MLC స్థానాలపై వైసీపీ నేతల ఆశలు..ఈసారైనా మర్రికి ఎమ్మెల్సీ పదవి వస్తుందా..?

ABN , First Publish Date - 2023-02-14T10:28:58+05:30 IST

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మరోసారి మొదలైంది. ముఖ్యంగా.. అధికార పార్టీలో ఆ హడావుడి ఎక్కువగా ఉంది. దాంతో.. గతంలో వైసీపీలో పదవులు

MLC స్థానాలపై వైసీపీ నేతల ఆశలు..ఈసారైనా మర్రికి ఎమ్మెల్సీ పదవి వస్తుందా..?

మార్చిలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు వైసీపీ నేతల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఈ సారైనా పదవి వస్తుందా అన్న ఆశాభావంతో పలువురు నేతలు ఎదురు చూస్తున్నారు. అలాంటి వారిలో పల్నాడు జిల్లాకు చెందిన ఓ నేత ముందు వరుసలో ఉన్నారు. కానీ.. ఆయన అనుచరుల్లో మాత్రం.. పదవొస్తుందా.. రాదా అన్న భయం నెలకొంది. ఇంతకీ.. ఎవరా నేత?.. ఆయన ఆశలు నెరవేరతాయా లేదా అనే అనుమానాలు ఎందుకు తెరపైకి వస్తున్నాయి?.. మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‎సైడ్‎లో తెలుసుకుందాం..

Untitled-1154.jpg

మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికల సందడి

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మరోసారి మొదలైంది. ముఖ్యంగా.. అధికార పార్టీలో ఆ హడావుడి ఎక్కువగా ఉంది. దాంతో.. గతంలో వైసీపీలో పదవులు దక్కనివారు, జగన్‌ హామీలు ఇచ్చినవారు.. అధిష్టానం పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలోనే.. వైసీపీ ప్రభుత్వంలో పదవి రాకపోయినా.. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన మర్రి రాజశేఖర్ సుదీర్ఘకాలం వేచి చూశారు. వైసీపీ ఆవిర్భావంతో జగన్ వెంట నడిచిన మర్రి.. 2014లో టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావుపై పోటీ చేసి ఓడిపోయారు.

Untitled-12555.jpg

అయితే.. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా సేవలందించారు. సీనియర్ నేతగా గుర్తింపు ఉండడంతో 2019 ఎన్నికల్లో ఆయనే చిలకలూరిపేట వైసీపీ అభ్యర్థి అన్నట్లు అందరూ భావించారు. కానీ.. టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన ప్రత్తిపాటిని ఢీ కొట్టాలంటే ఆర్థిక వనరులు సరిపోవన్న కారణంతో మర్రిని పక్కనపెట్టి విడదల రజినీకి టికెట్ ఇచ్చారు. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉండడంతోపాటు బీసీ సామాజికవర్గం కావడంతో జగన్.. రజినీ వైపు మొగ్గు చూపారు. అనుకున్నట్లుగానే ప్రత్తిపాటి పుల్లారావుపై విడదల రజిని విజయం సాధించారు.

పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు

మరోవైపు.. ఎన్నికలకు ముందు రజిని గెలిస్తే.. మర్రి రాజశేఖర్‌కి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తానంటూ జగన్ చిలకలూరిపేట ఎన్నికల ప్రచార సభలో ప్రకటించారు. దాంతో.. అధికారంలోకి వచ్చిన వెంటనే మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ వస్తుందని భావించారు. అయితే.. అప్పటినుంచి ఇప్పటివరకు ఆయనకు ఆ పదవి అందని ద్రాక్షగానే మిగిలింది. అదే సమయంలో.. ఎన్నికల తర్వాత మర్రికి, విడదల రజినీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు ఏర్పడ్డాయి. ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నం చేశారు. ఇక.. మర్రికి నర్సరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తోడయ్యారు. ఇద్దరూ కలిసి చిలకలూరిపేటలో విడదల రజినీకి చెక్ పెట్టేందుకు ట్రై చేశారు. ఆమెకు వ్యతిరేకంగా ఓ వర్గాన్ని కూడా ప్రోత్సహించారు. అయితే.. ఆ ప్రయత్నాలను రజిని కూడా గట్టిగానే ఢీకొట్టిందని చెప్పొచ్చు. చివరికి అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకునే వరకూ వెళ్లారు. ఆయా పరిణామాలతోనే.. ఎమ్మెల్సీ వస్తుందనుకున్న మర్రికి నిరాశ ఎదురైందనే ప్రచారం జరిగింది.

Untitled-1354.jpg

ఈ సారి కచ్చితంగా ఎమ్మెల్సీ వస్తుందని ధీమా

ఇదిలావుంటే... అకస్మాత్తుగా కమ్మ సామాజికవర్గానికి చెందిన తలశిల రఘురాంకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో మర్రికి మరింత జాప్యం అయింది. ఇది చాలదన్నట్లుగా.. రెండోసారి మంత్రివర్గ విస్తరణలో చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఉన్న విడదల రజనీకి జగన్ మంత్రి పదవి ఇచ్చారు. ప్రస్తుతం ఆమె వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే.. మర్రి రాజశేఖర్.. ఎమ్మెల్సీ రాకపోయినా ఎక్కడా బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతేకాదు.. అసంతృప్తిని పక్కనబెట్టి.. రీజినల్ కోఆర్డినేటర్‌గా ఉన్న ఆయన.. పార్టీ పదవులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Untitled-1454.jpg

అంతవరకూ బాగానే ఉన్నా.. మార్చిలో 13 ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ కానున్నాయి. కేంద్రం ఎన్నికల సంఘం షెడ్యూల్‌ కూడా ప్రకటించింది. దాంతో.. మర్రి రాజశేఖర్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. మర్రికి ఈ సారి కచ్చితంగా ఎమ్మెల్సీ వస్తుందని ఆయన అభిమానులే కాదు పార్టీ నేతలు చెప్తున్నారు. విడదల రజినీకి మంత్రి పదవి ఇచ్చే సమయంలోనే జగన్ మర్రికి ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చినట్లు గుర్తు చేస్తున్నారు. అందుకే.. ఆమెకు మంత్రి పదవి ఇచ్చినా.. రాజశేఖర్.. ఎక్కడా అసంతృప్తి వ్యక్తం చేయలేదని చెప్పుకొస్తున్నారు.

Untitled-160.jpg

మొత్తంగా.. ఏపీలో ఎమ్మెల్సీ పదవుల హడావుడి మరోసారి తెరపైకి వస్తోంది. మార్చిలో భర్తీ కానున్న ఎమ్మెల్సీ స్థానాలపై వైసీపీ నేతలు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఆ క్రమంలో.. మర్రి రాజశేఖర్‌ కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఆయనకు అవకాశం దక్కుతుందో లేదో చూడాలి మరి.

Updated Date - 2023-02-14T10:40:00+05:30 IST