Rahul Bungalow Row : రాహుల్ భయ్యా.. రండి ఇది మీదే.. రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్.. సోషల్ మీడియాలో వైరల్
ABN , First Publish Date - 2023-03-28T19:13:45+05:30 IST
మోదీ ఇంటి పేరు గల వారందరూ దొంగలే అని వ్యాఖ్యానించి కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) లోక్‌సభ సభ్యత్వం కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పరువు నష్టం కేసులో రాహుల్‌కు రెండేళ్లు జైలు శిక్ష పడింది.
మోదీ ఇంటి పేరు గల వారందరూ దొంగలే అని వ్యాఖ్యానించి కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) లోక్‌సభ సభ్యత్వం కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పరువు నష్టం కేసులో రాహుల్‌కు రెండేళ్లు జైలు శిక్ష పడింది. మరోవైపు.. అధికారిక బంగళాను (Rahul Bunglow) ఖాళీ చేయాలని రాహుల్‌కు లోక్‌సభ హౌసింగ్ కమిటీ నుంచి నోటీసులు అందాయి. ప్రభుత్వం కేటాయించిన ఈ అధికారిక నివాసాన్ని 30 రోజుల్లో (ఏప్రిల్ 22)గా ఖాళీ చేయాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. దీంతో 12, తుగ్లక్ లేన్‌లోని బంగళాలో 2005 నుంచి ఉంటున్న నివాసాన్ని రాహుల్ తప్పక ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో రాహుల్ ఎక్కడుంటారు..? తల్లి సోనియాగాంధీతో కలిసి ఉంటారా..? లేకుంటే వేరే బంగళాకు వెళ్తారా..? అని అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆలోచనలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. (TPCC Chief Revanth Reddy) రాహుల్‌కు పంపిన ఆత్మీయ ఆహ్వానం ప్రస్తుతం సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
ఇది నీదే భయ్యా.. !
‘నా ఇంటికి రా.. ఇది నీ ఇల్లు భయ్యా’ అంటూ రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీని ఢిల్లీలోని (New Delhi) తన ఇంటికి ఆహ్వానించారు. ‘నా ఇల్లు.. నీ ఇల్లే... నా ఇంటికి మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మనది ఒకటే కుటుంబం.. ఇది నీ ఇల్లే’ అంటూ రాహుల్ గాంధీకి సోషల్ మీడియా వేదికగా (Social Media) సందేశాన్ని పంపించారు. రేవంత్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై దేశ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, రేవంత్ అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ‘రేవంత్ గారు మీరే కాదు.. దేశంలోని ప్రతి కార్యకర్త కూడా ఇదే ఆలోచనలో ఉన్నారు.. మీ ఆహ్వానానికి ధన్యవాదాలు’ అని రేవంత్ ట్వీట్‌కు కార్యకర్తలు రిప్లయ్‌లు ఇస్తున్నారు.
ఖర్గే ఇలా..!
ఈ వరుస పరిణామాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) స్పందించారు. ‘రాహుల్ గాంధీని బలహీనపరచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన బంగళా ఖాళీ చేస్తే తన తల్లి దగ్గరకు వెళ్లి ఉంటారు. లేకపోతే నా దగ్గరకు వస్తారు. నా ఇంట్లో ఆయనకు చోటు ఉంటుంది. కానీ, ఆయనను బెదిరించడం, అవమానించడం వంటి ప్రభుత్వ చర్యలను నేను ఖండిస్తున్నాను. ఇది సరైన పద్ధతి కాదు. కొన్నిసార్లు మూడు నుంచి, నాలుగు వరకూ ఉండటానికి మాకు బంగళాలు ఉండవు. ఆరు నెలల తర్వాత నాకు బంగ్లా ఇచ్చారు. ఇతరులను అవమానపరచేందుకు కొందరు ఇలా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి ధోరణులను నేను ఖండిస్తున్నాను’ అని ఖర్గే అన్నారు.
కాగా.. రాహుల్ గాంధీ 12, తుగ్లక్ లేన్‌లోని బంగ్లాలో 2005 నుంచి ఉంటున్నారు. ఎంపీగా అనర్హత కోల్పోయిన రాహుల్‌ను అధికారిక బంగ్లా నుంచి ఖాళీ చేయాల్సిందిగా లోక్‌సభ హౌసింగ్ కమిటీ ఇటీవల నోటీసులిచ్చింది. 30 రోజుల్లోగా ఖాళీ చేయాలని ఆ నోటీసులో కోరింది. నాలుగు సార్లు ప్రజాతీర్పుతో తాను ఎంపీగా కొనసాగుతున్నానని, ఈ నివాసంతో తనకెన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయని రాహుల్ తన స్పందనలో తెలిపారు. నోటీసులు పేర్కొన్న అంశాలకు కట్టుబడి ఉంటానంటూ బంగళా ఖాళీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు.