Ashes Series 4th Test: క్రాలీ అద్భుత సెంచరీ.. ఇంగ్లండ్‌కు భారీ ఆధిక్యం

ABN , First Publish Date - 2023-07-21T20:11:42+05:30 IST

మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ చెలరేగి ఆడింది. ఆ జట్టు బ్యాటర్లు వన్డే తరహాలో బ్యాటింగ్ చేశారు. దీంతో ఇంగ్లండ్ జట్టుకు 275 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఓపెనర్ జాక్ క్రాలీ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. 182 బాల్స్‌లో 21 ఫోర్లు, 3 సిక్సర్లతో 189 రన్స్ చేశాడు.

Ashes Series 4th Test: క్రాలీ అద్భుత సెంచరీ.. ఇంగ్లండ్‌కు భారీ ఆధిక్యం

ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ (Australia-England) మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్‌(Ashes Series)లో నాలుగో టెస్టు రసపట్టులో సాగుతోంది. మాంచెస్టర్ (Manchester) వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు చెలరేగి ఆడారు. దీంతో ఆ జట్టు 592 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ టెస్టులో టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 317 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్‌కు ఐదు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ బెన్ డకెట్ (1) విఫలమయ్యాడు. అయితే మరో ఓపెనర్ జాక్ క్రాలీ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. 182 బాల్స్‌లో 21 ఫోర్లు, 3 సిక్సర్లతో 189 రన్స్ చేశాడు.

క్రాలీ అండగా ఇతర బ్యాటర్లు కూడా సత్తా చూపించారు. వన్డే తరహాలో వేగంగా ఆడారు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన మొయిన్ అలీ, ఆ తర్వాత బరిలోకి దిగిన జో రూట్ కూడా హాఫ్ సెంచరీలతో చెలరేగారు. మొయిన్ అలీ 82 బాల్స్‌లో 54 రన్స్ చేయగా.. జో రూట్ 95 బాల్స్‌లో 84 రన్స్ చేశారు. వీళ్లు పెవిలియన్‌కు చేరిన తర్వాత కెప్టెన్ బెన్ స్టోక్స్ (51), హ్యారీ బ్రూక్ (61) కూడా ధాటిగా ఆడారు. చివర్లో టెయిలెండర్ల సాయంతో జానీ బెయిర్‌స్టో (99 నాటౌట్) కూడా అదరగొట్టే ఆటతీరు ప్రదర్శించాడు. ఎడాపెడా బౌండరీల వర్షం కురిపించాడు. 81 బాల్స్‌లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 99 పరుగులు చేశాడు. అయితే ఒక్క పరుగు తేడాతో సెంచరీని మిస్ చేసుకున్నాడు. చివరి వికెట్‌గా జేమ్స్ ఆండర్సన్ ఔట్ కావడంతో బెయిర్ స్టో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.

ఇది కూడా చదవండి: Shubman Gill: గిల్ ప్రతాపం ఇక్కడేనా? అతడి పనైపోయిందా?

ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హేజిల్ వుడ్‌ 5 వికెట్లు సాధించాడు. మొత్తంగా ఇంగ్లండ్‌కు 275 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ప్రస్తుతం మూడో రోజు సెకండ్ సెషన్‌లో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ ఆడుతోంది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉండగా ఇంగ్లండ్ జట్టుకు విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయి. కాగా ఐదు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-1 ఆధిక్యంలో ఉంది. ఈ టెస్టును గెలిచి సిరీస్ సమం చేయాలని ఇంగ్లండ్ జట్టు భావిస్తోంది.

ఇది కూడా చదవండి: Virat Kohli: కెరీర్‌లో ఇలా ఆడటం కోహ్లీకి ఇదే తొలిసారి..!!

Updated Date - 2023-07-21T20:11:42+05:30 IST