World Cup: చరిత్రకు 14 పరుగుల దూరంలో శుభ్‌మన్ గిల్.. అదే జరిగితే ఆ దిగ్గజ క్రికెటర్ ప్రపంచ రికార్డు బద్దలు
ABN , First Publish Date - 2023-10-22T10:42:24+05:30 IST
వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా మరో పోరుకు సిద్దమైంది. వరుసగా నాలుగు విజయాలతో జోరు మీదున్న రోహిత్ సేన ఐదో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఢీకొట్టబోతుంది. భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే ఈ మ్యాచ్ ధర్మశాల వేదికగా ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభంకానుంది.
ధర్మశాల: వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా మరో పోరుకు సిద్దమైంది. వరుసగా నాలుగు విజయాలతో జోరు మీదున్న రోహిత్ సేన ఐదో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఢీకొట్టబోతుంది. భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే ఈ మ్యాచ్ ధర్మశాల వేదికగా ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభంకానుంది. అటు న్యూజిలాండ్ కూడా వరుసగా నాలుగు విజయాలతో ఊపు మీదుంది. ఇప్పటివరకు టోర్నీలో అపజయం ఎరుగని జట్లు ఈ రెండే కావడం గమనార్హం. దీంతో ఈ మ్యాచ్‌పై విపరీతమైన ఆసక్తి నెలకొంది. కాగా నేడు జరిగే మ్యాచ్‌లో ఏదో ఒక జట్టు ఓడిపోనుంది. అలాగే గెలిచిన జట్టే పాయింట్ల టేబుల్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోనుంది. ప్రస్తుతం రెండు జట్ల ఖాతాలో ఎనిమిదేసి పాయింట్ల చొప్పున ఉన్నప్పటికీ భారత్ కంటే మెరుగైన రన్ రేటు ఉన్న కారణంగా కివీస్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ప్రపంచ రికార్డును బద్దలుకొట్టే అవకాశాలున్నాయి. అందుకు గిల్ 14 పరుగులు చేస్తే సరిపోతుంది.
వన్డే ఫార్మాట్లో ఇప్పటివరకు 37 మ్యాచ్‌లు ఆడిన శుభ్‌మన్ గిల్ 64 సగటుతో 1,986 పరుగులు చేశాడు. మరొక 14 పరుగులు చేస్తే 2 వేల పరుగులు పూర్తి చేసుకుంటాడు. అయితే ఆ 14 పరుగులను మరొక రెండు ఇన్నింగ్స్‌ల్లోనే సాధిస్తే వన్డే ఫార్మాట్‌లో వేగంగా 2 వేల పరుగులు సాధించిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు హషీమ్ ఆమ్లా ప్రపంచ రికార్డును గిల్ బద్దలుకొడతాడు. ప్రస్తుతం అత్యంగ వేగంగా 2 వేల పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో ఆమ్లా మొదటి స్థానంలో ఉన్నాడు. 40 ఇన్నింగ్స్‌ల్లోనే 2 వేల పరుగులు చేసిన ఆమ్లా వేగంగా ఈ మార్కు అందుకున్న బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు 37 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన గిల్ మరొక రెండు ఇన్నింగ్స్‌ల్లో 14 పరుగులు చేస్తే ఆమ్లా ప్రపంచ రికార్డును బద్దలుకొడతాడు. అయితే ఆ 14 పరుగులను గిల్ నేడు న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లోనే సాధించే అవకాశాలున్నాయి. అదే జరిగితే నేటి మ్యాచ్‌లోనే గిల్ ఈ ప్రపంచ రికార్డు నెలకొల్పుతాడు. కాగా తన కెరీర్లో 19 వన్డే ఇన్నింగ్స్‌ల్లోనే 1,000 పరుగులు పూర్తి చేసిన గిల్.. అత్యంత వేగంగా ఈ మార్కు అందుకున్న రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఇక ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న గిల్ ఇప్పటికే ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటివరకు 22 వన్డే మ్యాచ్‌లాడిన గిల్ 1,299 పరుగులు చేశాడు. ఇక ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లాడిన గిల్ 69 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించాడు.