Father: అందుకే చంపేశా.. వాళ్లందరికీ ఇదో గుణపాఠం.. బైక్‌కు కూతురి మృతదేహాన్ని కట్టి ఈడ్చుకెళ్లిన ఆ తండ్రి మాటలివీ..!
ABN , First Publish Date - 2023-08-12T18:34:59+05:30 IST
పిల్లలు తప్పు చేస్తే సున్నితంగా మందలించాల్సిన తల్లిదండ్రులు.. అందుకు విరుద్ధంగా దారుణమైన శిక్షలు విధిస్తుంటారు. కొందరైతే మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు. ప్రధానంగా ప్రేమ వ్యవహారాల్లో ఇలాంటి దారుణాలు ఎక్కువగా జరుగుతుంటాయి. తాజాగా...
పిల్లలు తప్పు చేస్తే సున్నితంగా మందలించాల్సిన తల్లిదండ్రులు.. అందుకు విరుద్ధంగా దారుణమైన శిక్షలు విధిస్తుంటారు. కొందరైతే మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు. ప్రధానంగా ప్రేమ వ్యవహారాల్లో ఇలాంటి దారుణాలు ఎక్కువగా జరుగుతుంటాయి. తాజాగా, పంజాబ్‌లో ఓ వ్యక్తి.. తన కూతురు ప్రియుడి వద్దకు వెళ్లిందనే కోపంతో హత్య చేసి, మృతదేహాన్ని బైక్‌కు కట్టి ఈడ్చుకెళ్లిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా, కోర్టుకు తీసుకెళ్తున్న క్రమంలో నిందితుడు అన్న మాటలకు నెటిజన్ల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
పంజాబ్ (Punjab) అమృత్‌సర్ పరిధి ముచ్చల్ గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన నిహాంగ్ సిఖ్ అనే వ్యక్తి.. తన 20ఏళ్ల కుమార్తెను శుక్రవారం దారుణంగా హత్య చేశాడు. బుధవారం నిహాంగ్ సిఖ్ కుమార్తె ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఇంటి నుంచి వెళ్లి.. మరుసటి రోజు తిరిగి వచ్చింది. దీంతో తండ్రి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ప్రియుడి వద్దకు వెళ్లి తమ పరువుతీసిందని రగిలిపోయాడు. కన్న కూతురని కూడా చూడకుండా ఆమెపై విచక్షణారహితంగా (Father assaults daughter) దాడి చేశాడు. అనంతరం యువతి మృతి దేహాన్ని బైక్‌కు కట్టి గ్రామంలోని రోడ్లపై చాలా సేపు ఈడ్చుకెళ్లాడు. తర్వాత మృతదేహాన్ని రైలు పట్టాల వద్ద పడేసి వెళ్లిపోయాడు.
పోలీసులు సీసీ కెమెరా (CC camera) ఫుటేజీ పరిశీలించగా ఈ దారుణం బయటపడింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. అయితే ఈ క్రమంలో ఎక్కడా నిందితుడిలో ఇసుమంత కూడా పశ్చాత్తాపం కనిపించలేదు. పైగా ఆత్మగౌరవం కోసమే తన కూతుర్ని హత్య చేశారనని చెప్పుకొచ్చాడు. ఇది మిగతా బాలికలు, యువతులకు గుణపాఠం కావాలన్నాడు. తన కూతురిని చంపడం తనకు గర్వంగా ఉందని చెప్పడం చూసి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నిహాంగ్ సిఖ్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇలాంటి వారికి కఠిన శిక్షలు విధించాలి’’.. అంటూ కొందరు, ‘‘ఈ తరహా ఘటనలు పురరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి’’.. అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.