ICC: శ్రీలంకకు భారీ షాక్.. శ్రీలంక బోర్డు సభ్యత్వాన్ని సస్పెండ్ చేసిన ఐసీసీ
ABN , First Publish Date - 2023-11-10T21:33:45+05:30 IST
Srilanka Cricket Board: మెగా టోర్నీలో శ్రీలంక పేలవ ప్రదర్శన పట్ల ఆ దేశ ప్రభుత్వం ఆగ్రహించింది. దీంతో క్రికెట్ బోర్డును రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న శ్రీలంక క్రికెట్ బోర్డు మేనేజ్‌మెంట్ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో బోర్డును రద్దు చేస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు వెల్లడించింది.
మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందాన ఉన్నట్లు తయారైంది ప్రస్తుతం శ్రీలంక క్రికెట్ జట్టు పరిస్థితి. సీనియర్ల రిటైర్మెంట్ తర్వాత పూర్వవైభవం కోసం ఆరాటపడుతున్న శ్రీలంకకు దెబ్బ మీద దెబ్బ పడింది. ఇప్పటికే వన్డే ప్రపంచకప్‌లో లీగ్ దశలోనే ఇంటిదారి పట్టిన ఆ జట్టుకు ఐసీసీ మరో షాక్ ఇచ్చింది. స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న శ్రీలంక క్రికెట్ బోర్డు మేనేజ్‌మెంట్ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో బోర్డును రద్దు చేస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు వెల్లడించింది. శుక్రవారం జరిగిన ఐసీసీ సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. శ్రీలంక క్రికెట్ బోర్డు సభ్యులపై అవినీతి ఆరోపణలు రావడం.. లంక ప్రభుత్వం బోర్డు మొత్తాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఐసీసీ ఈ ప్రకటన చేసింది.
కాగా ఐసీసీ చేసిన సస్పెన్షన్ ఎప్పటి వరకు అమల్లో ఉంటుందనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుత ప్రపంచకప్‌లో శ్రీలంక 9 మ్యాచ్‌లు ఆడి కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించి ఏడు మ్యాచ్‌లలో ఓటమి పాలైంది. టీమిండియా చేతిలో అయితే ఏకంగా 302 రన్స్ తేడాతో పరాజయం మూటగట్టుకుంది. మెగా టోర్నీలో శ్రీలంక పేలవ ప్రదర్శన పట్ల ఆ దేశ ప్రభుత్వం ఆగ్రహించింది. దీంతో క్రికెట్ బోర్డును రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై స్పందించిన శ్రీలంక కోర్టు బోర్డుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే రద్దును ఉపసహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అయినా శ్రీలంక పార్లమెంట్ కోర్టు ఆదేశాలను ధిక్కరించి ఆ దేశ క్రికెట్ పాలకమండలిని తొలగించాలని తీర్మానించింది. ఈ తతంగం జరిగిన మరుసటి రోజే ఐసీసీ శ్రీలంక బోర్డు సభ్యత్వాన్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.