Saudi Arabia: సౌదీలో ఘోర అగ్నిప్రమాదం.. తెలుగు ప్రవాసుడు సజీవదహనం!

ABN , First Publish Date - 2023-09-20T11:35:23+05:30 IST

సౌదీ అరేబియా (Saudi Arabia) లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం (Fire mishap) లో ముగ్గురు ప్రవాసులు మృతిచెందారు. చనిపోయిన ముగ్గురిలో ఓ తెలుగు ప్రవాసుడు (Telugu Expat) కూడా ఉన్నాడు.

Saudi Arabia: సౌదీలో ఘోర అగ్నిప్రమాదం.. తెలుగు ప్రవాసుడు సజీవదహనం!

ఎన్నారై డెస్క్: సౌదీ అరేబియా (Saudi Arabia) లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం (Fire mishap) లో ముగ్గురు ప్రవాసులు మృతిచెందారు. చనిపోయిన ముగ్గురిలో ఓ తెలుగు ప్రవాసుడు (Telugu Expat) కూడా ఉన్నాడు. మృతుడిని తెలంగాణలోని నిర్మల్ జిల్లా (Nirmal Dist) దిల్వార్‌పూర్ మండలానికి చెందిన 39ఏళ్ల మహమ్మద్ జావీద్ (Mohammed Javid) గా గుర్తించారు. జెడ్డాలోని సౌదీ కుటుంబం వద్ద అతడు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బంగ్లాదేశ్‌ (Bangladesh) కు చెందిన మరో ఇద్దరు కార్మికులతో కలిసి ఒక వసతి గృహంలో నివసిస్తున్నాడు. అయితే, తాజాగా వారి గదిలోని ఏసీ యూనిట్‌లో (AC Unit) షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో జావీద్‌తో పాటు ఇద్దరు బంగ్లాదేశీలు కూడా ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు గాఢ నిద్రలో ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వారిని మంటలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. దాంతో వారు ఆ మంటల్లో చిక్కుకొని జీవదహనం అయ్యారు.

ఇక స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బందికి వారి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయి కనిపించాయి. యూఏఈలో (UAE) పనిచేస్తున్న వారి బంధువులలో ఒకరు భారతదేశంలోని మృతుడి కుటుంబానికి ఈ విషాదం గురించి తెలియజేశారు. మృతుడికి తల్లి, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ కుటుంబానికి జావీద్ మాత్రమే జీవనాధారం. జావీద్ జీవనోపాధి కోసం ఆరేళ్ల క్రితం సౌదీ (Saudi) వెళ్లాడు. ఇటీవలే క్యాన్సర్‌ కారణంగా తన తండ్రిని కోల్పోయిన జావీద్ త్వరలోనే ఇండియా (India) కి తిరిగి రావాలని అనుకున్నాడు. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది. జావీద్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి రప్పించేందుకు కుటుంబ సభ్యులు భారత ఎంబసీ (Indian Embassy), అక్కడి ఇండియన్ కమ్యూనిటీ కార్యకర్తల సహాయాన్ని కోరుతున్నారు.

Golden Visa: విదేశీయులకు రికార్డుస్థాయిలో గోల్డెన్ వీసాలు జారీ చేసిన దుబాయ్..!

Updated Date - 2023-09-20T11:37:22+05:30 IST