IND vs SL: రివెంజ్ అంటే ఇది సామి.. 23 ఏళ్ల తర్వాత శ్రీలంకను దెబ్బకు దెబ్బ తీసిన భారత్!

ABN , First Publish Date - 2023-09-17T20:55:18+05:30 IST

51 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా ఓపెనర్లు 6.1 ఓవర్‌లోనే పూర్తి చేశారు. దీంతో ఏకంగా 263 బంతులు మిగిలి ఉండగానే 10 వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ క్రమంలో భారత జట్టు 23 ఏళ్ల క్రితం శ్రీలంక చేతిలో ఎదురైన ఘోరపరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది.

IND vs SL: రివెంజ్ అంటే ఇది సామి.. 23 ఏళ్ల తర్వాత శ్రీలంకను దెబ్బకు దెబ్బ తీసిన భారత్!

కొలంబో: ఆసియా కప్ 2023 విజేతగా టీమిండియా అవతరించింది. టోర్నీ అసాంతం స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చిన భారత జట్టు ఫైనల్‌లో అతిథ్య జట్టు శ్రీలంకను చిత్తు చేసింది. దీంతో రికార్డు స్థాయిలో 8వ సారి ఆసియా కప్‌ను ఖాతాలో వేసుకుంది. టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బంతులతో చెలరేగడంతో శ్రీలంక వికెట్లు టపటప రాలాయి. ఒకే ఓవర్‌లో సిరాజ్ 4 వికెట్లు పడగొట్టడంతో మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చేసింది. సిరాజ్‌ విజృంభణతో భీకరంగా తయారైన భారత బౌలింగ్‌ను ఎదుర్కొలేక శ్రీలంక 15.2 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసి 50 పరుగులకే కుప్పకూలింది. అనంతరం 51 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా ఓపెనర్లు 6.1 ఓవర్‌లోనే పూర్తి చేశారు. దీంతో ఏకంగా 263 బంతులు మిగిలి ఉండగానే 10 వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ క్రమంలో భారత జట్టు 23 ఏళ్ల క్రితం శ్రీలంక చేతిలో ఎదురైన ఘోరపరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది.


1999లో కోకో-కోలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో శ్రీలంక చేతిలో టీమిండియా ఘోరపరాజయం పాలైంది. షార్జా వేదికగా జరిగిన ఆ ఫైనల్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 299 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ జట్టు ఓపెనర్ సనత్ జయసూర్య 21 ఫోర్లు, 4 సిక్సులతో 161 బంతుల్లోనే 189 పరుగులతో విశ్వరూపం చూపించాడు. అనంతరం 300 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 26.3 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసి 54 పరుగులకే కుప్పకూలింది. దీంతో శ్రీలంక 245 పరుగులు భారీ తేడాతో గెలిచి ట్రోఫిని సొంతం చేసుకుంది. భారత బ్యాటర్లలో 11 పరుగులు చేసిన రాబిన్ సింగే టాప్ స్కోరర్. మిగతా వారిలో ఏ ఒక్కరు కూడా డకౌట్ కాకపోయినప్పటికీ అందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. శ్రీలంక బౌలర్లలో చమిందా వాస్ 5, ముత్తయ్య మురళీధరన్ 3 వికెట్లు తీశాడు.

అయితే తాజాగా ఆసియా కప్ ఫైనల్‌లో శ్రీలంకను టీమిండియా 50 పరుగులకే ఆలౌట్ చేసి ప్రతీకారం తీర్చుకుంది. ఇంక చెప్పాలంటే అంతకన్నా 4 పరుగులు తక్కువకే ఆలౌట్ చేసింది. 1999లో శ్రీలంక జట్టులో చమిందా వాస్ 5 వికెట్లు తీసి భారత్‌ను దెబ్బ కొడితే.. తాజా మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో 4 వికెట్లతోపాటు మొత్తంగా 6 వికెట్లు తీసి లంకను సిరాజ్ వణికించాడు. అలాగే 6.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి నాటి శ్రీలంక కన్నా టీమిండియా పెద్ద విజాయాన్నే నమోదు చేసింది. దీంతో 23 ఏళ్ల తర్వాత టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. శ్రీలంకను దెబ్బకు దెబ్బ తీసి టీమిండియా సత్తా ఏంటో చూపించింది. మొత్తంగా 23 ఏళ్ల పాటు ఎదురుచూసిన ప్రతీకారానికి నేటితో తెరపడింది.

Updated Date - 2023-09-17T20:55:18+05:30 IST