసిరినట్లు ఓ వీడియోలో కనిపించింది.

రాజు పాల్‌ హత్య 2015లో జరిగింది. ఆయన అలహబాద్ (పశ్చిమ) నియోజకవర్గం నుంచి పోటీ చేసి, విజయం సాధించిన కొద్ది నెలల్లోనే ఈ దారుణం జరిగింది. మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ సోదరుడు ఖలీద్ అజీంను ఆయన ఓడించారు. ఈ కేసులో అతిక్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే అష్రఫ్ నిందితులు. ఈ కేసులో నిందితులంతా జైలులో ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ శాసన సభలో గవర్నర్ ఆనందిబెన్ పటేల్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై యోగి ఆదిత్యనాథ్ శనివారం మాట్లాడారు. ఈ సందర్భంగా అఖిలేశ్ యాదవ్ ఈ హత్యాకాండ గురించి ప్రస్తావించారు. ఉమేశ్ పాల్‌ను, ఆయన సెక్యూరిటీ గార్డును దారుణంగా హత్య చేశారని ఆరోపించారు. రాజు పాల్ హత్య కేసులో ప్రధాన సాక్షి అయిన ఉమేశ్ పాల్ న్యాయవాది కూడానని తెలిపారు. శుక్రవారం బాంబులు విసిరిన తీరును పరిశీలించినపుడు, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని స్పష్టమవుతోందని చెప్పారు. గ్యాంగ్ వార్ వంటి పరిస్థితి కనిపించిందన్నారు. బహిరంగంగా తుపాకులు స్వైరవిహారం చేస్తుండటమే రామరాజ్యమా? అని నిలదీశారు. పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని, బీజేపీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

యోగి స్పందిస్తూ, ప్రయాగ్‌‌రాజ్ సంఘటనల వంటి దుశ్చర్యలను తన ప్రభుత్వం ఎంతమాత్రం సహించదని తెలిపారు. జీరో టాలరెన్స్ పాలసీతో ఇటువంటి సంఘటనలపై చర్యలు తీసుకుంటామన్నారు. అయితే ఈ సంఘటనతో ప్రమేయం ఉన్న నేరస్థుడు సమాజ్‌వాదీ పార్టీ పెంచి పోషించినవాడు కాదా? అని నిలదీశారు. ఆయనను పార్లమెంటు సభ్యునిగా చేసినది సమాజ్‌వాదీ పార్టీ కాదా? అని ప్రశ్నించారు. ఈ మాఫియాలను తాము వదిలిపెట్టబోమని తెలిపారు.

ఉమేశ్ పాల్‌ను హత్య చేసినవారు పరారయ్యారన్నారు. మాఫియా ఎంతటివారైనప్పటికీ, రాష్ట్రంలో మాఫియా పాలనను తన ప్రభుత్వం అనుమతించదని తెలిపారు.

‘‘మీరు (సమాజ్‌వాదీ పార్టీ) నేరగాళ్లకు మద్దతిస్తున్నారు. పూలమాలలు వేసి స్వాగతిస్తున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి నాటకాలు ఆడుతున్నారు’’ అని యోగి అన్నారు. మాజీ ఎంపీ అతిక్ అహ్మద్‌ను సమాజ్‌వాదీ సమర్థించడం నిజం కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న మాఫియాను మట్టుబెడతామన్నారు.

ఇవి కూడా చదవండి :

America Vs China : భారత్ పొరుగు దేశాలకు చైనా రుణాలు... అమెరికా తీవ్ర ఆందోళన...

Madhya Pradesh : మూడు బస్సులను ఢీకొట్టిన లారీ... 15 మంది మృతి... 61 మందికి గాయాలు...

Updated Date - 2023-02-25T15:39:50+05:30 IST