Indian: ఉగ్రవాదులకు నిధులు.. బ్రిటన్‌లో భారతీయుడి అరెస్ట్.. బెయిల్ నిరాకరణ
ABN , First Publish Date - 2023-04-28T13:15:01+05:30 IST
ఉగ్రవాదులకు నిధులు సమకూర్చాడన్న అభియోగాలపై బ్రిటన్ పోలీసులు (Britain Police) కస్టడీలో ఉన్న భారతీయుడి బెయిల్ పిటిషన్‌ను అక్కడి న్యాయస్థానం నిరాకరించింది.
లండన్: ఉగ్రవాదులకు నిధులు సమకూర్చాడన్న అభియోగాలపై బ్రిటన్ పోలీసులు (Britain Police) కస్టడీలో ఉన్న భారతీయుడి బెయిల్ పిటిషన్‌ను అక్కడి న్యాయస్థానం నిరాకరించింది. ప్రస్తుతం భారత సంతతి వ్యక్తిని యూఎస్‌కు అప్పగించే ప్రక్రియ జరుగుతోంది. ఈ కేసు స్కాట్లాండ్ యార్డ్ లండన్ పోలీసుల పర్యవేక్షణలో ఉంది. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు రాష్ట్రం మధురైకి చెందిన 65 ఏళ్ల సుందర్ నాగరాజన్ (Sundar Nagarajan) మంగళవారం వీడియో లింక్ ద్వారా వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో (Westminster Magistrate Court) విచారణకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా తనపై మోపిన మోసం, మనీలాండరింగ్ ఆరోపణలను అతడు వ్యతిరేకించాడు. మరోవైపు నాగరాజన్ హిందూ నేపథ్యానికి చెందినవాడని, ఇస్లామిక్ ఉగ్రవాదానికి మద్ధతు ఇవ్వలేదని జిల్లా జడ్జి బ్రియోనీ క్లార్క్ తెలిపారు. అయినప్పటికీ అతడికి బెయిల్ (Bail) ఇవ్వడాన్ని న్యాయమూర్తి తోసిపుచ్చారు. అలాగే వచ్చే నెల 23వ తేదీన అదే కోర్టులో మరోసారి వీడియో లింక్ ద్వారా విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.
కాగా, నాగరాజన్‌ను మెట్ పోలీస్ అనుబంధ విభాగం నేషనల్ ఎక్స్‌ట్రాడిషన్ యూనిట్ ఏప్రిల్ 18న పశ్చిమ లండన్‌లోని హేస్ వద్ద అదుపులోకి తీసుకుంది. మరోవైపు అమెరికా అధికారుల తరపున క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (Crown Prosecution Service) వాదనలు వినిపించింది. సుందర్ నాగరాజన్‌కు లెబనీస్ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లాతో (Hizballah terrorist organisation) ఆర్ధిక లావాదేవీల విషయంలో సంబంధాలు ఉన్నాయని న్యాయవాదులు వాదించారు. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నాడే అనుమానంతో వేల్స్‌లో 50 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత మెట్రోపాలిటిన్ పోలీస్ కౌంటర్ టెర్రరిజం కమాండ్ (Metropolitan Police Counter Terrorism Command) నాగరాజన్‌ను సైతం అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.