Woman: 6 నెలల బాబును ఒడిలో వేసుకుని అడుక్కుంటున్న మహిళ ప్రవర్తనపై స్థానికులకు డౌట్.. పోలీసుల ఎంట్రీతో షాకింగ్ ట్విస్ట్..!
ABN , First Publish Date - 2023-09-21T20:45:25+05:30 IST
రద్దీగా ఉన్న జనం మధ్య ఓ మహిళ 6నెలల బాబును ఒడిలో వేసుకుని అడుక్కుంటూ కనిపించింది. దీంతో అయ్యో పాపం! అని చుట్టూ ఉన్న వారంతా జాలిపడ్డారు. ఎవరికి తోచిన సాయం వారు చేశారు. కొందరైతే ఆమె అడక్కుండానే దగ్గరికి వెళ్లి మరీ డబ్బులు అందించారు. అయితే వారిలో కొందరికి మాత్రం..
రద్దీగా ఉన్న జనం మధ్య ఓ మహిళ 6నెలల బాబును ఒడిలో వేసుకుని అడుక్కుంటూ కనిపించింది. దీంతో అయ్యో పాపం! అని చుట్టూ ఉన్న వారంతా జాలిపడ్డారు. ఎవరికి తోచిన సాయం వారు చేశారు. కొందరైతే ఆమె అడక్కుండానే దగ్గరికి వెళ్లి మరీ డబ్బులు అందించారు. అయితే వారిలో కొందరికి మాత్రం.. ఆమె ప్రవర్తనపై అనుమానం కలిగింది. చివరికి పోలీసులు కలుగజేసుకుని.. ఆ బాబు నీ కొడుకేనా..? అని ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికంగా తీవ్ర చర్చనీయంశమైన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
చెన్నై (Chennai) తొండియార్ పేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ ఆరు నెలల బాబును ఎత్తుకుని వీధుల్లో భిక్షాటన (woman begging with child) చేస్తూ ఉంది. ఓ వైపు ఏడుస్తున్న పిల్లాడిని లాలిస్తూ.. మరోవైపు ఎర్రటి ఎండలో తిరుగుతూ అడుక్కుంటున్న ఆమెను చూసి చుట్టు పక్కల ఉన్న వారంతా చలించిపోయారు. ‘‘అయ్యో పాపం!.. ఈమెకు ఎంత కష్టం వచ్చింది’’.. అని జాలిపడుతూ ఎవరికి తోచిన సాయం వారు చేస్తూ ఉన్నారు. అంతా ఆమెను జాలి చూపులు చూస్తుంటే.. కొందరికి మాత్రం అనుమానం కలిగింది. వారి సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. చివరకు ఆమెను పిలిచి.. ‘‘ఏవమ్మా!.. ఇంతకీ ఈ బాబు నీ కొడుకేనా’’.. అంటూ ప్రశ్నించారు.
పోలీసులు ఎదురుగా వచ్చి సడన్‌గా ఉన్న మాట చెప్పడంతో ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆమె చెప్పిన సమాధానంలో కంగారు కనిపిస్తుండడంతో పోలీసుల అనుమానం మరింత బలపడింది. దీంతో ఆమెను స్టేషన్‌కి తీసుకెళ్లి లోతుగా విచారించగా.. చివరకు షాకింగ్ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌కు (Andhra Pradesh) చెందిన సదరు మహిళను తీసుకొచ్చి పిల్లాడిని చేతికిచ్చి భిక్షాటన చేయిస్తున్నట్లు తెలిసింది. కొందరు ముఠా సభ్యులు.. ఇలా వివిధ రాష్ట్రాల నుంచి మహిళలను తరలించి ఇదే పని చేయిస్తున్నట్లు కనుక్కున్నారు. దీంతో చివరకు ఆమె చేతిలో ఉన్న బాబును తీసుకుని.. శిశు సంక్షేమ శాఖ (Child Welfare Department) అధికారులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.