Gannavaram : నివురుగప్పిన నిప్పులా గన్నవరం.. దేవినేని ఉమా అరెస్ట్.. కనిపించకుండా పోయినా పట్టాభి.. అసలేం జరుగుతోంది..!?
ABN , First Publish Date - 2023-02-20T21:46:24+05:30 IST
గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు విధ్వంసకాండ సృష్టించాయి. టీడీపీ కార్యాలయంపై వైసీపీకి చెందిన కొందరు కార్యకర్తలు, నేతలు దాడిచేసి కంప్యూటర్లు, ఫర్నీచర్ ధ్వసం చేశారు. అంతటితో ఆగని వైసీపీ కార్యకర్తలు గూండాల్లా మారి అక్కడున్న టీడీపీ నేతల వాహనాలపై పెట్రోలు పోసి నిప్పంటించారు. కత్తులతో వీరంగం సృష్టించి ఆఫీసు ముందున్న ఫ్లెక్సీలు, బ్యానర్లను చింపేశారు...
గన్నవరం (Gannavaram) నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు విధ్వంసకాండ సృష్టించాయి. టీడీపీ కార్యాలయంపై (TDP Office) వైసీపీకి (YSRCP)చెందిన కొందరు కార్యకర్తలు, నేతలు దాడిచేసి కంప్యూటర్లు, ఫర్నీచర్ ధ్వసం చేశారు. అంతటితో ఆగని వైసీపీ కార్యకర్తలు గూండాల్లా మారి అక్కడున్న టీడీపీ నేతల వాహనాలపై పెట్రోలు పోసి నిప్పంటించారు. కత్తులతో వీరంగం సృష్టించి ఆఫీసు ముందున్న ఫ్లెక్సీలు, బ్యానర్లను చింపేశారు. అయితే.. ఇంత జరుగుతున్న పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారని టీడీపీ ఆరోపిస్తోంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ ముఖ్యనేతలు గన్నవరంకు బయల్దేరి వెళ్లారు. అప్పటి వరకూ ఏం జరిగినా సైలెంట్‌గా ఉన్న పోలీసులు ఎక్కడికక్కడ టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇంత రచ్చ చేస్తున్న వైసీపీ కార్యకర్తలను కానీ.. ఒక్క వైసీపీ నేతను కానీ, ఆఖరికీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులను కూడా పోలీసులు టచ్ చేయలేదు. అయితే వైసీపీ కార్యకర్తలు మాత్రం కొందరు అసలు గన్నవరంలో జరిగింది ఇదీ అంటూ పక్కాగా వీడియోలతో సహా సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఆ వీడియోల్లో దాడిచేసే వ్యక్తులను అడ్డుకోవడం, పోలీసులకు కూడా దెబ్బలు తగిలినట్లు ఉన్నాయి.
ఉమా అరెస్ట్..!
ఈ క్రమంలో గన్నవరం టీడీపీ నేతలకు అండగా నిలబడేందుకు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Uma) ఘటనాస్థలానికి వెళ్లారు. ఆయన అక్కడికెళ్లిన నిమిషాల వ్యవధిలోనే దేవినేని ఉమాను పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ ఆఫీస్ మీద వైసీపీ కార్యకర్తలు దాడిచేయడం, కార్లు తగలపెట్టడం లాంటి చర్యలకు పాల్పడితే వాళ్లను అరెస్ట్ చేయాల్సింది పోయి.. తనను అరెస్ట్ చేయడం ఏంటని పోలీసులను ఉమా ప్రశ్నించారు. అసలు ఆయన మాటలను లెక్కచేయని పోలీసులు బలవంతంగా పోలీసు కారులో స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే ఎక్కడికి తీసుకెళ్లారో కూడా ఇంతవరకూ తెలియని పరిస్థితి. ఉమా ఒక్కరే కాదు టీడీపీ నేతలు చాలా మందినే పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరంలో కార్యాలయాన్ని పరిశీలించడానికి వెళ్లిన కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావును కూడా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. మరోవైపు.. గన్నవరం బయల్దేరిన టీడీపీ నేతలను ఎనేకేపాడువద్ద పోలీసులు అడ్డుకున్నారు.
పట్టాభి ఏమయ్యారు..?
గన్నవరంలో టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Kommareddy Pattabhi Ram) అదృశ్యమయ్యారు. టీడీపీ నేత ఇంటిపై దాడి వ్యవహారంలో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు గన్నవరం వెళ్లిన పట్టాభి కనిపించకుండా పోయారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. పోలీసు యూనిఫాంలో ఉన్న ఓ వ్యక్తి పట్టాభిని తీసుకెళ్లడం టీడీపీ శ్రేణులు గుర్తించారు. పట్టాభిని తీసుకెళ్లిన వ్యక్తి నిజంగా పోలీసేనా? లేక ఎవరైనా పోలీసు యూనిఫాంలో వచ్చి పట్టాభిని తీసుకెళ్లారా? అనేది టీడీపీ శ్రేణులకు అంతుచిక్కడం లేదు. పట్టాభి ఎక్కడ ఉన్నాడో చెప్పాలని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పట్టాభికి ఏమైనా అయితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీడీపీ శ్రేణులు కన్నెర్రజేస్తున్నారు.
పట్టాభి ఫోన్ స్విఛాప్..!
పట్టాభి కనిపించకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆయన సతీమణి చందన (Chandana) మీడియా ముందుకొచ్చారు. ‘గన్నవరం పార్టీ కార్యాలయం దాడి విషయం తెలిసి నా భర్త అక్కడికి వెళ్లారు. అక్కడ పోలీసులు అదుపులో తీసుకున్నారు. డ్రైవర్, పీఏ పోలీస్ స్టేషన్‌లో ఉన్నారు.. కానీ నా భర్త అక్కడ లేరు. నా భర్తను పోలీసులు ఎక్కడకి తీసుకెళ్లారో తెలియదు. ఆయన ఫోన్ స్విచాఫ్ వస్తోంది. నా భర్తకు ఏం జరిగినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ డీజీపీదే బాధ్యత’ అని మీడియా ముందు చందన కంటతడిపెట్టారు.
మొత్తానికి చూస్తే.. ఇవాళ సాయంత్రం నుంచి గన్నవరం నివురు గప్పిన నిప్పులా మారిపోయింది. ఇంత జరుగుతున్నా తనకేమీ సంబంధం లేదని వల్లభనేని వంశీ చెబుతున్నారు. మరోవైపు.. టీడీపీ నేత చిన్నా కారును వంశీ వర్గీయులు తగలబెట్టడంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆగ్రహానికి లోనైన టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్డు మీదికి వచ్చారు. అయితే.. పోలీసులు కూడా ఇంతవరకూ ఈ ఘటనపై స్పందించిన దాఖలాల్లేవ్. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు, ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి మరి.