Viral: రైల్వే ట్రాక్‌పై చెత్త ఏరుకుంటుండగా ఓ బ్యాగ్ కంటపడింది.. తెరిచి చూస్తే..
ABN , First Publish Date - 2023-11-08T10:58:56+05:30 IST
దారిలో అలా నడుస్తూ పోతుంటే ఒక రూ.100 దొరికితేనే మనకు ఎక్కడ లేని సంతోషం కల్గుతుంది. అలాంటిది కోట్ల రూపాయలు దొరికితే ఎలా ఉంటుంది? అంతెందుకు తీవ్ర ఆర్థిక కష్టాల్లో సతమవుతున్నప్పుడు అలా నడుస్తూ వెళ్తుంటే భారీ మొత్తంలో డబ్బు దొరికితే బాగుండు అని మనలో చాలా మంది చాలా సార్లు అనుకునే ఉంటారు.
బెంగళూరు: దారిలో అలా నడుస్తూ పోతుంటే ఒక రూ.100 దొరికితేనే మనకు ఎక్కడ లేని సంతోషం కల్గుతుంది. అలాంటిది కోట్ల రూపాయలు దొరికితే ఎలా ఉంటుంది? అంతెందుకు తీవ్ర ఆర్థిక కష్టాల్లో సతమవుతున్నప్పుడు అలా నడుస్తూ వెళ్తుంటే భారీ మొత్తంలో డబ్బు దొరికితే బాగుండు అని మనలో చాలా మంది చాలా సార్లు అనుకునే ఉంటారు. కానీ అది నిజమైతే ఎలా ఉంటుంది? ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించడం కష్టం. అచ్చం ఇలాంటి ఘటనే బెంగళూరులో జరిగింది. చెత్త ఏరుకుంటూ సాధారణ జీవనం గడిపే ఓ వ్యక్తికి కోట్ల రూపాయలతో కూడిన బ్యాగు దొరికింది. ఆ బ్యాగులో ఉన్నది ఒక కోటి కాదు, రెండు కోట్లు కాదు, అలా అని 5, 10 కోట్లు కూడా కాదు. ఏకంగా 25 కోట్ల రూపాయలు. అంత డబ్బు దొరకడంతో సాధారణంగా చెత్త ఏరుకునే ఆ వ్యక్తి కోటీశ్వరుడైపోతాడు. కానీ అదృష్టానికి తోడు దురదృష్టం కూడా అతని వెంటే ఉంది. ఆ డబ్బు అంతా అమెరికా డాలర్ల రూపంలో ఉంది. ఆ డబ్బులో ఉన్నది 3 మిలియన్ల అమెరికా డాలర్లు. దీంతో ఆ డబ్బును చెత్త ఏరుకునే ఆ వ్యక్తి ఏ మాత్రం ఉపయోగించులేకపోయాడు. చివరకు ఆ డబ్బు పోలీసుల దగ్గరికి వెళ్లింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్‌లోని నదియాకు చెందిన 39 ఏళ్ల ఎస్‌కే సేల్‌మాన్ అనే వ్యక్తి బెంగళూరులో చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తన పనిలో భాగంగానే గత శుక్రవారం కూడా బెంగళూరులోని నాగవార రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో చెత్త సేకరించాడు. చెత్త కోసం వెతుకుతుండంగా రైల్వే ట్రాక్‌పై సేల్‌మాన్‌కు ఓ నల్ల బ్యాగు కనిపించింది. ఆ బ్యాగును అమృతహళ్లిలోని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటికివెళ్లాక ఆ బ్యాగును తెరిచి చూడగా 23 బండిళ్ల డాలర్ల కట్టలు ఉన్నాయి. దాని విలువ మొత్తం 3 మిలియన్ల డాలర్లు. మన భారతదేశ కరెన్సీలో రూ.25 కోట్లు. సాధారణంగా అంత డబ్బు ఒకసారిగా కనిపించాక ఏం చేయాలో తోచదు. ఆ సమయంలో సాల్మన్‌కు కూడా అదే జరిగింది. పైగా అదంతా డాలర్ల రూపంలో ఉండడంతో అతను వాడుకోలేడు. దీంతో తనకు తెలిసిన గుజరీ వ్యాపారికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. కానీ అతను ఆ సమయంలో వేరే ఊర్లో ఉన్నాడు. దీంతో తాను వేరే ఊరికి వెళ్లానని, బెంగళూరు తిరిగి వచ్చేవరకు ఆ బ్యాగును మీ వద్దనే పెట్టుకోమ్మని చెప్పాడు. కానీ ఇంట్లో డబ్బు ఉంచడం కష్టమని భావించిన సేల్‌మాన్ ఆదివారం స్వరాజ్ ఇండియాకు చెందిన సామాజిక కార్యకర్త ఆర్ కలీమ్ ఉల్లాను సంప్రదించాడు. దీంతో ఈ విషయాన్ని కలీమ్ ఉల్లా సీటీ పోలీస్ కమిషనర్ బీ దయానందకు తెలియచేశారు.
“నేను డబ్బు గురించి కమీషనర్‌కి తెలియచేశాను. దీంతో డబ్బుతో పాటు సేల్‌మాన్‌ను తన కార్యాలయానికి తీసుకురావాలని అయన నాకు తెలిపారు. అప్పటికీ ఇంకా షాక్‌లోనే ఉన్న సేల్‌మాన్.. రైల్వే ట్రాక్‌పై డబ్బు దొరికిందని తెలిపాడు. కమీషనర్ వెంటనే హెబ్బాల్ పోలీసులను పిలిచి సంఘటనా స్థలాన్ని పరిశీలించవలసిందిగా కోరారు” అని ఉల్లా చెప్పారు. అయితే బ్యాగులో విషపూరితమైన రసాయనాలున్నాయని అందుకే తెరిచేటప్పుడు జాగ్రత్త అని ఓ లెటర్ కూడా రాసి ఉండడం గమనార్హం. అయితే ఆ డాలర్లన్నీ నకిలీవని, వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పంపామని హెబ్బాల్ పోలీసులు తెలిపారు. ఆ డబ్బు ఐక్యారాజ్యసమితికి చెందిన ఆర్థిక నేరాల విభానికి చెందినదని చెప్పారు. కాగా ఆ డబ్బును రిజర్వ్ బ్యాంగ్ ఆఫ్ ఇండియా క్షణ్ణంగా పరిశీలించాక పూర్తి స్పష్టత రానుంది.