AP BJP : కన్నా లక్ష్మీనారాయణ బాటలో మరో కీలకనేత అడుగులు.. బీజేపీకి గుడ్ బై చెప్పేస్తారా..!?
ABN , First Publish Date - 2023-02-20T20:14:20+05:30 IST
ఆంధ్రప్రదేశ్‌లో బలపడాలన్న బీజేపీ పెద్దల ఆశలన్నీ అడియాసలే అవుతున్నాయా..? ఏపీ బీజేపీలో (AP BJP) కీలక నేతలకు పొగపెట్టే కార్యక్రమం యథేచ్ఛగా సాగుతోందా..?..
ఆంధ్రప్రదేశ్‌లో బలపడాలన్న బీజేపీ పెద్దల ఆశలన్నీ అడియాసలే అవుతున్నాయా..? ఏపీ బీజేపీలో (AP BJP) కీలక నేతలకు పొగపెట్టే కార్యక్రమం యథేచ్ఛగా సాగుతోందా..? పార్టీలో ఒకరిద్దరి పెత్తనం వల్ల కీలక నేతలంతా బయటికి రావడానికి సిద్ధమైపోతున్నారా..? ఆ ఒకరిద్దరూ బయటికి వస్తే ఇక బీజేపీకి మిగిలేది గుండు సున్నానేనా..? మొన్న కన్నా లక్ష్మీ నారాయణ (Kanna Lakmi Narayana) బీజేపీకి గుడ్ బై చెప్పేయగా.. నిన్న పురంధేశ్వరిని (Daggubati Purandeswari) టార్గెట్ చేశారనే వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయ్. ఇవాళ ఏకంగా ఓ కీలక నేత బీజేపీకి గుడ్ బై చెప్పేయాలని భావిస్తున్నారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇదే అక్షరాలా నిజమనిపిస్తోంది. ఇంతకీ కమలం పార్టీపై కస్సుబుస్సుమంటున్న ఆ కీలక నేత ఎవరు..? ఆయన్ను టార్గెట్ చేశారా.. లేకుంటే పార్టీ నేతల తీరు నచ్చకే ఆయనే బయటికి రావాలని అనుకుంటున్నారా..? అనే విషయాలపై ప్రత్యేక కథనం.
అసలేం జరుగుతోంది..?
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజుకు (Somu Veerraju) ఆ పార్టీలోని కొందరు నేతలకు చాలా రోజులుగా అస్సలు పడట్లేదు. ముఖ్యంగా మాజీ మంత్రి, సీనియర్ నేత కన్నా లక్ష్మీ నారాయణ- సోమువీర్రాజుకు మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. ఇదంతా అధ్యక్ష పదవి మార్పిడి వల్లే వచ్చింది. అప్పట్నుంచి ఇద్దరి మధ్య పెరిగిన వైరం రోజురోజుకూ పెరిగిందే తప్ప తగ్గలేదు. ఆఖరికి కేంద్రం నుంచి పెద్దలు వచ్చి నచ్చజెప్పినా కన్నా మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా బీజేపీకి గుడ్ బై చెప్పేసి రేపో.. మాపో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) సమక్షంలో పసుపు కండువా కప్పుకోబోతున్నారు. సోమవారం నాడు కూడా కన్నాతో టీడీపీకి చెందిన ఒకరిద్దరు ముఖ్యనేతలు చేరికపై చర్చించి వచ్చారు. ఇదంతా ఇలా జరుగుతుండగానే.. అధిష్ఠానం వద్ద పలుకుబడి కలిగిన కొందరు రాష్ట్ర నాయకులు పార్టీలోని కొందర్ని పొమ్మనలేక పొగబెడుతున్నారనే ఆరోపణలు బహిరంగంగానే వినిపించాయి. కన్నా లక్ష్మీనారాయణను పంపాక తదుపరి లక్ష్యం ఎన్టీఆర్ కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరేనని బీజేపీ వర్గాల్లో పెద్దఎత్తున చర్చ జరిగింది.
ఎవరా కీలక నేత..!
బీజేపీలో మొదలైన ఈ అసంతృప్తుల వ్యవహారం, విబేధాలు సమసిపోక ముందే.. బీజేపీకి చెందిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు (Vishnu Kumar Raju) పార్టీలో పరిస్థితులు అసలు బాగోలేవని మీడియా ముందే చెప్పడం ఏపీ రాజకీయాల్లో (AP Politics) హాట్ టాపిక్ అయ్యింది. అసలు ఏపీ బీజేపీలో ఏం జరుగుతోందో అర్థం కావట్లేదని.. కార్యకర్తలతో మాట్లాడే తీరిక కూడా అధిష్టానానికి లేదని ఆరోపించారు. పార్టీలో అసలేం జరుగుతోంది..? ఎవరేం చేస్తు్న్నారు..? రాజకీయ పరిణామాలన్నింటినీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లానన్నారు. అంతటితో ఆగని ఆయన.. ప్లోర్ లీడర్‌గా పనిచేసిన తన మాటే హైకమాండ్ వినే పరిస్థితిలో లేదని మీడియా ముందే తన అసంతృప్తిని వెళ్లగక్కారు. సోమవారం సాయంత్రం కన్నా లక్ష్మీనారాయణతో ఈయన సమావేశం అయ్యారు. ఆ భేటీ తర్వాత విష్ణు చేసిన ఈ కామెంట్స్‌తో కన్నా బాటలోనే ఈయన కూడా నడుస్తారని అందరికీ అర్థమైపోయింది. మరోవైపు.. రేపో మాపో విష్ణు బీజేపీకి గుడ్ బై చెప్పినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు విశ్లేషకులు.
ఏ పార్టీలో చేరొచ్చు..!
2014 ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ పొత్తులో భాగంగా విశాఖపట్నం నార్త్ నుంచి పోటీచేసిన విష్ణుకుమార్ రాజు.. 18,240 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో పొత్తు లేకుండా బీజేపీ తరఫున పోటీచేయగా.. గతంలో వచ్చిన మెజార్టీ కంటే 550 ఓట్లు అనగా 18,790 మాత్రమే ఓట్లు వచ్చాయి. అంటే ఆ నియోజకవర్గంలో బీజేపీ పరిస్థితి ఎలా ఉందో దీన్ని బట్టి చెప్పుకోవచ్చు. అయినా ఎక్కడా అసంతృప్తికి లోనుకాకుండా తనవంతుగా నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం విష్ణు ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు. అయితే ఈ మధ్య పార్టీలో నెలకొన్న విబేధాలు రాజుకు బాగా చికాగు తెప్పించాయట. అందుకే ఇక బీజేపీలో ఉండటం కంటే పార్టీ మారితో బాగుంటుందని అభిమానులతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని భావిస్తున్నారట. 2019 ఎన్నికలకు ముందే ఈయన వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు వచ్చినప్పటికీ అవి రూమర్స్‌గానే ఉండిపోయాయి. ఇప్పుడు ఆయన కన్నాతో భేటీ కావడంతో టీడీపీలో చేరుతారనే తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో.. విష్ణుకు మంచి సత్సంబంధాలే ఉన్నాయి. ఒకవేళ కన్నా బాటలోనే ఈయన కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదేమో.
మొత్తానికి చూస్తే.. ఒక్కొక్కరుగా బీజేపీపై అసంతృప్తితో బయటికి వచ్చేయాలని భావిస్తున్నారని తాజా పరిణామాలను బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే బీజేపీకి మిగిలేది గుండు సున్నానే అని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యనేతలంతా ఒక్కొక్కరుగా పార్టీ నుంచి బయటికి వచ్చేస్తుండగా.. ఇంకొందరు నేతలు బయటికి రావాలని ప్లాన్ చేసుకుంటున్న ఈ పరిస్థితుల్లో వారిని నిలువరించడానికి కేంద్రంలోని పెద్దలు ఏం చేస్తారో చూడాలి మరి.