Anand Mahindra: టీమ్ ఇండియా జెర్సీ ఓకే కానీ.. దానిపై 55 అనే నెంబర్ ఏంటి..?.. నెటిజన్లకు ఆనంద్ మహీంద్ర వెరైటీ టాస్క్..!
ABN , First Publish Date - 2023-10-06T15:24:30+05:30 IST
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ పోటీలు అక్టోబర్ 5నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇకనవంబర్ 19వరకూ క్రికెట్ అభిమానులకు పెద్ద పండుగనే చెప్పాలి. ఇదిలావుండగా, వరల్డ్ కప్ పోటీలు ప్రారంభమైన సందర్భంగా ప్రస్తుతం ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ..
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ పోటీలు అక్టోబర్ 5నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక నవంబర్ 19వరకూ క్రికెట్ అభిమానులకు పెద్ద పండుగనే చెప్పాలి. ఇదిలావుండగా, వరల్డ్ కప్ పోటీలు ప్రారంభమైన సందర్భంగా ప్రస్తుతం ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన పోస్టు తెగ వైరల్ అవుతోంది. ఆయన షేర్ చేసిన టీమిండియా జెర్సీపై ‘‘ఆనంద్ 55’’ అని రాసి ఉంది. దీంతో క్రికెట్ అభిమానులంతా ప్రస్తుతం ఈ జెర్సీపై ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. టీమ్ ఇండియా జెర్సీ ఓకే గానీ.. దానిపై 55 అనే నెంబర్ ఏంటి..?.. అని చాలా మంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘దీనికి ఎవరు సరైన సమాధానం చెప్పగలరలో తెలుసుకోవాలనుంది’’’.. అంటూ నెటిజన్లు ఆనంద్ మహీంద్ర వెరైటీ టాస్క్ ఇచ్చారు.. వివరాల్లోకి వెళితే..
వినూత్న ప్రయోగాలు చేసే మట్టిలో మాణిక్యాలను ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటూ ఆసక్తికర పోస్టులు చేయడంలో.. మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ముందుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. స్వతహాగానే క్రికెట్‌ను ఇష్టపడే ఆయన.. వన్డే వరల్డ్ కప్ పోటీలు ప్రారంభమైన సందర్భంగా మళ్లీ వార్తల్లో నిలిచారు. తన పేరుతో ఉన్న జెర్సీ ఫొటోను షేర్ చేయడంతో ప్రస్తుతం అందరి దృష్టీ ఈ ఫొటోపైనే పడింది. చాలా మంది ఈ జెర్సీపై ఉన్న 55నంబర్ ఏంటని సందేహాలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేశారు. అక్టోబర్ 5న ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా వేదికగా రెండు జెర్సీ ఫొటోలను షేర్ చేస్తూ.. క్యాప్షన్‌లో బీసీసీఐకి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే నేను సిద్ధంగా ఉన్నాను.. అని పేర్కొన్నారు. ఈ ప్రత్యేకమైన జెర్సీని ఆనంద్ మహీంద్రాకు బీసీసీఐ బహూకరించినట్లు తెలుస్తోంది. మహీంద్రా గ్రూప్‌నకు చెందిన ఐటీ విభాగమైప టెక్ మహీంద్రా.. బీసీసీఐకి డిజిటల్ పార్ట్‌నర్‌గా కొనాసాగుతున్న విషయం తెలిసిందే.
అయితే జెర్సీపై ఉన్న 55నంబర్‌పై క్రికెట్ అభిమానుల సందేహాలను ప్రస్తావిస్తూ.. దీనికి ఎవరు సరైన సమాధానం చెప్పగలరలో తెలుసుకోవాలనుంది... అంటూ ఆనంద్ మహీంద్రా మళ్లీ రీట్వీట్ చేశారు. దీంతో అప్పటి నుంచి నెటిజన్లు ఈ నంబర్ వెనుక ఉన్న నేపథ్యంపై వివిధ రకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ‘‘మీరు 1955లో జన్మించారు కాబట్టి.. జెర్సీపై 55 అని ముంద్రిచారు’’.. అని ఓ వ్యక్తి చెప్పగా.. ‘‘కోహ్లీ, ఆనంద్‌కు 5అక్షరాలు ఉన్నాయి కాబట్టి.. ఇద్దరిలో 5ను తీసుకుని 55 అని పెట్టారు’’.. అంటూ మరో వ్యక్తి ప్రస్తావించారు. ఈ పోస్టు ప్రస్తుతం 3లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ జెర్సీని చూస్తే మీకేమనిపిస్తోందో.. కామెంట్ల రూపంలో తెలియజేయండి..