Share News

IND vs SA: డివిల్లియర్స్ ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన రోహిత్ శర్మ.. మరొక సిక్సు కొడితే..

ABN , First Publish Date - 2023-11-06T10:54:44+05:30 IST

సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొడుతున్నాడు. ఆరంభం నుంచే టీ20 స్టైలులో దూకుడుగా ఆడుతున్న రోహిత్ శర్మ జట్టుకు మెరుపు ఆరంభాలను అందిస్తున్నాడు.

IND vs SA: డివిల్లియర్స్ ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన రోహిత్ శర్మ.. మరొక సిక్సు కొడితే..

కోల్‌కతా: సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొడుతున్నాడు. ఆరంభం నుంచే టీ20 స్టైలులో దూకుడుగా ఆడుతున్న రోహిత్ శర్మ జట్టుకు మెరుపు ఆరంభాలను అందిస్తున్నాడు. పవర్‌ప్లేలోనే పరుగుల వరద పారిస్తున్నాడు. దీంతో క్రీజులో ఉన్నది కాసేపైన టీమిండియా భారీ స్కోర్ సాధించేందుకు బలమైన పునాది వేస్తున్నాడు. సెకండ్ బ్యాటింగ్‌లో అయితే హిట్‌మ్యాన్ దూకుడుతో లక్ష్యం ఆరంభంలోనే కరిగిపోతుంది. ఆరంభంలో రోహిత్ శర్మ మెరుపు ఆరంభం ఇవ్వడంతో ఆ తర్వాతి బ్యాటర్లకు బ్యాటింగ్ చేయడం సునాయసం అయిపోతుంది. ఇక క్రీజులో కాస్త ఎక్కవ సేపు ఉన్నాడంటే ప్రత్యర్థులు గెలుపుపై ఆశలు వదులుకోవాల్సి వస్తుంది. ఇటు బ్యాటర్‌గా అటు కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ జట్టును అన్ని విధాల ముందుండి నడిపిస్తున్నాడు. ముఖ్యంగా సొంత రికార్డుల కోసం కాకుండా జట్టు కోసం ఆడుతున్నాడు. ఎలాంటి స్వార్థం లేని ఆట ఆడుతూ జట్టుకు అన్ని విధాల చెదోడు వాదోడుగా నిలుస్తున్నాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ పలు రికార్డులను నమోదు చేస్తున్నాడు.


ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనూ రోహిత్ శర్మ క్రీజులో ఉన్నది కాసేపే అయినప్పటికీ సఫారీలకు చుక్కలు చూపించాడు. మొదటి నుంచే దూకుడుగా ఆడిన రోహిత్ శర్మ 6 ఫోర్లు, 2 సిక్సులతో 24 బంతుల్లోనే 40 పరుగులు బాదేశాడు. రోహిత్ శర్మ దూకుడు దెబ్బకు జట్టు స్కోర్ 6 ఓవర్లలోనే 60 పరుగులు దాటింది. రోహిత్ శర్మ ఇచ్చిన ఈ మెరుపు ఆరంభం ఎంత విలువైనదో తర్వాత కానీ అర్థం కాలేదు. స్పిన్నర్లు ఎంట్రీ ఇచ్చాక విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్‌కు పరుగులు చేయడం చాలా కష్టమైంది. దీంతో కాసేపు మన స్కోర్ బోర్డు నెమ్మదిగా కదిలింది. కానీ రోహిత్ శర్మ దెబ్బకు పవర్‌ప్లేలోనే మనకు 90కి పైగా పరుగులు రావడంతో మధ్యలో పరుగులు రావడం కాస్త మందగించిన ఆ ప్రభావం స్కోర్ బోర్డుపై పడలేదు. ఇక ఈ మ్యాచ్‌లో కొట్టిన రెండు సిక్సుల ద్వారా దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు ఏబీ డివిల్లియర్స్ ఆల్‌టైమ్ రికార్డును రోహిత్ శర్మ సమం చేశాడు. వన్డే ఫార్మాట్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్‌గా డివిల్లియర్స్‌తో కలిసి హిట్‌మ్యాన్ మొదటి స్థానంలో ఉన్నాడు. వీరిద్దరు ఒక వన్డే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధికంగా 58 సిక్సుల చొప్పున కొట్టారు. డివిల్లియర్స్ 2015లో 58 సిక్సులు కొడితే.. రోహిత్ శర్మ 2023లో 58 సిక్సులు కొట్టాడు. రోహిత్ శర్మ మరొక సిక్సు కొడితే డివిలియర్స్ రికార్డును బ్రేక్ చేస్తాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ఈ వరల్డ్ కప్‌లో టీమిండియా కచ్చితంగా మరో 2 మ్యాచ్‌లు ఆడనుంది. దీంతో ఈ ప్రపంచకప్‌లోనే రోహిత్ శర్మను ఈ రికార్డును అందుకునే అవకాశాలున్నాయి. రోహిత్, డివిల్లియర్స్ తర్వాత 2019లో 56 సిక్సులు కొట్టిన క్రిస్ గేల్ మూడో స్థానంలో, 2002లో 48 సిక్సులు కొట్టిన షాహిదీ ఆఫ్రిదీ నాలుగో స్థానంలో, 2023లో 47 సిక్సులు కొట్టిన మహమ్మద్ వసీమ్ ఐదో స్థానంలో ఉన్నారు.

ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే దక్షిణాఫ్రికాతో పోరులో టీమిండియాదే గెలుపు అనుకున్నారు కానీ.. ప్రత్యర్థి మరీ ఇంత దారుణంగా ఆడుతుందని ఎవరూ భావించలేదు. తొలుత బ్యాటింగ్‌లో ఆపై బౌలింగ్‌లో టీమిండియా అదిరే ప్రదర్శన చేయడంతో సఫారీలతో మ్యాచ్‌ పూర్తిగా ఏకపక్షమైంది. ఛేదనలో తమ బలహీనతను పునరావృతం చేస్తూ 243 పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకున్నారు. ఆదివారంనాటి మ్యాచ్‌లో తొలుత భారత్‌ 50 ఓవర్లలో 5 వికెట్లకు 326 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లీ (121 బంతుల్లో 10 ఫోర్లతో 101 నాటౌట్‌) శతక్కొట్టగా, శ్రేయాస్‌ (87 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 77) హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. రోహిత్‌ శర్మ (24 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40) ధనాధన్‌ ఆరంభం ఇవ్వగా, జడేజా (15 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 29 నాటౌట్‌), సూర్యకుమార్‌ (14 బంతుల్లో 5 ఫోర్లతో 22) విజృంభించారు. అనంతరం దక్షిణాఫ్రికా 27.1 ఓవర్లలో 83 పరుగులకే కుప్పకూలింది. జాన్సెన్‌ (14) టాప్‌ స్కోరర్‌. డ్యూసెన్‌, బవుమా, మిల్లర్‌ మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. జడేజా (5/33) ఐదు వికెట్లతో వణికించగా, కుల్దీప్‌ (2/7), షమి (2/18) చెరో రెండు వికెట్లతో ప్రత్యర్థి పనిబట్టారు. కోహ్లీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.

Updated Date - 2023-11-06T10:54:46+05:30 IST