Delhi Liquor Scam Case : వరుసగా రెండోరోజు కవిత గురించి బుచ్చిబాబుపై ఈడీ ప్రశ్నల వర్షం.. సరిగ్గా ఈ టైమ్‌లోనే ఎందుకంటే..?
ABN , First Publish Date - 2023-03-29T18:49:21+05:30 IST
ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam Case) మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) దూకుడు పెంచింది. ..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam Case) మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) దూకుడు పెంచింది. వీలైనంత త్వరగా ఈ కేసును కొలిక్కి తేవాలని ఈడీ అధికారులు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసు దాదాపు కీలక దశకు వచ్చిందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) పాత్రేంటో తేల్చడానికి ఈడీ అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు (Gorantla Buchi Babu), బినామీగా ఆరోపణలు వస్తున్న అరుణ్ రామచంద్ర పిళ్లైలను మళ్లీ మళ్లీ ఈడీ విచారిస్తోంది. ఇప్పటికే ఈ ఇద్దర్నీ విడివిడిగా పలుమార్లు విచారించిన ఈడీ అధికారులు కీలక సమాచారమే రాబట్టారు. ఈ సమాచారంతోనే కవితను కూడా మూడుసార్లు ఈడీ విచారణకు పిలిచింది. మరోవైపు.. రేపో మాపో కవితకు నోటీసులు ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఢిల్లీ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
రెండ్రోజుల విచారణ తర్వాత..!
సరిగ్గా ఇదే సమయంలో కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబును మరోసారి ఈడీ అధికారులు విచారణకు పిలిచారు. కొన్ని గంటల పాటు బుచ్చిబాబుపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రస్తుతం ఈడీ బృందం కవిత ఫోన్ డేటా సమాచారాన్ని విశ్లేషిస్తోంది. ఈ సమయంలోనే బుచ్చిబాబుకు ఈడీ నుంచి విచారణకు రావాలని పిలుపు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. బుచ్చిబాబు నుంచి ఇవాళ కూడా కీలక సమాచారాన్ని అధికారులు సేకరించినట్లు తెలియవచ్చింది. ఇవాళ జరిగిన విచారణకు బుచ్చిబాబుతో పాటు కవిత న్యాయవాది సోమా భరత్ కూడా వచ్చారు. ముఖ్యంగా.. కవిత్ మొబైల్స్ డేటా, బ్యాంక్ లావాదేవీలు, వ్యాపార లావాదేవీల గురించి ఇవాళ ఈడీ ఆరాతీసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి.. కవితకు సంబంధించిన మొబైల్ ఫోన్లలో డాటా ఇటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల సమక్షంలో గానీ, వారి తరపు ప్రతినిధుల సమక్షంలో గానీ, వాటిని తెరవాల్సివుంటుంది. అందులో భాగంగానే బుచ్చిబాబును వరుసగా రెండోరోజు ఈడీ విచారణకు పిలిచారు. ఈ రెండ్రోజుల విచారణలో బుచ్చిబాబు నుంచి సేకరించిన కీలక సమాచారంతోనే కవితన రేపో, మాపో ఈడీ విచారణకు పిలువనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఏం జరుగుతుందో..?
కాగా.. లిక్కర్ పాలసీ ఆమోదం పొందక ముందే గోరంట్ల బుచ్చిబాబు ఫోన్‌లలో డ్రాఫ్ట్ పాలసీని ఈడీ గుర్తించింది. దీనికి సంబంధించిన వివరాలపై అధికారులు ఆరాతీసినట్లు సమాచారం. సౌత్ గ్రూప్ కోసం ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఢిల్లీలో పని చేసిన విషయం తెలిసిందే. మొత్తానికి చూస్తే.. ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత పాత్రపై ఈడీ ముమ్మర దర్యాప్తు చేస్తోందని స్పష్టంగా అర్థమవుతోంది. ఈసారి కవితకు నోటీసులు వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది..? విచారణలో ఏమేం అడుగుతారు..? విచారణ తర్వాత అరెస్ట్ చేస్తారా..? అనేదానిపై బీఆర్ఎస్ వర్గాల్లో సర్వత్రా ఆందోళన నెలకొంది.