World Cup Final: ప్రపంచకప్ ముగింపు వేడుకల్లో భారత వైమానిక దళం ప్రత్యేక ప్రదర్శన
ABN , First Publish Date - 2023-11-18T14:24:13+05:30 IST
భారత్, ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం ఈ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీలో సమవుజ్జీలైన భారత్, ఆస్ట్రేలియా మధ్య పోరు కావడంతో మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఐసీసీ ముగింపు వేడుకలను నిర్వహించనుంది.
అహ్మదాబాద్: భారత్, ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం ఈ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీలో సమవుజ్జీలైన భారత్, ఆస్ట్రేలియా మధ్య పోరు కావడంతో మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఐసీసీ ముగింపు వేడుకలను నిర్వహించనుంది. టోర్నీ ఆరంభానికి ముందు ఆరంభ వేడుకలు నిర్వహించకపోయినప్పటికీ ముగింపు వేడుకలు నిర్వహించడానికి బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకల్లో భారత వైమానిక దళం విన్యాసాలు చేపట్టనుండడం గమనార్హం. మ్యాచ్ ప్రారంభానికి ముందు 10 నిమిషాలపాటు భారత వైమానిక దళం ఎయిర్ షోను నిర్వహించనుంది. 9 ఎయిర్ క్రాఫ్ట్‌ల బృందం గల సూర్యకిరణ్ ఏక్రోబాటిక్ టీమ్ ఈ వేడుకల్లో పాల్గొననుంది. మ్యాచ్ ప్రారంభానికి 10 నిమిషాల ముందే ఈ ఎయిర్ షో కార్యక్రమం ఉండనుంది. అయితే ఈ ఎయిర్‌షో కోసం బీసీసీఐ ఎటువంటి రుసుము కట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒక ముసాయిదా లేఖను రక్షణ మంత్రిత్వ శాఖకు సమర్పించాలి. ఎయిర్ షోలో పాల్గొనే విమానాలు అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ కానున్నాయి.
అంతకన్నా ముందు ఇప్పటివరకు జరిగిన వన్డే ప్రపంచకప్‌లు గెలిచిన కెప్టెన్లందరినీ ఘనంగా సన్మానించనున్నారు. ఇందుకోసం ఆయా కెప్టెన్లంతా ఫైనల్ మ్యాచ్ జరిగే నరేంద్ర మోదీ స్టేడియానికి రానున్నారు. వారందరినీ ఐసీసీ ఘనంగా సన్నానించనుంది. ఈ కార్యక్రమం సాయంత్ర 5:30 గంటలకు 15 నిమిషాలపాటు జరగనుంది. అనంతరం కెప్టెన్లంతా తమ ప్రపంచకప్ విజయాన్ని ఉద్దేశించి మాట్లాడనున్నారు. కాగా ఇప్పటివరకు 9 మంది కెప్టెన్లు ప్రపంచకప్ గెలిచారు. ముగింపు వేడుకల్లో భాగంగా దేశంలోనే నంబర్ వన్ సంగీత దర్శకుడైన ప్రీతమ్ ప్రదర్శన ఇవ్వనున్నారు. ఆయనతోపాటు అనేకమంది సింగర్లు సంగీతాన్ని అలపించనున్నారు. ప్రీతమ్, జోనితా గాంధీ, అమిత్ మిశ్రా, నకాష్ అజీజ్, తుషార్ జోషి వంటి ప్రముఖ సింగర్లు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 500కు పైగా డ్యాన్సర్లు ప్రదర్శన ఇవ్వనున్నారు. వీరి ప్రదర్శన మొదటి ఇన్నింగ్స్ ముగిశాక ఉంటుంది. 90 సెకన్లపాటు లైట్ల షో, లేజర్ షో ఉండనుంది. అలాగే మొదటి ఇన్నింగ్స్ డ్రింక్స్ బ్రేక్ సమయంలో, సెకండ్ ఇన్నింగ్స్ డ్రింక్స్ సమయంలోనూ పలువురు సెలబ్రెటీలు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. మ్యాచ్ ముగిశాక గెలిచిన జట్లు వేడుకల్లో భాగంగా భారీ స్థాయిలో బాణాసంచా, టపాసులు కాల్చనున్నారు.