Gannavaram : చంద్రబాబుతో యార్లగడ్డ అపాయిట్మెంట్ ఖరారు.. టీడీపీలో చేరిక ఎప్పుడంటే..?
ABN , First Publish Date - 2023-08-19T20:57:33+05:30 IST
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల (AP Assembly Elections) ముందు కీలక నియోజకవర్గమైన గన్నవరంలో (Gannavaram) రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన యార్లగడ్డ వెంకట్రావు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు..
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల (AP Assembly Elections) ముందు కీలక నియోజకవర్గమైన గన్నవరంలో (Gannavaram) రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన యార్లగడ్డ వెంకట్రావు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మరోవైపు టీడీపీ అభ్యర్థిగా గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీ పంచన చేరిన విషయం తెలిసిందే. వంశీ వైసీపీ మద్దతు ఇవ్వడం మొదలుకుని నిన్న, మొన్నటి వరకూ ఎమ్మెల్యే వర్గానికి.. యార్లగడ్డ వర్గానికి పచ్చగడ్డేస్తే భగ్గుమనేంత పరిస్థితులుండేవి. పలుమార్లు ఇరు వర్గీయులు కొట్టుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయ్. దీంతో అధికార పార్టీలో ఉండి కూడా ఈ పరిస్థితి ఎందుకొచ్చింది..? అని కనీసం సీఎం వైఎస్ జగన్ రెడ్డి అపాయిట్మెంట్ కోసం ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఈ వరుస పరిణామాలతో విసిగివేసారిపోయిన యార్లగడ్డ వైసీపీకి రాజీనామా చేసేశారు. టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్న యార్లగడ్డ.. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో (Nara Chandrababu) భేటీ కాబోతున్నారు.
అపాయింట్మెంట్.. చేరిక!
ఆదివారం నాడు చంద్రబాబుతో యార్లగడ్డ వెంకట్రావు భేటీ కాబోతున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని (Hyderabad) బాబు నివాసంలో ఆయన భేటీ కాబోతున్నారు. ఈ భేటీ నేపథ్యంలో తన ముఖ్య అనుచరులతో కలిసి యార్లగడ్డ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నెల 22న గన్నవరం జరగబోయే భారీ బహిరంగ సభలో యార్లగడ్డ టీడీపీ కండువా కప్పుకోబోతున్నారు. అయితే యువనేత నారా లోకేష్ ఆధ్వర్యంలో పార్టీలో చేరుతారా లేకుంటే.. భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి చంద్రబాబునే ఆహ్వానించబోతున్నారా..? అనేదానిపై ఆదివారం భేటీతో క్లారిటీ రానుందని యార్లగడ్డ ముఖ్య అనుచరులు చెబుతున్నారు. కాగా.. ఇప్పటికే తాను టీడీపీలో చేరబోతున్నట్లు అధికారికంగా యార్లగడ్డ ప్రకటించారు కూడా. రాజీనామా తర్వాత చంద్రబాబు పిలుపు కోసం ఆయన వేచి చూస్తున్నారు. బాబు నుంచి కబురు రానే వచ్చింది. టీడీపీలో చేరితే వంశీపై పోటీచేసేది ఈయనేనని.. ఇందుకు చంద్రబాబు సమ్మతంగానే ఉన్నారని రెండ్రోజులుగా వార్తలు గుప్పుమంటున్నాయి. భేటీలో ఏం చర్చిస్తారు..? చేరిక తర్వాత పరిస్థితేంటి..? అనేది తెలియాల్సి ఉంది.
రక్తికట్టిస్తున్న గన్నవరం..!
వ్యాపారరీత్యా అమెరికాలో స్థిరపడిన యార్లగడ్డ వెంకట్రావు అక్కడ పౌరసత్వాన్ని కూడా కాదనుకుని రాజకీయాలపై ఆసక్తితో సొంత జిల్లాకు వచ్చారు. వెంకట్రావు స్వగ్రామం పమిడిముక్కల మండలం పెనుమత్స. రాజకీయాలపై ఆసక్తితో 2014లో పెనమలూరు నియోజకవర్గ కేంద్రంగా సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 2019లో పెనమలూరు నుంచి వైసీపీ టికెట్ ఆశించిన వెంకట్రావు అధిష్ఠానం ఆదేశాల మేరకు గన్నవరం నుంచి బరిలోకి దిగాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో ప్రత్యర్థి వంశీ చేతిలో సుమారు 300 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. తొలి నుంచీ వంశీ అంటే ఉప్పు నిప్పుగా ఉండే వెంకట్రావు ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలను జీర్ణించుకోలేకపోయారు. వంశీ వైసీపీ పంచన చేరడం 2024లోనూ ఆయనకే వైసీపీ టికెట్ ఇస్తామని జగన్ హామీ ఇవ్వడంతో వెంకట్రావు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఎంతకాలం వేచి చూసినా వైసీపీ నుంచి సానుకూల సంకేతాలు లేకపోవడం.. పోతే పో.. అన్నట్టు నేతలు వ్యాఖ్యలు చేయడంతో మనస్తాపానికి గురైన వెంకట్రావు ఎట్టకేలకు వైసీపీకి గుడ్‌బై చెప్పారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయాలన్న తన ఆశను అధినేత చంద్రబాబుకు మీడియా ముఖంగా తెలియజేశారు. దీంతో రానున్న రోజుల్లో గన్నవరం రాజకీయాలు మరింత రక్తికట్టనున్నాయి. యార్లగడ్డకు టీడీపీ టికెట్ ఇస్తే 2019లో పోటీ పడిన ప్రత్యర్థులైతే మళ్లీ బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఏం జరుగుతుందో చూడాలి మరి.