Bandi Sanjay: పాపం బండి సంజయ్.. పదవి నుంచి తప్పుకున్నా వదలడం లేదే..!
ABN , First Publish Date - 2023-07-07T15:35:13+05:30 IST
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌కుమార్ తప్పుకున్నా ఆయనపై పాతతరం బీజేపీ నేతలు అసమ్మతి రాగాలను వినిపిస్తూనే ఉన్నారు. అధ్యక్ష పదవి నుంచి ఆయన దిగిపోయినా ఆయన తీసుకున్న నిర్ణయాల ఫలితాలను తాము అనుభవిస్తూనే ఉన్నామని, వాటిని సరిచేయాల్సిన అవసరం ఉందంటూ అసమ్మతి నేతలు కొత్త నాయకత్వాన్ని కోరడానికి సిద్ధమవుతున్నారు.
పదవి నుంచి తప్పుకున్నా తప్పని అసమ్మతి
కరీంనగర్‌లో బండి వ్యతిరేక వర్గం సమావేశం
అధ్యక్షుడిగా తీసుకున్న నిర్ణయాలపై కిషన్‌రెడ్డికి ఫిర్యాదు చేయాలని నిర్ణయం
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి (Telangana BJP) నుంచి బండి సంజయ్‌కుమార్ (Bandi Sanjay) తప్పుకున్నా ఆయనపై పాత తరం బీజేపీ నేతలు అసమ్మతి రాగాలను వినిపిస్తూనే ఉన్నారు. అధ్యక్ష పదవి నుంచి ఆయన దిగిపోయినా ఆయన తీసుకున్న నిర్ణయాల ఫలితాలను తాము అనుభవిస్తూనే ఉన్నామని, వాటిని సరిచేయాల్సిన అవసరం ఉందంటూ అసమ్మతి నేతలు కొత్త నాయకత్వాన్ని కోరడానికి సిద్ధమవుతున్నారు.
గురువారం పెద్దపల్లి మాజీ శాసన సభ్యుడు, బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి నివాసంలో ఈ అసమ్మతి నేతలు సమావేశమైనట్లు సమాచారం. రామ కృష్ణా రెడ్డితోపాటు కిసాన్ మోర్చా మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి పొల్సాని సుగుణాకర్‌రావు, మాజీ శాసనసభ్యుడు, పెద్దపల్లి జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు కాసిపేట లింగయ్య, రామ గుండం సీనియర్ నాయకుడు కౌశిక్‌హరి, చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా గతంలో పోటీ చేసిన లింగంపల్లి శంకర్, పెద్దపల్లి జిల్లాకే చెందిన నాయకుడు సం జీవరెడ్డి, మరికొందరు ఈ సమావేశంలో పాల్గొన్నారని తెలిసింది.
ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని..
సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కాలంలో వేసిన జిల్లా స్థాయి, తదితర స్థాయి కమిటీల్లో ఆయన సూచించిన వారికి మాత్రమే పదవులు వచ్చాయని సమావేశంలో పాల్గొన్నవారు అభిప్రాయపడ్డట్టు సమాచారం. దశాబ్దాలుగా పార్టీ కార్యకర్త లుగా, నాయకులుగా పనిచేసి అనేక త్యాగాలు చేసిన వారికి పదవులు దక్కలేదని, వారి సేవలను ఏమాత్రం పట్టించు కోలేదని అన్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని రాష్ట్ర నూతన అధ్యక్షుడు కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఆర్‌ఎస్‌ఎస్, పార్టీలోని కొందరు ఆయనకే ప్రాధాన్యమిచ్చి పార్టీ కోసం త్యాగాలు చేసిన వారిని తొక్కే శారని, ఈ విషయాన్ని కూడా కిషన్‌రెడ్డికి, ఆర్‌ఎస్‌ఎస్ రాష్ట్ర బాధ్యుల దృష్టికి తీసుక వెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం.
12న హైదరాబాద్‌కు..
ఈ నెల 12న ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని 13 అసెంబ్లీ నియో జకవర్గాల నుంచి నియోజకవర్గానికి 5 నుంచి 10 మంది సీనియర్ నాయకులు ఒక బృందంగా ఏర్పడి హైదరాబాద్‌కు వెళ్లి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని, ఆర్‌ఎస్‌ఎస్ పెద్దలను కలవాలని నిర్ణయించినట్లు తెలిసింది. తమకు జరిగిన అన్యాయాన్ని, అర్హులైన వారిని అణిచివేసిన విధానాన్ని, పార్టీ కోసం త్యాగాలు చేసిన వారిని విస్మరించిన విషయాన్ని దృష్టికి తీసుకువెళ్లాలని వారు అనుకుంటున్నారు.
సంజయ్ హయాంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలను సమీక్షించి వాటిని సరిచేయాల్సిన అవసరాన్ని పార్టీ నేతల దృష్టికి, ఆర్‌ఎస్‌ఎస్ బాధ్యులకు వివరించను న్నట్లు సమాచారం. జిల్లా కమిటీతోపాటు అన్ని స్థాయిల కమిటీలను మళ్లీ వేయాలని, అర్హులైన వారందరికి అవకాశం కల్పించాలని కోరనున్నట్లు సమాచారం. బండి సంజయ్‌కుమార్ రాష్ట్ర అధ్యక్ష పదవిని వీడినా ఆయన సొంత జిల్లాలో ఆయనపై ఇంకా అసమ్మతి రాగాలు వినిపిస్తూ ఉండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.