Indian American: అమెరికాలో ఘోరం.. చిన్న గొడవకే గర్ల్‌ఫ్రెండ్‌ను కాల్చి చంపిన భారతీయ యువకుడు.. చివరికి
ABN , First Publish Date - 2023-08-27T12:23:09+05:30 IST
అగ్రరాజ్యం అమెరికాలో ఘోరం జరిగింది. ఓ భారతీయ అమెరికన్ (Indian American) చిన్న గొడవకే గర్ల్‌ఫ్రెండ్‌ను తుపాకీతో కాల్చి చంపేశాడు. 29 ఏళ్ల సదరు భారత సంతతి సిక్కు యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఎన్నారై డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో ఘోరం జరిగింది. ఓ భారతీయ అమెరికన్ (Indian American) చిన్న గొడవకే గర్ల్‌ఫ్రెండ్‌ను తుపాకీతో కాల్చి చంపేశాడు. 29 ఏళ్ల సదరు భారత సంతతి సిక్కు యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కాలిఫోర్నియాకు చెందిన సిమ్రంజిత్ సింగ్ (Simranjit Singh) గత శనివారం ఉదయం 10.30 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం) తన ప్రియురాలిని తీసుకుని స్థానికంగా ఉండే గల్లేరియా మాల్‌కు వెళ్లాడు. అక్కడ ఆ జంట కొద్దిసేపు సరదాగా గడిపారు. ఆ తర్వాత ఇంటికి వచ్చేందుకు కారు పార్కింగ్ వద్దకు వెళ్లారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతో కోపోద్రిక్తుడైన సిమ్రంజిత్ కారులోంచి తుపాకీ తీసి ప్రేయసి (Girlfriend) పై విచక్షణరహితంగా కాల్పులకు పాల్పడ్డాడు.
దాంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే అతడు అక్కడి నుంచి పారిపోయాడు. కొద్దిసేపటి తర్వాత అటువైపుగా వెళ్లిన పార్కింగ్ సిబ్బంది మహిళ మృతదేహం పడి ఉండడం చూసి పోలీసులకు సమాచారం అందించారు. వారి సమాచారంతో ఘటనాస్థలికి వచ్చిన రోస్‌విల్లే పోలీసులు (Roseville Police) మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అక్కడి సీసీటీవీ కెమెరాలలో రికార్డైన దృశ్యాలను పరిశీలించారు. దాంతో ఆమెను చంపింది సిమ్రంజిత్ అని తెలిసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఓ షాపు వద్ద ఉండగా అతడిని అరెస్ట్ చేశారు. బుధవారం సిమ్రంజిత్‌ను ప్లేసర్ కౌంటీ డిస్ట్రిక్ట్ కోర్టులో హాజపరుపరిచారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది.