Virat Kohli Viral Video: అవుట్ కాకున్నా అవుటిచ్చిన అంపైర్.. రిప్లే చూశాక కోహ్లీ రియాక్షన్ ఇదీ!
ABN , First Publish Date - 2023-02-18T19:35:42+05:30 IST
ఈ క్రమంలో బంతి ప్యాడ్‌ను తాకడంతో అవుట్ అంటూ ఆసీస్ ఆటగాళ్లు అప్పీల్ చేశారు. దీంతో అంపైర్ వెంటనే వేలు పైకెత్తాడు.
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా(Australia)తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా(Team India) మాజీ స్కిప్పర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) అవుట్ కావడం కాక రేపింది. మాథ్యూ కునేమన్(Matthew Kuhnemann ) వేసిన బంతిని డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బంతి ప్యాడ్‌ను తాకడంతో అవుట్ అంటూ ఆసీస్ ఆటగాళ్లు అప్పీల్ చేశారు. దీంతో అంపైర్ వెంటనే వేలు పైకెత్తాడు. అయితే, బంతి ప్యాడ్‌ను తాకడానికి ముందు బ్యాట్‌కు తాకడంతో కోహ్లీ రివ్యూకు వెళ్లాడు. రివ్యూ బౌలర్‌కే అనుకూలంగా వచ్చింది. రిప్లేలో మాత్రం బంతి తొలుత బ్యాట్‌ను తాకి ఆపై ప్యాడ్స్‌ను తాకినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అయినప్పటికీ నిర్ణయం బౌలర్‌కే అనుకూలంగా రావడంతో కోహ్లీ నిరాశగా వెనుదిరిగాడు.
కోహ్లీ అవుట్‌పై మాజీ క్రికెటర్లు, అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అది అవుట్ కాదని కచ్చితంగా చెబుతున్నారు. అది తప్పుడు నిర్ణయమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ భారాన్ని తన భుజాలపై వేసుకుని చక్కని ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో కోహ్లీ వెనుదిగడంతో ఆసీస్ ప్లేయర్లు సంబరాలు చేసుకున్నారు.
అవుటయ్యాక పెవిలియన్‌కి చేరిన కోహ్లీ డగౌట్‌లో కూర్చుని తన అవుట్‌కి సంబంధించి డీఆర్ఎస్(DRS) వీడియోను వీక్షించాడు. అందులో బంతి బ్యాట్‌ను తాకినట్టు ఉండడంతో అంపైర్ షాకింగ్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. అంతేకాదు.. రివ్యూ చూశాక ల్యాప్‌టాప్‌పై చేయి చూపిస్తూ.. ‘చూశావా అది అవుట్ కాదు’ అని చెబుతూ అక్కడి నుంచి కోపంగా లోపలికి వెళ్లిపోయాడు.
కాగా, భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 262 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ కుప్పకూలకుండా అడ్డుకోవడంలో కోహ్లీ (44), అక్షర్ పటేల్ (74), అశ్విన్ (37) కీలక పాత్ర పోషించారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కంగారూ జట్టు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది.