Crime News: మద్యానికి బానిసైన తండ్రి.. కన్నకూతురని కూడా చూడకుండా.. అతడు చేసిన దారుణంపై గ్రామస్తుల ఆగ్రహం.. తామే శిక్షిస్తామంటూ..
ABN , First Publish Date - 2023-05-11T21:50:53+05:30 IST
మనుషుల్లో మానవత్వం చచ్చిపోతోంది. కొందరైతే రోజురోజుకూ మరీ రాక్షసత్వంగా తయారవుతున్నారు. ఇంకొందరు మద్యానికి బానిసలై చివరకు ఉన్నాదులుగా మారి దారుణాలకు తెగబడుతున్నారు. మరికొందరు శాడిస్టులు..
మనుషుల్లో మానవత్వం చచ్చిపోతోంది. కొందరైతే రోజురోజుకూ మరీ రాక్షసత్వంగా తయారవుతున్నారు. ఇంకొందరు మద్యానికి బానిసలై చివరకు ఉన్నాదులుగా మారి దారుణాలకు తెగబడుతున్నారు. మరికొందరు శాడిస్టులు.. కన్న పిల్లలపై కూడా కర్కశత్వంగా ప్రవర్తిస్తున్నారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. మద్యానికి బానిసైన తండ్రి.. కన్నకూతురని చూడకుండా దారుణానికి పాల్పడ్డాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన గ్రామస్తులు.. నిందితుడిని తామే శిక్షిస్తామంటూ ఆందోళన చేపట్టారు. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
కన్నతండ్రే ఉన్మాదిగా మారి పదేళ్ల కూతురిని గొడ్డలితో నరికి చంపిన సంఘటన తెలంగాణలోని (Telangana) పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని భట్టుపల్లి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసిన సమయంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. మంథని సీఐ సతీష్ కథన ప్రకారం.. భట్టుపల్లి గ్రామానికి చెందిన సదయ్య కొంత కాలంగా ఉన్మాదిగా మారి పలువురిపై దాడి (attack) చేస్తున్నాడు. సదయ్య కొంతకాలంగా ఏపని చేయకుండా మద్యానికి బానిసై వేధింపులకు గురిచేస్తుండటంతో 9 నెలల క్రితం భార్య శ్రీలత ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
ప్రస్తుతం తన కొడుకు, కూతురుతో కలిసి సదయ్య ఉంటున్నాడు. గురువారం ఉదయం కూతురు గుండ్ల రజిత(10)ను సదయ్య మెడపై గొడ్డలితో (Father assaults daughter) నరకడంతో అక్కడికక్కడే మృతిచెందింది. అనంతరం సదయ్య కొద్ది దూరంలో ఉన్న కిరాణ షాపు వద్ద వెళ్లి షాపు యాజమాని శ్రీనివాస్‌పై సైతం గొడ్డలితో దాడి చేయడంతో ముఖంపై గాయాలయ్యాయి. అనంతరం ఇంటికి తిరిగి వచ్చాడు. కొంతసేపటికి ఇంటికి వచ్చిన కొడుకు అంజిపై కూడ సదయ్య గడ్డపారతో దాడికి ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు (police) .. అక్కడికి వచ్చి సదయ్యను అదుపులోకి తీసుకున్నారు.
అయితే సదయ్యను తరలిస్తున్న పోలీసుల వాహనాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. నిందితుడిని తమకు అప్పగించాలని, తామే అతన్ని శిక్షిస్తామని డిమాండ్ చేస్తూ వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఇందుకు పోలీసులు నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన గ్రామస్తులు ఎస్సై వాహనంపై కర్రలతో దాడి చేశారు. సదయ్యను గ్రామస్థులు కిందకు దింపేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవటంతో వారిపై కారం పొడి చల్లారు. చట్టపరంగా నిందితుడికి కఠినంగా శిక్షపడేలా చూస్తామని పోలీసులు సర్దిచెప్పి.. చివరికి ఎలాగోలా గ్రామస్తులను శాంతిపజేశారు. పోలీసు బందోబస్తు మధ్య సదయ్యను మంథని పోలీసు స్టేషన్‌కు తరలించారు. రజిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.