Viral News: అట్టముక్కలు అమ్ముకునే ఇతడు.. రతన్ టాటాకు ఏమాత్రం తీసిపోడు.. ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే..!
ABN , First Publish Date - 2023-06-22T15:28:33+05:30 IST
డబ్బు సంపాదన ధ్యేయంగా బతికే నేటి సమాజంలో పక్కవారి గురించి ఆలోచించే వారే కరువయ్యారు. ఆస్తుల కోసం అవరసమైతే తల్లిదండ్రులను కూడా చంపేసే మనుషులున్న ప్రస్తుత పరిస్థితుల్లో మానవత్వం ఉన్న వారు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ఇలాంటి అరుదైన వ్యక్తుల్లో ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి..
డబ్బు సంపాదన ధ్యేయంగా బతికే నేటి సమాజంలో పక్కవారి గురించి ఆలోచించే వారే కరువయ్యారు. ఆస్తుల కోసం అవరసమైతే తల్లిదండ్రులను కూడా చంపేసే మనుషులున్న ప్రస్తుత పరిస్థితుల్లో మానవత్వం ఉన్న వారు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ఇలాంటి అరుదైన వ్యక్తుల్లో ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి ముందు వరుసలో ఉంటాడు. అట్టముక్కలు అమ్మకునే ఇతను.. రతన్ టాటాకు ఏమాత్రం తీసిపోడు. నాకెందుకు ఇంత డబ్బంటూ రూ.35లక్షలను పేదలకు పంచేశాడు. ఇతడి నేపథ్యానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
హర్యానాలోని (Haryana) కైతాల్ జిల్లాకు చెందిన 53 ఏళ్ల ఫకీర్ చంద్ అనే వ్యక్తికి స్థానికంగా రతన్ టాటా (Ratan Tata) అంతటి పేరు ఉందంటే అతిశయోక్తి కాదు. అలాగని ఇతడు పెద్ద వ్యాపారవేత్త అనుకుంటే పొరపాటు. స్థానికంగా స్క్రాప్ ఏరుకునే ఇతను.. తన సంపాదనలో 90శాతం ఛారిటీకి (Charity) విరాళంగా ఇస్తున్నాడు. ఫకీర్ చంద్ గత 25 ఏళ్లుగా స్క్రాప్ డీలర్‌గా పని చేస్తున్నాడు. ఇతడికి ఐదుగురు అన్నదమ్ములు ఉన్నా.. ఇప్పటికీ ఒంటరిగా చిన్న గదిలో ఉంటున్నాడు. ఫకీర్ చంద్ తాను సంపాదించిన రూ.11లక్షలతో పాటూ తన సోదరుడు, సోదరి మరణించిన తర్వాత.. తాను పొదుపు చేసిన రూ.24లక్షల మొత్తాన్ని కూడా విరాళంగా ఇచ్చేశాడు. ఎలాంటి వాహనమూ వాడకుండా రోజూ కాలి నడకనే కార్డ్ బోర్డ్‌ను సేకరించడం, దాన్ని స్క్రాప్ దుకాణలో విక్రయించడం చేస్తుంటాడు.
ఫకీర్ చంద్.. రోజూ రూ.700 నుంచి రూ.800 సంపాదిస్తాడు. ఇందులో తన జీవనోపాధి కోసం రూ.150 నుంచి రూ.200లు ఉంచుకుని, మిగతా మొత్తాన్ని విరాళంగా ఇస్తుంటాడు. ఇతను ఇప్పటి వరకూ 5మంది పేద యువతులకు వివాహాలు (marriages) చేశాడు. ఈ సందర్భంగా ఒక్కో అమ్మాయికి సుమారు రూ.75 వేల విలువైన సరుకులు కూడా అందజేశాడు. వివాహాలే కాకుండా స్థానికంగా ఉండే ధర్మశాలలో గోవుల కోసం ఓ షెడ్, కురుక్షేత్రలోని అరుణోదయ దేవాలయంలోని ధర్మశాలలో ఓ షెడ్‌ను నిర్మించారు. అదేవిధంగా కైతాల్‌లో నిర్మాణంలో ఉన్న నీలకంఠ ఆలయానికి సుమారు రూ.13లక్షలు విరాళంగా (donation) అందజేశారు. మరోవైపు వృద్ధాశ్రమంలో రూ.2.30లక్షలతో ఓ గదిని కూడా నిర్మించాడు. అలాగే శ్యామ్ మందిర్‌లో రూ.3.60లక్షలతో షెడ్డును కూడా నిర్మించారు. ఇంతటి సేవాగుణం ఉన్న ఫకీర్ చంద్‌ను స్థానికంగా ప్రజలు ఎంతో గౌరవిస్తారు.
ఫకీర్ చంద్ మాట్లాడుతూ.. తాను రోజూ అట్ట, ప్లాస్టిక్, ఐరన్ కొని స్క్రాప్ దుకాణంలో విక్రయిస్తుంటానని తెలిపాడు. కష్టపడి పని చేయడమంటే తనకు ఇష్టమని, శారీరక శ్రమ ఉంటేనే ఆరోగ్యంగా ఉండొచ్చని చెప్పాడు. రతన్ టాటా వంటి గొప్పవారు విరాళం చేయడం చూసి.. తానూ అలాగే దానం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. సాయం చేయడానికి ధనవంతడు కానవసరం లేదని, పెద్ద మనసు ఉంటే చాలని పేర్కొన్నాడు. సంపాదించే డబ్బులో అవసరాలకు ఉంచుకుని, మిగిలిన మొత్తాన్ని విరాళంగా ఇవ్వాలనేదే తన ఆశయమని చెబుతున్న ఫకీర్ చంద్.. ప్రజలంతా ఇలాగే చేయాలని సూచిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.