ODI World Cup: ఈ ఐదు సెంటిమెంట్లు చాలు.. ఇండియాదే వన్డే ప్రపంచకప్

ABN , First Publish Date - 2023-08-30T14:12:44+05:30 IST

1983, 2011 తర్వాత ఇప్పటివరకు భారత్ వన్డే ప్రపంచకప్ గెలవలేదు. ఈ నేపథ్యంలో 2011లో జరిగిన కొన్ని విషయాలు 2023లో రిపీట్ అవుతున్నాయని.. దీంతో భారత్ వన్డే ప్రపంచకప్ కైవసం చేసుకుంటుందని పలువురు స్పష్టం చేస్తున్నారు.

ODI World Cup: ఈ ఐదు సెంటిమెంట్లు చాలు.. ఇండియాదే వన్డే ప్రపంచకప్

టీమిండియా ఐసీసీ టైటిల్ గెలిచి చాలా ఏళ్లు దాటుతోంది. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత ఇప్పటివరకు భారత్ ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవలేకపోయింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సొంతగడ్డపై జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. 2011లో వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత్ ఈ ఏడాది మరోసారి విజేతగా నిలవాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ మేరకు కొన్ని సెంటిమెంట్లు కూడా అభిమానులను ఊరిస్తున్నాయి. 2011లో జరిగిన కొన్ని విషయాలు 2023లో రిపీట్ అవుతున్నాయని.. దీంతో భారత్ వన్డే ప్రపంచకప్ కైవసం చేసుకుంటుందని పలువురు స్పష్టం చేస్తున్నారు.

ముఖ్యంగా ఐదు సెంటిమెంట్లు భారత్ విశ్వవిజేతగా నిలుస్తుందని చాటిచెప్తున్నాయని అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. 2011లో జరిగిన మెగా టీ20 లీగ్ ఐపీఎల్‌లో ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలవగా.. 2023 సీజన్‌లో కూడా అదే జట్టు టైటిల్ గెలిచింది. అంతేకాకుండా 2011లో బంగ్లాదేశ్ కెప్టెన్‌గా షకీబుల్ హసన్ ఉండగా.. 2023లోనూ అతడు అనూహ్యంగా మరోసారి సారథిగా ఎంపికయ్యాడు. అటు 2011 ఆస్ట్రేలియా ఓపెన్‌లో సెర్బియా స్టార్ ఆటగాడు జకోవిచ్ విజేతగా నిలవగా.. 2023 ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ను కూడా అతడే కైవసం చేసుకున్నాడు. మరోవైపు యూరోపియన్ ఫుట్‌బాల్ ఆధ్వర్యంలో జరిగే ఛాంపియన్స్ లీగ్‌లో పెప్ గార్డియోలా మేనేజర్‌గా వ్యవహరించిన టీమ్ 2011లో విజేతగా నిలవగా.. 2023లోనూ అతడి టీమ్ టైటిల్ విన్నర్‌గా నిలిచింది. 2011 ఛాంపియన్స్ లీగ్‌లో పెప్ గార్డియోలా మేనేజర్‌గా వ్యవహరించిన బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్‌ విజేతగా నిలిచింది. ఈ ఏడాది అతడు మాంచెస్టర్ సిటీ జట్టుకు మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహించాడు. వీటితో పాటు మరో సెంటిమెంట్ కూడా భారత్‌ను ఊరిస్తోంది. 2019లో చంద్రయాన్-2 విఫలం కాగా అదే ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్ సెమీస్‌లో టీమిండియా బొక్కబోర్లా పడింది. అయితే ఈ ఏడాది చంద్రయాన్-3 సక్సెస్ కావడంతో భారత్ మరోసారి ప్రపంచకప్ గెలుస్తుందని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Asia Cup 2023: టీమిండియాకు షాక్.. తొలి రెండు మ్యాచ్‌లకు స్టార్ ఆటగాడు దూరం

కాగా అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగా టోర్నీకి సెప్టెంబర్ తొలి వారంలో జట్టు ప్రాబబుల్స్‌ను సెలక్టర్లు ప్రకటించే అవకాశం ఉంది. కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోనీ ఆధ్వర్యంలో టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. 1983, 2011 తర్వాత ఇప్పటివరకు భారత్ వన్డే ప్రపంచకప్ గెలవలేదు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ఆధ్వర్యంలోని టీమిండియా రానున్న ప్రపంచకప్‌లో ఎలాంటి ప్రదర్శన చేస్తుందోనని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Updated Date - 2023-08-30T14:12:44+05:30 IST