NRIs: చంద్రబాబు కోసం అమెరికా దేవాలయాలలో ఎన్నారైల ప్రత్యేక ప్రార్థనలు
ABN , First Publish Date - 2023-10-17T08:42:03+05:30 IST
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి నెల రోజులకు పైగా గడిచిన సంగతి తెలిసిందే. అయితే, రాజకీయ కక్షతో పెట్టిన కేసులలో ఇంకా ఆయనకు బెయిల్ రాకపోవడంతో మరికొద్ది రోజులు జైలులోనే ఉండే అవకాశాలున్నాయి.
ఎన్నారై టీడీపీ, జనసేనల ఆధ్వర్యంలో ప్రార్థనలు
NRIs: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి నెల రోజులకు పైగా గడిచిన సంగతి తెలిసిందే. అయితే, రాజకీయ కక్షతో పెట్టిన కేసులలో ఇంకా ఆయనకు బెయిల్ రాకపోవడంతో మరికొద్ది రోజులు జైలులోనే ఉండే అవకాశాలున్నాయి. దీంతో చంద్రబాబుకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది? ఆయన ఎప్పుడు జైలు నుంచి బయటకు వస్తారు అని టీడీపీ నేతలు, కార్యకర్తలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఎన్ని అడ్డంకులు వస్తున్నా సరే చంద్రబాబు న్యాయం కోసం మొక్కవోని దీక్షతో పోరాడుతూనే ఉన్నారు.
ఓ వైపు న్యాయం కోసం... మరోవైపు జైలులో ప్రతికూల పరిస్థితులు, అపరిశుభ్ర వాతావరణం, డీహైడ్రేషన్, స్కిన్ అలర్జీ వంటి ఇబ్బందులతో కూడా చంద్రబాబు పోరాడుతున్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో చంద్రబాబుకి మద్దతుగా అమెరికాలోని ఎన్నారైలంతా మరోసారి కదం తొక్కారు. చంద్రబాబు కోసం టీడీపీ ఎన్నారైలు ప్రత్యేకంగా అక్కడి ఆలయాలు, మందిరాలలో ప్రార్థనలు చేశారు. చంద్రబాబు త్వరగా జైలు నుంచి విడుదల కావాలని, ఆయన ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడిని వారంతా ప్రార్థించారు.
తమకు సమీపంగా ఉన్న గుళ్లు, మసీదులు, చర్చిలలో ఈ వారాంతం సందర్భంగా పలువురు ఎన్నారైలు వందలాది సంఖ్యలో చంద్రబాబు కోసం ప్రార్థించారు. ఈ తరహాలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీడీపీ అభిమానులు, చంద్రబాబు అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆయన కోసం ప్రార్థనలు చేసి ప్రజాస్వామ్యాన్ని, రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలని వారు కోరారు.
చంద్రబాబు నాయుడు పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని, తిరిగి రాష్ట్ర ప్రగతి కోసం ముఖ్యమంత్రిగా పాలనా నాయకత్వం వహించాలని ప్రార్థించారు. న్యాయస్థానాలు వేదికగా ఆయన చేస్తున్న ధర్మ పోరాటానికి దైవానుగ్రహం తోడవ్వాలని వేడుకుంటూ.. పలు దేవాలయాలలో ఈ రోజు పూజ, అర్చనలు నిర్వహించటం జరిగింది.
బే ఏరియా లో.. బే ఏరియాలోని మిల్పిటాస్‌లో ఉన్న వేద టెంపుల్‌లో ఆరుగురు వేద పండితులు అత్యంత నిష్ఠతో చంద్రబాబు గోత్ర నామాల మీద అర్చన చేశారు. చంద్రబాబుకు ఆయురారోగ్యాలు సిద్ధించి తిరిగి అతి త్వరలో ప్రజా సేవలో పాల్గొంటారని వారు దీవించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం, జనసేన అభిమానులు హాజరయ్యారు.