TS Congress : కొడంగల్ నుంచే పోటీచేస్తానంటున్న రేవంత్ రెడ్డి.. మల్కాజ్‌గిరి పరిస్థితేంటి.. పెద్ద మాస్టర్ ప్లానే ఉందిగా..!?
ABN , First Publish Date - 2023-03-01T22:27:39+05:30 IST
అవును.. కొడంగల్ అసెంబ్లీ స్థానం నుంచే పోటీచేస్తున్నాను.. ఇదొక్కటే కాదు పాలకుర్తి, ఇంకా కొన్ని చోట్ల నుంచి బరిలోకి దిగాలని ఆహ్వానాలు వస్తున్నాయి.. కచ్చితంగా పోటీచేయాల్సిందేనని తనపై ఒత్తిడి కూడా తెస్తున్నారు..
అవును.. కొడంగల్ అసెంబ్లీ స్థానం (Kodangal ) నుంచే పోటీచేస్తున్నాను.. ఇదొక్కటే కాదు పాలకుర్తి, ఇంకా కొన్ని చోట్ల నుంచి బరిలోకి దిగాలని ఆహ్వానాలు వస్తున్నాయి.. కచ్చితంగా పోటీచేయాల్సిందేనని తనపై ఒత్తిడి కూడా తెస్తున్నారు.. ఇవీ భూపాలపల్లిలో జరిగిన హాథ్ సే హాథ్ జోడో యాత్రలో (Hath Se Hath Jodo Yatra) టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) చేసిన కామెంట్స్. బహిరంగ సభలో రేవంత్ కామెంట్స్ విన్న కొందరు అభిమానులు, కార్యకర్తలు ఈలలు, కేకలు, నినాదాలతో హోరెత్తించారు. మరికొందరు వీరాభిమానులైతే ఇదేంటి సిట్టింగ్ స్థానం వదిలేసి ఇలా అంటున్నారని ఆలోచనలో పడ్డారు. ఇదంతా సరే.. కొడంగల్ నుంచే రేవంత్ పోటీచేస్తారు సరే.. ఎంపీగా గెలిచిన మల్కాజ్‌గిరి (Malkajgiri) పరిస్థితేంటి..? ఇక్కడ్నుంచి మరో కీలక నేత ఎవరైనా పోటీచేస్తారా..? లేదా..? అసలు రేవంత్ రెడ్డి కామెంట్స్ వెనుక ఆంతర్యమేంటి..? అనేది తెలియట్లేదు. అయితే దీని వెనుక పెద్ద మాస్టర్ ప్లానే ఉందనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఇంతకీ రేవంత్ మనసులో ఏముంది..? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
ఇదీ అసలు కథ..!
తెలంగాణలో ఈసారి బీఆర్ఎస్ పార్టీ (BRS) హ్యాట్రిక్ కొట్టకుండా నిలువరించాలని కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాయి. చిన్నపాటి అవకాశాన్ని కూడా గోల్డెన్ ఛాన్స్‌గా వినియోగించుకుంటున్నాయి. బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం మేమంటే మేమని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు నిరూపించుకోవడానికి ప్రత్యేక కార్యక్రమాలతో జనాల్లో తిరుగుతున్నాయి. ఇక బీఆర్ఎస్ గెలవదంటే.. గెలవదు అదిగో మరికొన్ని రోజుల్లోనే అధికారంలోకి వచ్చేస్తున్నామని కమలనాథులు చెప్పుకుంటున్నారు. కచ్చితంగా హంగ్ వస్తుందని కచ్చితంగా ‘మా ప్లాన్స్ మాకున్నాయ్’ అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలే చేశారు. వచ్చే ఎన్నికల్లో కొడంగల్ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని రేవంత్‌రెడ్డి స్పష్టం చేయడంతో ఈ కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అంతా ఓకే కానీ ఇప్పుడు గత పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన మల్కాజ్‌గిరి పరిస్థితేంటన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. కొడంగల్ నుంచి రేవంత్ పోటీచేస్తే.. మల్కాజ్‌గిరి నుంచి ఎవరు పోటీచేస్తారు..? అనేది ఎంత ఆలోచించినా ఆయన వీరాభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఎంత ఆలోచించినా అంతుచిక్కట్లేదట. ఎన్నికల సమయానికి పరిస్థితులను బట్టి ఏమైనా జరగొచ్చని పార్టీ శ్రేణులు అనుకుంటున్నాయట. అయితే రేవంత్ మాటలు విన్న మంత్రి మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి చాలా హ్యాపీగా ఫీలవుతున్నారట. ఇక రానున్న ఎన్నికల్లో తనకు పోటీనే లేదన్నట్లుగా మర్రి రాజశేఖర్ సంబరాల్లో మునిగిపోతున్నారట.
మాస్టర్ ప్లాన్ ఇదేనా..?
రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కచ్చితంగా హంగ్ వస్తున్నది కాంగ్రెస్ భావనట. అందుకే మొదట అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో తేల్చుకోవాలని కాంగ్రెస్ పెద్ద ప్లాన్‌తోనే ఉందట. అదెలాగంటే.. ఏయే నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఉంది..? ఎక్కడెక్కడ పక్కాగా కాంగ్రెస్ గెలుస్తుంది..? గతంలో అతి తక్కువ మెజార్టీతో కాంగ్రెస్ కోల్పోయిన స్థానాలేంటి..? ఏయే నియోజకర్గాల్లో బీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయ్..? ఇలా అన్నింటినీ బేరీజు చేసుకుని పక్కా ప్లాన్‌తో అధిష్టానం ముందుకెళ్తోందట. దీంతో పాటు పక్కాగా కాంగ్రెస్ పెద్దలు గెలిచే కొన్ని అసెంబ్లీ స్థానాలేంటి..? అనేదానిపై సర్వేలు చేయించిందట. ఇందులో భాగంగానే మొదట అసెంబ్లీ స్థానాల్లో ఢీ కొట్టి ఆ తర్వాత పరిస్థితులను బట్టి పార్లమెంట్ స్థానాలుగా పోటీ చేయాలని రేవంత్ రెడ్డి పక్కా ప్లాన్‌తో ఉన్నారట. అందుకే కొడంగల్‌లో నుంచే పోటీచేస్తానని ముందుగానే రేవంత్ చెప్పేశారట. రేవంత్ అక్కడ్నుంచి గెలిస్తే.. ఆ ఒక్కటైనా సరే పార్టీ దశ, దిశ మార్చొచ్చేమో అని అధిష్టానం భావిస్తోందట. ఒక్క రేవంత్ రెడ్డే కాదు.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy), ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) కూడా అసెంబ్లీకి పోటీచేసినా ఆశ్చర్యపోనక్కర్లేదట. ఆ తర్వాత యథావిధిగా వారి పార్లమెంట్ స్థానాలనుంచి పోటీచేస్తారట. గత ఎన్నికల్లో కొడంగల్ నుంచి రేవంత్ ఎలా ఓడిపోయారు.. ఏ పరిస్థితుల్లో మల్కాజ్‌గిరి ఊహించిన రీతిలో గెలిచారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదేమో.!
కాంగ్రెస్ మాత్రమే కాదు.. బీజేపీ కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతోందని ఇప్పటికే వార్తలు గుప్పుమన్నాయి. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ (TS BJP Chief Bandi Sanjay) కూడా ఎమ్మెల్యేగా పోటీచేస్తారట. అలాగే.. ధర్మపురి అరవింద్ (Dharmapuri Arvind), కిషన్ రెడ్డి (Kishan Reddy), లక్ష్మణ్ ఇలా బీజేపీ పెద్దలంతా ఎమ్మెల్యేలుగానే బరిలోకి దిగుతారని టాక్ నడుస్తోంది. మొత్తానికి చూస్తే.. బీఆర్ఎస్‌ను ఓడించాలని కాంగ్రెస్, బీజేపీ పెద్దలు భారీ వ్యూహాలతోనే ఉన్నారు సరే.. ఇది ఎంతవర్కవుట్ అవుతుందో. సీఎం కేసీఆర్‌కు రాజకీయ చాణుక్కుడిగా పేరుంది.. ప్రతిపక్షాలను ఢీ కొట్టడానికి ఆయన దగ్గర ఇంకేం బ్రహ్మాస్త్రాలు ఉన్నాయో..? అవన్నీ ఎప్పుడు అమల్లోకి వస్తాయో..? అని తెలుసుకోవడం అంత ఆషామాషీ కాదు. కాంగ్రెస్, బీజేపీ ప్లాన్‌లు ఏ మాత్రం వర్కవుట్ అవుతాయి..? ఈసారి కూడా కేసీఆర్ గెలిచి హ్యాట్రిక్ కొడతారో తెలియాలంటే ఎన్నికల వరకూ ఆగాల్సిందే మరి.