Team India: ఎవడ్రా మిమ్మల్ని ఆపేది? రోహిత్-కోహ్లీ కౌగిలింతలపై ఆసక్తికర చర్చ
ABN , First Publish Date - 2023-09-13T19:21:28+05:30 IST
సూపర్-4లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య బంధం అందరినీ ఆకట్టుకుంది. ఈ మ్యాచ్‌లో వికెట్ తీసిన ప్రతీసారి రోహిత్, విరాట్ కోహ్లీ ఒకరినొకరు హత్తుకున్నారు.
ఆసియా కప్‌లో టీమిండియా దుమ్మురేపుతోంది. రోహిత్ శర్మ ఆధ్వర్యంలోని జట్టు ఇప్పటికే ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. సూపర్-4లో వరుసగా పాకిస్థాన్, శ్రీలంక లాంటి జట్లను మట్టికరిపించడంతో భారత్ ఖాతాలో 4 పాయింట్లు చేరాయి. ఇతర మూడు జట్లలో ఒక జట్టుకు మాత్రమే 4 పాయింట్లు వచ్చే అవకాశం ఉంది. గురువారం జరిగే పాకిస్థాన్-శ్రీలంక మ్యాచ్ విజేత ఫైనల్లో టీమిండియాతో అమీతుమీ తేల్చుకోనుంది. అయితే మంగళవారం జరిగిన భారత్-శ్రీలంక మ్యాచ్ అభిమానులకు ఎంతో ఉత్కంఠ రేపింది. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య బంధం అందరినీ ఆకట్టుకుంది.
కొలంబో వేదికగా సాగిన భారత్-శ్రీలంక మ్యాచ్ క్రికెట్ అభిమానులకు మజా ఇచ్చింది. ఒక దశలో టీమిండియా ఓటమి దిశగా సాగింది. ధనుంజయ డిసిల్వ-వెల్లలాగే మధ్య భాగస్వామ్యం శ్రీలంకను విజయతీరాలకు చేర్చుతుందని ఆ జట్టు అభిమానులు భావించారు. కానీ జడేజా కీలక వికెట్ తీసి భారత్‌ను మళ్లీ పోటీలోకి తెచ్చాడు. అయితే ఈ మ్యాచ్‌లో వికెట్ తీసిన ప్రతీసారి రోహిత్, విరాట్ కోహ్లీ ఒకరినొకరు హత్తుకున్నారు. బౌలింగ్ మార్పులు, ఫీల్డింగ్ ఏర్పాట్లపై మైదానంలో వీళ్లిద్దరూ చర్చించుకుని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంతేకాకుండా కెప్టెన్ రోహిత్ శర్మకు విరాట్ కోహ్లీ అండగా నిలిచాడు. శ్రీలంక కెప్టెన్ షనక క్యాచ్‌ను స్లిప్‌లో రోహిత్ అందుకున్న సమయంలో కోహ్లీ అతడిని హత్తుకుని సంబరాలు చేసుకున్నాడు. ఈ సీన్ చూసిన రోహిత్ అభిమానులు, కోహ్లీ అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. వీళ్లిద్దరి బంధం చూసి కొందరు ఆశ్చర్యం కూడా వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Viral Video: ‘లుంగీ డ్యాన్స్’ పాటకు విరాట్ కోహ్లీ డ్యాన్స్ అదిరిపోయింది! మీరు ఓ లుక్కేయండి..
గతేడాది వరకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల మధ్య విబేధాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. మైదానంలో వారి ప్రవర్తన కూడా ఈ ప్రచారానికి బలం చేకూర్చింది. కానీ గత ఏడాది టీ20 ప్రపంచకప్ నుంచి వీళ్లిద్దరూ స్నేహంగా కనిపిస్తున్నారు. మైదానంలో కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు చర్చించుకుంటున్నారు. రోహిత్-కోహ్లీ స్నేహబంధంతో వన్డే ప్రపంచకప్ ముందు టీమిండియా కొత్తగా కనిపిస్తోంది. వీళ్లిద్దరి మైత్రిలో జట్టులో మంచి వాతావరణం తెచ్చిపెడుతుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అటు సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా వన్డే ప్రపంచకప్ సాధించడంలో రోహిత్, కోహ్లీ కీలక పాత్ర వహిస్తారని అభిమానులు అంచనాలు వేస్తున్నారు.