NRI: గ్రీన్‌కార్డు కోసం పెళ్లి నాటకం.. భారత వ్యక్తి బుక్కయ్యాడిలా..

ABN , First Publish Date - 2023-09-29T12:22:54+05:30 IST

అగ్రరాజ్యం అమెరికా (America) లో శాశ్వత నివాసానికి వీలు కల్పించేదే గ్రీన్‌కార్డు (Green Card). దీనికోసం యూఎస్‌లోని భారతీయులు ఏళ్ల తరబడి కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు.

NRI: గ్రీన్‌కార్డు కోసం పెళ్లి నాటకం.. భారత వ్యక్తి బుక్కయ్యాడిలా..

ఎన్నారై డెస్క్: అగ్రరాజ్యం అమెరికా (America) లో శాశ్వత నివాసానికి వీలు కల్పించేదే గ్రీన్‌కార్డు (Green Card). దీనికోసం యూఎస్‌లోని భారతీయులు ఏళ్ల తరబడి కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు. ఇక ఈ గ్రీన్‌కార్డు పొందడం మనోళ్లకు అంత ఈజీ కాదు. అయితే, దీనికి పెళ్లి ఒక చక్కటి మార్గం అని చెప్పొచ్చు. అమెరికా పౌరసత్వం (American Citizenship) ఉన్నవారిని వివాహమాడితే గ్రీన్‌కార్డ్ పొంది యూఎస్ నివాసిగా మారవచ్చు. కానీ, పెళ్లి కోసం సిద్ధంగా ఉన్న యూఎస్ పౌరసత్వ భాగస్వామిని కనుగొనడం చాలా కష్టమనే చెప్పాలి. దీంతో కొందరు దొంగ పెళ్లికి తెర లేపుతుంటారు. పెళ్లి చేసుకున్నట్టు నాటకమాడుతూ గ్రీన్‌కార్డు పొందుతుంటారు. ఇది అగ్రరాజ్యంలో తీవ్రమైన నేరం కూడా. అయినా చాలామంది ఈ మోసాలకు పాల్పడుతూ చివరికి కటకటాల వెనక్కి వెళ్తున్నారు. తాజాగా ఇదే కోవకు చెందిన ఓ కేసు వెలుగులోకి వచ్చింది. అది కూడా భారత వ్యక్తి (Indian Man) కి చెందినది కావడం గమనార్హం.

వివరాల్లోకి వెళ్తే.. వివేక్ చౌహాన్ (Vivek Chauhan) అనే భారతీయుడు 2018లో అమెరికా పౌరసత్వం ఉన్న ఒక యువతిని పెళ్లాడాడు. అయితే, వారిద్దరూ ఎప్పుడూ భార్యాభర్తలుగా కలిసి జీవించలేదని అక్కడి అధికారుల విచారణలో తేలింది. పర్మినెంట్ రెసిడెన్సీ సర్టిఫికేట్ (Permanent Residence Certificate) పొందడానికి మాత్రమే వివేక్ యూఎస్ కాంట్రాక్టు మ్యారేజ్ చేసుకున్నాడని గుర్తించారు. ఈ నకిలీ వివాహం గడువు ముగిసినప్పుడు అధికారులు అతడి మోసాన్ని గుర్తించారు. 2019లో యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ పెళ్లి విషయాల గురించి వివేక్‌ను ప్రశ్నించింది. ప్రశ్నోత్తరాల సమయంలో వివేక్ నకిలీ భార్య మాట్లాడుతూ తాను తన భర్తతో కలిసి కనెక్టికట్‌లో జీవించినట్లు చెప్పింది. కానీ, వివేక్ మాత్రం వేరే చోట నివసించినట్లు చెప్పాడు. అలాగే తమకు బిడ్డ కూడా ఉందని అబద్ధమాడాడు.

ఇక వివేక్ పెళ్లి చేసుకున్న మహిళను అధికారులు సీరియల్ మ్యారేజ్ ఫ్రాడ్‌స్టర్ అని గుర్తించారు. అతని కంటే ముందే ఆమె చాలా మందితో మోసపూరిత వివాహ ఒప్పందాలు చేసుకుంది. దాంతో బుక్కైన వివేక్ ఇప్పుడు వివాహ మోసం ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఒకవేళ దోషిగా తేలితే ఐదేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 2.07కోట్లు జరిమానా విధించవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కాగా, అతనికి న్యాయస్థానం శిక్షను వచ్చే ఏడాది జనవరి 26న ఖరారు చేయనుంది.

US Visas: భారతీయులకు రికార్డు స్థాయిలో వీసాలు జారీ చేసిన అగ్రరాజ్యం అమెరికా..!


Updated Date - 2023-09-29T12:22:54+05:30 IST