Share News

Rohit sharma: ఫ్యాన్స్ గుండె రాయి చేసుకోవాల్సిందేనా.. టీ20 వరల్డ్ ‌కప్‌లోనూ రోహిత్ శర్మ డౌటేనా?..

ABN , Publish Date - Dec 16 , 2023 | 12:13 PM

World cup: శుక్రవారం సాయంత్రం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానుల గుండె పగిలింది. ఇప్పటికే వరల్డ్ కప్ ఫైనల్‌లో ఓడిపోయామని పుట్టెడు దు:ఖంలో అభిమానుల గుండెల్లో ముంబై ఇండియన్స్ మరో పిడుగు వేసింది.

Rohit sharma: ఫ్యాన్స్ గుండె రాయి చేసుకోవాల్సిందేనా.. టీ20 వరల్డ్ ‌కప్‌లోనూ రోహిత్ శర్మ డౌటేనా?..

శుక్రవారం సాయంత్రం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానుల గుండె పగిలింది. ఇప్పటికే వరల్డ్ కప్ ఫైనల్‌లో ఓడిపోయామని పుట్టెడు దు:ఖంలో అభిమానుల గుండెల్లో ముంబై ఇండియన్స్ మరో పిడుగు వేసింది. రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించి అందరికీ బిగ్ షాక్ ఇచ్చింది. హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి రావడంతో కెప్టెన్సీ మార్పు ఉంటుందని ముందుగా ఊహించిందే. కానీ అది 2024 సీజన్‌లో ఉండకపోవచ్చని అంతా భావించారు. ఈ సారి కూడా రోహిత్ శర్మనే ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా కొనసాగుతాడని అనుకున్నారు. 2025 నుంచే హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు దక్కుతాయని అంచనా వేశారు. కానీ ముంబై ఆలోచన మాత్రం మరోలా ఉంది. ఇటు కెప్టెన్‌గా, అటు ఆటగాడిగా రోహిత్ శర్మ సూపర్ ఫామ్‌లో ఉన్నప్పటికీ ముంబై మేనేజ్‌మెంట్ అతడిని తొలగించింది. దీంతో ముంబై మేనేజ్‌మెంట్ తీరుపై అంతటా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


ఈ నేపథ్యంలో మరో 6 నెలల్లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ పరిస్థితి ఏంటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు రానున్న టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు కెప్టెన్‌గా ఎవరు ఉంటారనే అంశంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. రోహిత్ శర్మ టీ20 ప్రపంచకప్ ఆడతాడని జట్టును అతనే లీడ్ చేస్తాడని నిన్నమొన్నటి వరకు వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హిట్‌మ్యాన్‌ను తప్పించడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఆడే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఆడినా కెప్టెన్‌గా ఉండకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి 2022 టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్ తర్వాత పొట్టి ఫార్మాట్‌లో హిట్‌మ్యాన్ ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. సౌతాఫ్రికా పర్యటనలో ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌లో కూడా రోహిత్ ఆడలేదు. టీ20 ప్రపంచకప్‌నకు ముందు భారత జట్టు మరొక టీ20 సిరీస్ మాత్రమే ఆడనుంది. అది కూడా పసికూన అఫ్ఘానిస్థాన్‌తో కావడం గమనార్హం. దీంతో ఆ సిరీస్‌లోనూ రోహిత్ ఆడేది అనుమానమే. టీ20 వరల్డ్ కప్ ఆడాలంటే అంతకుముందు టీ20 మ్యాచ్‌లు ఆడి ఉండాలి. కానీ ఐపీఎల్ మినహా అంతర్జాతీయ క్రికెట్‌లో దాదాపు రెండేళ్లుగా రోహిత్ శర్మ టీ20లు ఆడలేదు. నేరుగా టీ20 ప్రపంచకప్‌లో ఆడించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. దీంతో ఈ లెక్కన చూసుకుంటే రోహిత్ శర్మ టీ20 ప్రపంచకప్‌లో ఆడే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. రోహిత్ శర్మ ఆడకపోతే విరాట్ కోహ్లీ కూడా ఆడడనే అభిప్రాయాలున్నాయి. దీంతో అభిమానులు గుండె రాయి చేసుకోక తప్పేలా లేదు. దీనికి తోడు కెప్టెన్‌గా వరల్డ్ కప్ విజయం లేకుండానే రోహిత్ శర్మ కెరీర్ ముగిసిపోతుందనే నిజాన్ని జీర్ణించుకోవడం కూడా అభిమానులకు కష్టంగానే ఉంటుంది.

Updated Date - Dec 16 , 2023 | 12:13 PM