Youtuber: యూట్యూబ్‌లో కంటెంట్‌ ఉన్నోడికి కటౌట్‌ అవసరం లేదంటున్న తెలుగు యూట్యూబర్‌

ABN , First Publish Date - 2023-04-27T12:02:29+05:30 IST

యూట్యూబర్స్‌లో ఈ ‘ఫన్‌’టాస్టిక్‌ యూట్యూబర్‌ చేసే వ్లాగ్స్‌ తీరే వేరు. అంత ప్రత్యేకమా? అంటారా.. అవును మరి! ఛానల్‌ పేరు ‘నమస్తే లండన్‌ తెలుగు’.

Youtuber: యూట్యూబ్‌లో కంటెంట్‌ ఉన్నోడికి కటౌట్‌ అవసరం లేదంటున్న తెలుగు యూట్యూబర్‌

యూట్యూబర్స్‌లో ఈ ‘ఫన్‌’టాస్టిక్‌ యూట్యూబర్‌ చేసే వ్లాగ్స్‌ తీరే వేరు. అంత ప్రత్యేకమా? అంటారా.. అవును మరి! ఛానల్‌ పేరు ‘నమస్తే లండన్‌ తెలుగు’. యూట్యూబర్‌ పేరు భవాని. లండన్‌ జీవితం, అక్కడి జీవన విధానం, సంస్కృతిని పరిచయం చేస్తూ అందులో కాసింత హాస్యం మిళితం చేసే ఆ వీడియోలు నెట్లింట్లో పాపులర్‌. ఈ సందర్భంగా యూట్యూబర్‌ భవానీని ‘నవ్య’ పలకరించగా.. ఆమె తన ఛానల్‌తో పాటు జీవిత విశేషాల్నీ చెప్పుకొచ్చారిలా..

‘‘మా ఛానల్‌ ‘నమస్తే లండన్‌ తెలుగు’ ప్రధానమైన ఉద్దేశ్యం ‘కంటెంట్‌’. యూట్యూబ్‌లో కంటెంట్‌ ఉన్నోడికి కటౌట్‌ అవసరం లేదనేది ఈ భవానీ భావన. ఛానల్‌ హిట్టయ్యాక ఎన్నో ఆత్మీయమైన పలకరింపులు. లండన్‌లో ఉండే మిత్రులనుంచి ప్రత్యేక గౌరవం లభిస్తున్నాయి. ‘మీ ఛానల్‌ చూస్తుంటే నవ్వాగట్లేదు. భలే ఉన్నాయి మీ సరదా కబుర్లు’ అంటున్నారు కొందరు. ‘నమస్తే లండన్‌ తెలుగు’ చూస్తే బాధలన్నీ మర్చిపోయి సంతోషంగా ఉంటామ’ని మరికొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

‘యూట్యూబ్‌ ప్రారంభించాలంటే.. ఇన్నాళ్లూ భయంగా ఉండేది. త్వరలో యూట్యూబర్‌ అవుతా. ఈ ధైర్యాన్ని, స్ఫూర్తిని ఇచ్చింది మీరే’ అంటూ మెసేజ్‌ చేసింది ఒకామె. ఇలాంటి మెసేజ్‌లు చదివినప్పుడు.. అసలు నేనేనా ఇదంతా చేసిందనిపిస్తుంది. మీకో విషయం చెప్పనా..! ఛానెల్‌ ప్రారంభించిన కొత్తలో ‘ఎవర్రా మీరంతా? ఎన్నారై యూట్యూబర్స్‌ ఇలా మాతో ఆడుకుంటున్నార’ంటూ ఘాటు కామెంట్లు చేశారు. ఆ నెగటివ్‌ కామెంట్ల నుంచి పాజిటివ్‌ వైబ్రేషన్స్‌ వైపు రావటానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది.. కాదు కాదు ఇష్టపడి పని చేయాల్సి వచ్చింది.

అలా యూట్యూబర్‌ అయ్యా..

బ్యాంకులో ఉద్యోగం చేసేదాన్ని. మా ఆయనకు 2018లో లండన్‌లో ఉద్యోగం రావటంతో.. ఉద్యోగానికి సెలవు పెట్టి అక్కడికే వెళ్లా. అలా వెళ్లి వస్తూండేదాన్ని. కొవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో మావారికి లండన్‌లో ఉద్యోగం పర్మినెంటయ్యింది. దీంతో నా ఉద్యోగానికి రాజీనామా చేశా. వీకెండ్స్‌లో లండన్‌ వీధుల్లో, చుట్టు పక్కల ప్రదేశాలకు వెళ్లినపుడు అక్కడి విషయాలు కొత్తగా అనిపించేవి. ముఖ్యంగా అక్కడి రూల్స్‌, జనాల తీరు బావుంటుంది. బ్రిటీషర్ల ప్రొఫెషనలిజమ్‌ అద్భుతం. ఇకపోతే మనమెవరో తెలీకున్నా.. నవ్వుతూ పలకరిస్తారు. టన్నులకొద్దీ సారీలు, థ్యాంక్స్‌లు చెబుతారు. అసలు వీళ్లేనా ప్రపంచదేశాలను బానిసలుగా చేసుకుందనే ప్రశ్న మనలో తలెత్తకమానదు! లండన్‌లో కొన్ని చూసినప్పుడు.. ఆ ఎగ్జయిట్‌మెంట్‌ ఎవరితోనైనా పంచుకోవాలనిపించేది. సరిగ్గా అదే సమయంలో లండన్‌లోని ‘సమయాన కథలు’ లాంటి తెలుగు యూట్యూబ్‌ ఛానల్స్‌ను ఫాలో అయ్యేవాళ్లం. ఒకరోజు మా ఆయన.. ‘నీకెలాగూ క్రియేటివ్‌ ఆలోచనలున్నాయి. నీ స్టయిల్‌లో ఇక్కడి విశేషాల్ని చెప్పు. యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభిద్దాం’ అన్నారు. మనకైతే వాట్సప్‌ డీపీలు పెడితే.. ఎవరేమనుకుంటారోననే భయం. యూట్యూబర్‌గా మారటమనేది.. దూరపు ఆలోచన నా విషయంలో. సోషల్‌మీడియాలో జనాలు ఆడేసుకుంటారేమో అనే అభిప్రాయాన్ని చెప్పాను. ‘పని చేసుకుంటూ వెళ్లు. వీకెండ్స్‌లో సాయం చేస్తా’నన్నారు. దీంతో కేవలం వారంలోపే యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించా.

Untitled-7.jpg

ఛానల్‌ ఆపేద్దామనుకున్నా! అయితే..

కొవిడ్‌ కాలానికి ముందు టిక్‌టాక్‌లో వీడియోలు చేసేదాన్ని. అయితే వాటిని ఎప్పుడూ పబ్లిక్‌లో పెట్టలేదు. ప్రైవేట్‌గానే ఉంచి ఆ వీడియోలను కుటుంబసభ్యులకు, మిత్రులకు షేర్‌ చేసేదాన్ని. యూట్యూబర్‌ అయ్యాక కూడా ఐఫోన్‌తోనే వీడియోలు తీశా. వీకెండ్స్‌లో అక్కడి మా లైఫ్‌ను, జనాల లైఫ్‌ స్టయిల్‌ను క్యాప్చర్‌ చేశా. ఏ వీడియో చేసినా థంబ్‌నెయిల్స్‌ ఆకర్షణీయంగా పెట్టేదాన్ని. అయితే ప్రతి వీడియోలో సమాచారానికి హాస్యం జోడించటం మాత్రం ఆపలేదు. వాయిస్‌ ఓవర్‌తో వీడియోల్ని ఎడిట్‌ చేసుకునేదాన్ని. ‘నీ హానెస్ట్‌ అప్రోచ్‌ బావుంద’న్నారు మా ఆయన. యూట్యూబ్‌ను అర్థం చేసుకునే సరికి కొన్ని నెలల సమయం పట్టింది. వ్యూస్‌ రాకున్నా.. వీడియోలు చేయటం ఆపట్లేదు. యూట్యూబ్‌ షార్ట్స్‌ చేయటం.. ఇన్‌స్టాలో అకౌంట్‌ ఓపెన్‌ చేయటం వల్ల జనాలు మా వైపు వచ్చారు. ఇద్దరు తెలుగు ట్రావెల్‌ యూట్యూబర్స్‌ గొడవ జరిగేప్పుడే.. మా వీడియో ఒకటి వైరల్‌ అయింది. అప్పుడే ‘ఎవర్రా మీరంతా?’ అంటూ ఆ ఫ్రస్ర్టేషన్‌ మా ఛానెల్‌పై చూపించారు. కామెంట్స్‌ను తట్టుకోలేక బాధపడ్డాను. మనకెందుకు ఇదంతా? అనిపించి.. ఛానెల్‌ ఆపేద్దామనుకున్నా. అయితే.. ‘జోక్స్‌ మిక్స్‌ చేసి బాగా చెబుతున్నావ్‌. ఇంతకంటే ఆసక్తికరమైన వీడియోలెవరు చేస్తారు? తీరా ఇప్పుడు వదిలేస్తే ఎలా? బావుంది కాబట్టే నీ వీడియో వైరల్‌ అయింది కదా!’ అంటూ నచ్చచెప్పారు. అయినా వద్దనుకున్నా. ‘ముందే అనుకున్నాం. సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో ఇవన్నీ సాధారణం. మనం తప్పు చేయలేదు. జనాల్ని ఎంటర్‌టైన్‌ చేస్తున్నాం. మనకు తెలీని.. ఎవరెవరో వచ్చి ఏదేదో అంటే.. అవన్నీ పట్టించుకోకూడదు. మన ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియాకే తప్పట్లేదు ఈ కామెంట్లు. మనమెంత?. జనాలకు ఒక్కొక్కరికి ఒక్కో వ్యూ ఉంటుంది. ఎవరికైనా తిట్టడం సులువు. అయితే నీ మాదిరి పని చేయటం కష్టం. మరింతగా క్వాలిటీ వీడియోలు చేయి’ అంటూ భుజం తట్టారు. ఆ క్షణం.. అదెంతో చిన్న ఇబ్బంది అనిపించింది. అన్నట్లు ఈ సందర్భంగా.. నా నేపథ్యం గురించి కొంత చెప్పాల్సిందే.

నాన్న కళ్లల్లోని ఆనందం మర్చిపోలేను..

వైజాగ్‌లో పుట్టి పెరిగాన్నేను. అమ్మ గృహిణి. నాకో అన్నయ్య ఉన్నారు. ఇకపోతే మా నాన్న బ్యాంకులో ఓ చిన్న ఉద్యోగం చేసేవారు. దిగువ మధ్యతరగతి కుటుంబం మాది. తక్కువ ఫీజుతోనే డిగ్రీ వరకూ చదివా. ఐసెట్‌ రాస్తే ఎమ్‌.సి.ఎ. చదవొచ్చు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వస్తే ఇంట్లోవాళ్లకు అండగా ఉండొచ్చు అనుకున్నా. ఇంట్లో చెబితే.. ఆర్థిక కష్టాల వల్ల ఐసెట్‌ కోచింగ్‌కు పంపలేమన్నారు. దీంతో రెన్నెళ్లపాటు ఇంట్లోనే చదివి.. ఐసెట్‌లో 285 ర్యాంకు సాధించా. ఆంధ్రా విశ్వ విద్యాలయంలో సీట్‌ రాలేదు. అయినా ఇంట్లో వాళ్లు నా ప్రతిభపై నమ్మకంతో గాయత్రీ కళాశాలలో ఎమ్‌.సి.ఎ. చేర్పించారు. అప్పట్లో పోటీ పరీక్షల హవా నడిచేది. దీంతో బ్యాంకు పరీక్ష రాశా. వెంటనే ఉద్యోగం వచ్చింది. బ్యాంకులో చిన్న ఉద్యోగం చేసే మా నాన్న.. పైస్థాయి బ్యాంకు ఉద్యోగం నాకొచ్చిందని ఎంతో సంబరపడ్డారు. కూతురు నాకంటే ఉన్నత స్థాయికి చేరిందని గొప్పగా అందరికీ చెప్పారు. ఆ రోజు మా నాన్న కళ్లలో చూసిన ఆనందం మర్చిపోలేనిది. ఇక ఎమ్‌.సి.ఎ. చదువుతూనే.. బ్యాంకు ఉద్యోగం చేసేదాన్ని. బ్యాంకు ఉద్యోగంలో ఒత్తిడి ఉండేది. దీంతో విశ్రాంతి తీసుకుందామనుకున్నా. సరిగ్గా అప్పుడే నా పెళ్లయింది. మా వారు నా ఎమ్‌.సి.ఎ. క్లాస్‌మేట్‌. మా భావాలు కలిశాయి. దీంతో ప్రేమవివాహం చేసుకున్నాం.

You.jpg

మా ఆయన సహకారం వల్లనే..

మా ఆయన పేరు కళ్యాణ చక్రవర్తి. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. మా ఇద్దరికీ ప్రయాణాలు, సినిమాలు పిచ్చి. వైజాగ్‌లో ఉన్నప్పుడు ప్రతి కొత్త సినిమా చూసేవాళ్లం. ఇప్పుడూ ఓటీటీలో రోజుకో సినిమా అయినా చూడందే నిద్రపట్టదు. లండన్‌ వీధుల్లో విహరిస్తూ వ్లాగ్స్‌ చేస్తున్న నేను.. ఒక్కసారి వైజాగ్‌ నుంచి వచ్చిన ప్రయాణాన్ని వెనక్కి చూస్తే నాకు నేనే ఆశ్చర్యపోతాను. ఈ ప్రయాణం ఊహించనిది. పెళ్లయ్యాక చాలా మారాను. కొన్ని భయాలు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌, తక్కువేమో అనే భావనలతో ఒత్తిడికి లోనయ్యేదాన్ని. వాటన్నింటినీ.. మా ఆయన పోగొట్టారు. ఇలా యూట్యూబర్‌గా రాణిస్తున్నానంటే.. తన వల్లనే. చాలా మందికి ప్రతిభ ఉంటుంది. అయితే దాన్ని ఎలా ప్రదర్శించాలన్నది తెలీదు. అక్కడే ఇబ్బంది పడతారు. మామూలు ప్రతిభ ఉన్నా చాలు.. క్రమం తప్పకుండా పని చేస్తేనే ఫలితం ఉంటుందని మా ఆయన వల్లనే నేర్చుకున్నా. నా విజయం చూశాక.. మావారి ఆనందానికి అవధుల్లేవు. ఒక్కటే చెబుతా.. ఇవాళ నేనేమి సాధించినా.. అది మా ఆయన సహకారం వల్లనే సాధ్యమైంది.

అదే నా కల..

నా మాదిరే.. ఎవరైనా సరే మీ ప్రాంతంలోని వీడియోలు చేయచ్చు. ఇక్కడ విజయం సాధించటం అదృష్టమేమీ కాదు. జనాలను కన్‌ఫ్యూజ్‌ చేయకుండా.. ఒకే థీమ్‌తో వీడియోలను చేయాలంతే. కంటెంట్‌లో దమ్ముంటే యూట్యూబ్‌ అల్‌గారిథమ్‌ ఎవరినైనా ముందుకు నడిపిస్తుంది. వారానికి ఒకట్రెండు వీడియోలు చేయాలి. నాకు తెలిసిన కొందరు.. పనిలేక వీడియోలు చేస్తుందని సూటిపోటి మాటలన్నారు. ఇలాంటివి పట్టించుకోలేదు. ఎవరికైనా ఆ ఫేజ్‌ దాటితే.. విజయం వరిస్తుంది. నేను ఇప్పటిదాకా 165 వీడియోలు చేశా. 2 లక్షల మంది సబ్‌స్కైబర్లు ఉన్నారు. సోషల్‌ మీడియా పవర్‌ఫుల్‌. మీరు యునిక్‌గా ఉంటూ ఫాలోవర్లను తెచ్చుకుంటే సరి.. మీ దగ్గరకే అందరూ వస్తారు. సామాన్యులే క్రేజ్‌ సంపాదించి.. వాణిజ్యపరమైన ఒప్పందాల్ని సంస్థలతో కుదుర్చుకుంటున్నారు. సెలబ్రిటీలను కలుస్తున్నారు. ఒక్కమాటలో సోషల్‌ మీడియాను బాగా ఉపయోగించుకుంటే.. ఇది యువతకో వజ్రాయుధం. నాకు ఇంగ్లీషు పుస్తకాలు చదివే అలవాటుంది. మొన్నా మఽధ్య ఆరోగ్యానికి సంబంధించిన పుస్తకం చదివి ఓ వ్లాగ్‌ చేశా. ‘పుస్తకాల్లో చదివింది చెప్పండి’ అంటూ చాలా కామెంట్లు వచ్చాయి. నావెల్స్‌తో పాటు ఆరోగ్యం, డబ్బు, చిన్నపిల్లల పుస్తకాలు చదవటం ఇష్టం. జీవితం విషయానికొస్తే.. ఎప్పుడూ ఆనందంగా ఉండాలనేదే లక్ష్యం. మనకు నచ్చిన పని చేయాలి. ఆరోగ్యం కోసం ఫిట్‌నెస్‌, డబ్బు ఖర్చు చేయటం పట్ల క్రమశిక్షణ ఉండాలి. ఇలాంటివి చర్చించటానికే ‘బి హ్యాపీ విత్‌ భవానీ’ పేరుతో మరో యూట్యూబ్‌ ఛానల్‌ను ఇటీవలే ప్రారంభించా. ఇష్టమైన రచయిత ‘హ్యారీపోటర్‌’ రచయిత జె.కె. రౌలింగ్‌. ఓ పుస్తకం రాయాలన్నదే నా కల.’’ -రాళ్లపల్లి రాజావలి

Updated Date - 2023-04-27T12:02:29+05:30 IST