Broken dreams: ఎన్నో కలలతో కెనడాకు.. నాలుగు రోజులకే శవమై తేలిన భారత యువకుడు!
ABN , First Publish Date - 2023-09-14T10:28:59+05:30 IST
ఎన్నో ఆశలతో కెనడా (Canada) లో అడుగుపెట్టిన ఓ భారతీయ యువకుడు నాలుగు రోజులకే అనుమానాస్పదంగా శవమై తేలాడు. ఈ విషయం తెలిసి అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
ఎన్నారై డెస్క్: ఎన్నో ఆశలతో కెనడా (Canada) లో అడుగుపెట్టిన ఓ భారతీయ యువకుడు నాలుగు రోజులకే అనుమానాస్పదంగా శవమై తేలాడు. ఈ విషయం తెలిసి అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. మృతుడి స్వస్థలం పంజాబ్ (Punjab) రాష్ట్రం అమృత్‌సర్ (Amritsar) పరిధిలోని నౌలి గ్రామంలో విషాదం అలుముకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కెనడా వెళ్లిన నాలుగు రోజులకే గగన్‌దీప్ అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు అతని కుటుంబానికి సమాచారం అందింది. గగన్‌దీప్‌కు ఇప్పటికే వివాహం కాగా, అతని భార్య కూడా స్టూడెంట్ వీసా (Student visa) పై కెనడాకు వెళ్లింది. తన కుమారుడు, కోడలిని కెనడాకు పంపించేందుకు రూ.30 లక్షలు అప్పు చేశానని తండ్రి మోహన్ లాల్ సింగ్ బోరున విలపించారు.
గగన్‌దీప్ తల్లి సీమా మాట్లాడుతూ, తన కుమారుడు ఈ నెల 6వ తేదీన అమృత్‌సర్ నుంచి టొరంటోకి (Toronto) బయల్దేరాడని తెలిపారు. సెప్టెంబర్ 10న రాత్రి 9.30కి వీడియో కాల్ చేశాడని, ఇప్పుడే భోజనం చేశానని చెప్పినట్లు ఆమె పేర్కొన్నారు. అయితే, మంగళవారం తెల్లవారుజామున 2.30 గంటలకు గగన్‌దీప్ మరణించినట్లు ఫోన్ రావడంతో తామందరం షాక్ అయ్యామని సీమా కన్నీటి పర్యంతమయ్యారు. 2021 నవంబర్‌లో గగన్‌దీప్‌కు వివాహమైందని, ఆ మరుసటి నెలలోనే తమ కోడలు కెనడాకు వెళ్లిందని ఆమె చెప్పారు. అక్కడ ఒక సెమిస్టర్ పూర్తి చేసి, తిరిగి స్వదేశానికి వచ్చిందని సీమా వెల్లడించారు.
కాగా, గగన్‌దీప్ మరణం పట్ల కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ఆరోగ్యంగా ఉండే తమ బిడ్డ ఇలా ఎలా చనిపోతాడని వారు అంటున్నారు. అతని పోస్ట్‌మార్టం నివేదిక (Postmortem report) కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. ఇప్పటికే తమ కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, కుమారుడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు సాయం చేయాలని వారు కోరుతున్నారు. అక్కడి నుంచి మృతదేహాన్ని భారత్‌కు తీసుకువచ్చేందుకు 20వేల కెనడియన్ డాలర్లు (రూ.12.25లక్షలు) ఖర్చు అవుతుంది. దీనికోసం ఇప్పటికే కెనడాలోని పంజాబీ కమ్యూనిటీ గగన్ మృతదేహాన్ని స్వదేశం చేర్చడానికి నిధుల సేకరణ చేపట్టిందని సమాచారం.