Palamuru Politics: ఓటర్లకు గాలం వేసేలా BRS, CONGRESS, BJP ప్రణాళికలు..

ABN , First Publish Date - 2023-02-15T11:51:26+05:30 IST

తెలంగాణలో అన్నిపార్టీలు ఉమ్మడి పాలమూరు జిల్లా కేంద్రంగా వ్యూహాలు రచిస్తున్నాయి. పట్టు సాధించేందుకు ఆయా పార్టీలు కార్యాచరణ ..

Palamuru Politics: ఓటర్లకు గాలం వేసేలా BRS, CONGRESS, BJP ప్రణాళికలు..

తెలంగాణ పోరులో పాలమూరు కరువు ఉద్యమ నినాదంగా అందరి నోళ్లల్లో నానింది. అయితే.. ఇప్పుడు మరోసారి అన్ని పార్టీలూ చలో పాలమూరు అంటుండడం హాట్‌టాపిక్‌గా మారుతోంది. పాలమూరు కేంద్రంగా ఓట్ల బాట పట్టేందుకు కసరత్తు చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రత్యేక కార్యచరణతో ముందుకెళ్తున్నాయి. వరుస కార్యక్రమాలతో వ్యూహాలకు పదును పెడుతుండడం పొలిటికల్‌గా పాలమూరును హీటెక్కిస్తోంది. ఇంతకీ.. పాలమూరు జిల్లాపై ప్రధాన పార్టీలు ఎందుకు ఫోకస్‌ పెట్టాయి?.. తొమ్మిదేళ్ల తర్వాత చలో పాలమూరు అనడంలో ఆంతర్యమేంటి?.. అనే మరిన్ని విషయాలను ఏబీఎన్ ఇన్‎సైడ్‎లో తెలుసుకుందాం..

Untitled-1046.jpg

బీజేపీ డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ నినాదం

తెలంగాణలో అన్నిపార్టీలు ఉమ్మడి పాలమూరు జిల్లా కేంద్రంగా వ్యూహాలు రచిస్తున్నాయి. పట్టు సాధించేందుకు ఆయా పార్టీలు కార్యాచరణ మొదలుపెట్టాయి. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపి ఓటర్లకు గాలం వేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలతో బీఆర్‌ఎస్‌ దూకుడుగా వ్యవహరిస్తోంది. మోదీ పాలనలో భారత్‌ వెలిగిపోతోందని, డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ వస్తే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని బీజేపీ చెప్పుకొస్తుంది. రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్ర జోష్‌తో కాంగ్రెస్‌ పునర్వైభవం దిశగా అడుగులు వేస్తోంది. ప్రధాన పార్టీల పోటాపోటీ కార్యక్రమాలతో రాజకీయ సందడి నెలకొంది. పలు నియోజకవర్గాల్లో అధికార, ప్రతిపక్ష నేతల.. విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

Untitled-14000.jpg

కొల్లాపూర్, అలంపూర్, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, గద్వాల

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాల్లో ప్రస్తుతం బీఆర్ఎస్‌ పాగా వేసింది. వచ్చే ఎన్నికల్లోనూ గెలిచి హ్యట్రిక్‌తో సత్తా చాటాలని చూస్తోంది. ఇప్పటికే.. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ.. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు. ప్రధానంగా.. గత హామీలకు సంబంధించిన పనులపై దృషి పెట్టారు. పనిలో పనిగా.. పెద్ద ఎత్తున పార్టీలో చేరికలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ హడావుడి చూస్తుంటే ఎన్నికలు ఎంతో దూరంలో లేవనే భావన కలుగుతోంది. గత డిసెంబర్‌లో కేసీఆర్ మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించి పార్టీ కార్యాలయం, నూతన కలెక్టరేట్ సమీకృత భవనం ప్రారంభించి బహిరంగ సభలో పాల్గొన్నారు.

Untitled-120.jpg

ఆ తర్వాత.. హరీష్‌రావు మహబూబ్‌నగర్‌లో పర్యటించి సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రికి శంకుస్థాపన చేయగా.. జనవరిలో కేటీఆర్‌తోపాటు మహమూద్‌అలీ, నిరంజన్‌రెడ్డి నారాయణపేటలో పర్యటించి పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలకు హాజరయ్యారు. అయితే.. కొల్లాపూర్, అలంపూర్, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, గద్వాల నియోజకవర్గాల్లోని అంతర్గత విభేదాలు బీఆర్ఎస్‌కు ఇబ్బందిగా మారాయి. ఆయా సెగ్మెంట్లలో గ్రూపు రాజకీయాలు గట్టిగా నడుస్తుండడంతో బీఆర్ఎస్‌ క్యాడర్‌ అయోమయానికి గురవుతోంది.

Untitled-116.jpg

పాలమూరు జిల్లాపై స్పెషల్‌ ఫోకస్‌

ఇదిలావుంటే.. పాలమూరు జిల్లాపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టిన బీజేపీ.. ఎక్కువ సీట్లు సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్తుంది. దానికి తగ్గట్టే.. బండి సంజయ్‌ రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర.. అలంపూర్‌ జోగులాంబ ఆలయం నుంచే మొదలు పెట్టారు. అన్ని నియోజకవర్గాల్లో పర్యటించిన ఆయన.. ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. అప్పటినుంచి బీజేపీకి చెందిన ముఖ్య నేతలు తరచూ జిల్లాలో ఎక్కడో ఓ చోట పర్యటిస్తూనే ఉన్నారు. పార్లమెంట్‌ ప్రవాసీ యోజన కార్యక్రమంలో భాగంగా కేంద్రమంత్రి మహేంద్రనాథ్‌ పాండే మహబూబ్‌నగర్‌లో పర్యటించారు. ఇక.. బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు పాలమూరు వేదిక కావడం ఆ జిల్లాపై కమలం పార్టీ ఎలాంటి ఫోకస్‌ పెట్టిందో స్పష్టమవుతోంది. బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం అని చెబుతూ.. రాజకీయ కార్యాచరణతోపాటు కేంద్ర పథకాలపై విస్తృత ప్రచారం ద్వారా ప్రత్యేక వ్యూహంతో ముందుకుసాగుతోంది. అంతేకాదు.. మోదీ, అమిత్‌షాలో ఎవరో ఒకరు వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో పాలమూరు నుంచే బరిలో దిగుతారనే ప్రచారం ఊపందుకుంది. త్వరలోనే అమిత్‌ షా పాలమూరులో పర్యటిస్తారని కూడా టాక్‌ నడుస్తోంది.

Untitled-130.jpg

గ్రూపు రాజకీయాలతో కాంగ్రెస్‌ ఉక్కిరిబిక్కిరి

మరోవైపు.. టీ.పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి పాలమూరు జిల్లాకే చెందినవారు కావడంతో కాంగ్రెస్‌ కూడా ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాలో పూర్వవైభవం చాటేందుకు అష్టకష్టాలు పడుతోంది. చాప కింద నీరులా పలు నియోజకవర్గాల్లో జోరు పెంచింది. రాహూల్‌ భారత్‌జోడో యాత్ర పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపింది. మక్తల్, నారాయణపేట, దేవరకద్ర, మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్‌ మీదుగా రాహుల్‌ యాత్ర కొనసాగడంతో సగం జిల్లా కవర్‌ అయిందని.. ఆ ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఉంటుందని అభిప్రాయ పడుతున్నారు. అయితే.. చాలా నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు కాంగ్రెస్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గత నెలలో నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ జరిగింది. కాంగ్రెస్‌ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావుఠాక్రే, రేవంత్‌రెడ్డితోపాటు పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. సభకు భారీ ఎత్తున జనం రావడంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

Untitled-15000.jpg

సొంత గడ్డపై అత్యధిక సీట్లు గెలవడమే లక్ష్యం

ఇక... కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి పర్యటన రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపింది. అందర్నీ విస్మయానికి గురిచేస్తూ రేవంత్‌.. తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి అయిన మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి ఇంటికి వెళ్లి పలకరించడం ప్రకంపనలు సృష్టించింది. అయితే.. ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించేందుకే వెళ్లారని ప్రచారం జరుగుతోంది. ఆ లెక్కన అన్ని నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్‌ పట్టు సాధించేందుకు రేవంత్ సామదానభేదదండోపాయాలను ప్రయోగిస్తున్నారని తెలుస్తోంది. సొంత గడ్డపై అత్యధిక సీట్లు గెలవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారని కాంగ్రెస్‌ వర్గాలు చెప్తున్నాయి. దాంతోపాటు.. జిల్లా వ్యాప్తంగా హాత్‌సే హాత్‌ జోడో యాత్ర అట్టహాసంగా కొనసాగుతోంది. కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ కరపత్రాలు పంచుతుండడంతో మైలేజ్‌ పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

Untitled-16000.jpg

మొత్తంగా.. ఉమ్మడి పాలమూరు కేంద్రంగా ప్రధాన పార్టీలు పోటాపోటీగా కార్యకలాపాలు నిర్వహిస్తుండడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ముందస్తు ఎన్నికలు ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. అన్ని పార్టీలూ పాలమూరు జిల్లాలో సత్తా చాటేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఏదేమైనా.. త్వరలో జరగనున్న ఎన్నికల్లో పాలమూరు ప్రజలు.. ఏ పార్టీకి జై కొడతారో చూడాలి మరి.

Updated Date - 2023-02-15T11:51:32+05:30 IST