BRS MLC Kavitha : కేసీఆర్‌తో కీలక భేటీ తర్వాత నేరుగా ఇంటికెళ్లిన కవిత.. ఏం చేశారంటే.. హ్యాపీగా ఫీలవుతున్న బీఆర్ఎస్ శ్రేణులు..
ABN , First Publish Date - 2023-03-22T20:34:24+05:30 IST
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam Case) కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత...
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam Case) కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) మూడ్రోజుల విచారణ ముగించుకుని హైదరాబాద్ (Hyderabad) విచ్చేశారు. ఇప్పటి వరకూ మొత్తం మూడ్రోజుల పాటు సుమారు 27 గంటలకు పైగా కవితను ఈడీ అధికారులు (ED Officers) విచారించారు. మొదటి రోజు లిక్కర్ కేసులో సంబంధాలు, పాత్రపై ఆరాతీయగా.. రెండోరోజు అరుణ్ రామచంద్ర పిళ్లై, బుచ్చి బాబుతో వ్యాపార సంబంధాల గురించి.. మూడో రోజు పూర్తిగా మొబైల్ ఫోన్ల గురించే ఈడీ ప్రశ్నల వర్షం కురిపించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ కవితను తీవ్ర ఒత్తిడికి గురిచేసినా.. చెరగని చిరునవ్వుతో మొక్కవొని ధైర్యంగా నిలబడ్డారు. అయితే.. ఇప్పటి వరకూ అయితే మరోసారి ఈడీ విచారణకు రావాలని కానీ.. ఈడీ విచారణ పూర్తిగా అయిపోయిందని కానీ అధికారుల నుంచి ఎలాంటి స్పష్టత లేదు. దీంతో ఢిల్లీ నుంచి కవిత హైదరాబాద్‌కు వచ్చేశారు. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్లిన కవిత.. ఢిల్లీలో జరిగిన పరిణామాలు, ఈడీ విచారణ గురించి సీఎం కేసీఆర్‌కు (CM KCR) వివరించారు. కవిత వెంట భర్త అనిల్, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ (Ministers KTR, Harish Rao) ఇద్దరూ ఉన్నారు. సాయంత్రం ఆరు గంటల వరకూ ప్రగతిభవన్‌లో కేసీఆర్, కవిత, మంత్రులు సమాలోచనలు చేశారు.
నేరుగా ఇంటికెళ్లి..!
ప్రగతి భవన్ నుంచి నేరుగా బంజారాహిల్స్‌లోని (Banjarahills) తన నివాసానికి వెళ్లిన కవిత.. కుటుంబ సభ్యులతో కలిసి ఉగాది వేడుకలను (Ugadi Celebrations) ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. తన ఆరాధ్య దైవానికి కవిత పూజలు నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులు తీర్థ ప్రసాదాలు పంచిపెట్టిన కవిత.. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో (Kavitha Family) కలిసి ముచ్చటించారు. వాస్తవానికి కవితకు దైవ భక్తి చాలా ఎక్కువే. ఈ విషయం చాలా సందర్భాల్లో తెలంగాణ ప్రజలు చూసే ఉంటారు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఉగాది పర్వదినాన్ని కుటుంబ సభ్యులతో జరుపుకోవడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఇవాళ ఉగాది పూజకు సంబంధించిన ఫొటోలను కవిత తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నారు. ఈ ట్వీట్ చూసిన బీఆర్ఎస్ శ్రేణులు చాలా హ్యాపీగా ఫీలవుతున్నాయి. కొందరు కవిత వీరాభిమానులు ఉగాది పండుగ శుభాకాంక్షలు చెబుతుండగా.. ఇక బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు అయితే చిత్రవిచిత్రాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ‘ఏమీ చేసినా లాభం లేదు.. తప్పు చేసినందుకు చిప్పకూడు తప్పదు..’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు.. ‘మానవ సేవే మాధవ సేవ. అందులోని పరమార్థాన్ని పాటించినప్పుడే, మనం చేసే పూజలకి సార్థకత ఉంటుంది. అలా కాని పక్షంలో, అది కేవలం మనం చేస్తున్న పాప భీతితో భగవంతున్ని ప్రసన్నం చేసుకొనే ప్రయత్నమే అవుతుంది తప్ప మోక్షం అయితే సిద్ధించదు’ అని మరికొందరు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే కవితను విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్న వారిని మాత్రం బీఆర్ఎస్ కార్యకర్తలు అంతే రీతిలో కౌంటర్ల వర్షం కురిపిస్తున్నారు.
ఇవాళ ఉదయం ఇలా..!
ఇవాళ ఉదయమే తెలుగు ప్రజలందరికీ ట్విట్టర్ వేదికగా కవిత శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలుగింటి నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా.. ప్రజలంతా ప్రగతిపథంలో ముందుకు సాగాలని, ప్రతి ఇంటా ఆరోగ్యం-ఆనందంతోపాటు సిరిసంపదలు వెల్లివిరియాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. ప్రజలందరికీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు’ అని కవిత ట్వీట్ చేశారు. ఆ తర్వాత భర్త అనిల్‌తో కలిసి దిగిన సెల్ఫీని కవిత పోస్ట్ చేశారు. ఈ పోస్టుకు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున స్పందించాయి. ‘మీ విఘ్నాలన్ని తొలిగి, మీరు కడిగిన ముత్యంలా తిరిగి ప్రజాక్షేత్రంలో మమేకం కావాలని తెలంగాణ ప్రజలంతా మనస్పూర్తిగా కోరుకుంటూ ... మీకు శోభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తెలంగాణ ఆడపడుచు కవితక్క గారు’ అని వీరాభిమానులు కామెంట్స్ చేశారు. మరోవైపు.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కూడా కవిత ఓ వీడియోను తన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.
మొత్తానికి చూస్తే.. కవిత చేసిన ఈ ట్వీట్స్‌కు అటు అభిమానులు.. ఇటు విమర్శకులు, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు చేస్తున్న కామెంట్స్‌తో ట్విట్టర్ మోతెక్కిపోతోంది. ఇవాళ ఉదయం నుంచి కవిత గురించి ట్విట్టర్ వేదికగా పెద్ద చర్చే జరుగుతోంది. ఈ విమర్శకుల కామెంట్స్‌కు కవిత ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే.