AP Cabinet: ఆ మంత్రులకు క్లాస్ పీకిన సీఎం..ఇంతకీ పొగిడింది ఎవరిని అంటే..!?
ABN , First Publish Date - 2023-02-13T13:18:30+05:30 IST
కొద్దిరోజుల క్రితం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. కొందరు మంత్రులకు జగన్ ఇచ్చిన
మొన్నామధ్య జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో కొన్ని ఆసక్తికర సన్నివేశాలు వెలుగు చూశాయి. భారీ ఎజెండాతో కొనసాగిన క్యాబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. అంతవరకూ బాగానే ఉన్నా.. ఆ తర్వాత జరిగిన పరిణామాలే కొందరు మంత్రులకు షాకిచ్చాయి. మంత్రులతో విడిగా సమావేశమైన ముఖ్యమంత్రి.. ముగ్గురి పనితీరును పొగిడి.. ఇద్దరికి మాత్రం సీరియస్‌గా క్లాస్ పీకడం చర్చగా మారింది. ఇంతకీ.. పొగిడింది ఎవరిని?.. క్లాస్ పీకిందెవరికి?.. అసలు.. ఏపీ కేబినెట్ సమావేశంలో ఏం జరిగింది?.. అనే మరిన్ని విషయాలను ఏబీఎన్ ఇన్‌సైడ్‌లో తెలుసుకుందాం..
ఆ మంత్రిని అభినందించడం పట్ల సహచర మంత్రులే షాక్
కొద్దిరోజుల క్రితం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. కొందరు మంత్రులకు జగన్ ఇచ్చిన ఝలక్‌తో వైసీపీలో హీట్ పుడుతోంది. ముందు.. ప్రశాంతంగా జరిగిన కేబినెట్ సమావేశంలో.. ఏపీ మంత్రులంతా మీ మీ జిల్లాల్లో సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సీఎం జగన్‌రెడ్డి బాగానే సూచించారు. లేనిపక్షంలో అంతర్గత విభేదాలతో ఇబ్బందులు తలెత్తుతాయని మంత్రులతో అన్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో.. ధాన్యం సేకరణ విషయంలో ఉన్న ఇబ్బందులు క్రమంగా తొలగిపోతున్నాయని మంత్రి దాడిశెట్టి రాజా ప్రస్తావించగా.. ఆ అంశంలో సివిల్ సప్లైస్ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు బాగా పని చేశారని జగన్‌రెడ్డి ప్రశంసించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నిజానికి.. ఏపీలో చాలాచోట్ల ధాన్యం డబ్బులు కోసం రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. అలాంటి సమయంలో.. సీఎం జగన్.. మంత్రిని అభినందించడం పట్ల సహచర మంత్రులే షాకైనట్లు ప్రచారం జరుగుతోంది.
వైద్యారోగ్య శాఖ మంత్రి విడుదల రజిని కూడా..
మరోవైపు.. వైద్యారోగ్య శాఖ మంత్రి విడుదల రజిని కూడా.. ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగులు నిర్వహిస్తూ.. ఆ శాఖను ముందుకు తీసుకెళ్తున్నారంటూ ఆమెను సీఎం జగన్ పొగడ్తల్లో ముంచెత్తారని టాక్ వినిపించింది. అలాగే.. విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకురావడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ.. మంత్రి బొత్స సత్యనారాయణ, తన సీనియారిటీతో క్రమంగా వాటిని సరిదిద్దుతున్నారని చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి.. విద్యాశాఖలో నేటికీ పరిస్థితులు చక్కబడలేదు. డ్రాప్ ఔట్స్ రేట్ పెరుగుతుండడం, చాలామంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ల వైపు చూస్తుండడం లాంటి పరిస్థితులే అందుకు నిదర్శమని చెప్పొచ్చు.
ఆ యాప్‌లను తొలగించాలంటూ పెద్దలకు విజ్ఞప్తి
ఇక.. ఫేస్ రికగ్నైజేషన్ యాప్‌తోపాటు, పలు యాప్‌లను టీచర్లు వాడాల్సి వస్తుండడంతో వారంతా జగన్ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. ఆ యాప్‌ల బాధ తొలగించాలంటూ ప్రభుత్వ పెద్దలకు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. అయినా.. మంత్రి పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు.. కరోనా తర్వాత పాఠశాల విద్య పడకేసింది. అలా.. విద్యాశాఖలో ఎన్నో సమస్యలు దర్శనమిస్తున్నా.. ముఖ్యమంత్రి మాత్రం.. మంత్రి బొత్సాను పొగడడం మిగతా వారిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ క్రమంలో.. మంత్రి బొత్సను మొహమాటం కొద్దీ పొగిడారా అని సహచర మంత్రులు చర్చించుకుంటున్నారు.
ఇద్దరిని తిట్టి.. ముగ్గుర్ని పొగిడిన సీఎం జగన్
ఇదిలావుంటే.. ఏపీ కేబినెట్ భేటీలో కొందరు మంత్రులకు సీఎం జగన్‌రెడ్డి క్లాస్ పీకడం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ప్రధానంగా.. ఓ ఇద్దరు మంత్రుల విషయంలో జగన్ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ వేరొకరి నియోజకవర్గంలో వేలు పెడుతుండడం పట్ల అసహనం వ్యక్తం చేసినట్లు టాక్ నడుస్తోంది. అలాగే.. టూరిజం శాఖ మంత్రి రోజా అనుకున్న స్థాయిలో పెర్ఫామెన్స్ చూపలేకపోతున్నారని జగన్ అన్నట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా.. ఏపీ కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి జగన్.. ఇద్దరిని తిట్టి.. ముగ్గుర్ని పొగిడినట్లు చేశారు. అయితే.. సమస్యలన్నీ అలాగే ఉండగా.. కొందరు మంత్రులను పొగడడం విమర్శలకు తావిస్తోంది. ఏదేమైనా.. ఏపీ కేబినెట్ భేటీలో జగన్‌రెడ్డి తీరు.. కొందరిని సంతృప్తి పరిస్తే.. మరికొందర్ని అసంతృప్తికి గురిచేసింది. అయితే.. పొగడ్తలు, తిట్లు విషయంలో జగన్‌రెడ్డి అసలు ఉద్దేశ్యం ఏంటన్నది తెలియాల్సి ఉంది.