ODI WorldCup: వివియన్ రిచర్డ్స్ జోస్యం.. వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్లు తీసేది ఆ పాకిస్థాన్ బౌలరే..!!

ABN , First Publish Date - 2023-08-29T18:26:16+05:30 IST

వెస్టిండీస్ మాజీ ఆటగాడు, ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు వివియన్ రిచర్డ్స్ వచ్చే వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసే బౌలర్‌పై తన అంచనాను పంచుకున్నాడు. భారత్ వేదికగా జరిగే ఈ మెగా టోర్నీలో అత్యధిక వికెట్లు తీసే బౌలర్ పాకిస్థాన్ ఆటగాడు షాహిన్ షా అఫ్రిది అని ప్రకటించాడు.

ODI WorldCup: వివియన్ రిచర్డ్స్ జోస్యం.. వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్లు తీసేది ఆ పాకిస్థాన్ బౌలరే..!!

2011 తర్వాత భారత్ గడ్డపై మరోసారి వన్డే ప్రపంచకప్ జరగబోతోంది. అక్టోబర్ 5 నుంచి ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. అయితే ఇప్పటివరకు వన్డే ప్రపంచకప్ గెలవని దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు ఎలాగైనా విజేతగా నిలవాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఇప్పటి నుంచే పలు జట్లు వన్డే ప్రపంచకప్ కోసం సన్నద్ధం అవుతున్నాయి. గత ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ ఫైనల్ చేరగా రెండు సార్లు మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో బౌండరీల లెక్క ప్రకారం ఇంగ్లండ్‌ను విశ్వవిజేతగా నిర్వాహకులు ప్రకటించారు.

కాగా రాబోయే వన్డే ప్రపంచకప్ కోసం కొన్ని దేశాలు ఇప్పటికే ప్రపంచకప్ జట్లపై ఓ అంచనాకు వచ్చేశాయి. ఈ నేపథ్యంలో అత్యుత్తమ జట్లు, ఆటగాళ్ల ప్రదర్శనను క్రికెట్ నిపుణులు ఇప్పటి నుంచే అంచనా వేస్తున్నారు. వెస్టిండీస్ మాజీ ఆటగాడు, ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు వివియన్ రిచర్డ్స్ కూడా తన అభిప్రాయాన్ని ఓ ఛానల్ ద్వారా పంచుకున్నాడు. వచ్చే వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసే బౌలర్ పాకిస్థాన్ ఆటగాడు షాహిన్ షా అఫ్రిది అని ప్రకటించాడు. ఇటీవల పాకిస్థాన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అతడితో కొంత సమయం గడిపినట్లు రిచర్డ్స్ తెలిపాడు. ప్రస్తుతం షాహిన్ షా అఫ్రిది ఎంతో రాటుదేలాడని.. అతడికి ఆట పట్ల ఎంతో అంకితభావం ఉందని పేర్కొన్నాడు. షాహిన్‌ షా అఫ్రిది ఇప్పటివరకు 27 టెస్టుల్లో 105 వికెట్లు, 39 వన్డేల్లో 76 వికెట్లు, 52 అంతర్జాతీయ టీ20ల్లో 64 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల అఫ్గానిస్థాన్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో అత్యధిక వికెట్లు (6) పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు.

ఇది కూడా చదవండి: Cricket: క్రికెట్‌లో రెడ్ కార్డ్ రూల్ అమలు.. పెవిలియన్ చేరిన తొలి క్రికెటర్ ఎవరంటే..?

మరోవైపు వచ్చే వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసే బ్యాటర్‌గా ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జాస్ బట్లర్ నిలుస్తాడని దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, ఆల్‌రౌండర్ జాక్ కలిస్ అభిప్రాయపడ్డాడు. ఐసీసీ టోర్నీలలో బట్లర్ ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడుతున్నాడని.. అంతేకాకుండా భారత్‌లోని పిచ్‌లు ఎలా స్పందిస్తాయో అతడికి మంచి అవగాహన ఉంని కలిస్ పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో ఆడిన అనుభవం అతడికి ఉందని.. దీంతో జాతీయ జట్టు తరఫున మంచి ప్రదర్శన చేసే అవకాశం ఉందన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో జాస్ బట్లర్ 165 వన్డేల్లో 41.49 సగటుతో 4,647 పరుగులు చేశాడు.

Updated Date - 2023-08-29T18:26:16+05:30 IST