Share News

IND vs ENG: భారత్, ఇంగ్లండ్ గత హెడ్ టూ హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయంటే..?

ABN , First Publish Date - 2023-10-29T12:28:17+05:30 IST

వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా మరో కీలక పోరుకు సిద్ధమైంది. వరుసగా 5 విజయాలతో జోరు మీదున్న రోహిత్ సేన ఆదివారం డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో తలపడనుంది. లక్నోలోని ఏఖనా స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.

IND vs ENG: భారత్, ఇంగ్లండ్ గత హెడ్ టూ హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయంటే..?

లక్నో: వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా మరో కీలక పోరుకు సిద్ధమైంది. వరుసగా 5 విజయాలతో జోరు మీదున్న రోహిత్ సేన ఆదివారం డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో తలపడనుంది. లక్నోలోని ఏఖనా స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా ఓడిపోని భారత జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మరోవైపు ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒకే ఒక మ్యాచ్ గెలిచిన ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో ఏకంగా చిట్ట చివరన 10వ స్థానంలో ఉంది. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నప్పటికీ ఇంగ్లీష్ జట్టును ఏ మాత్రం తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. మ్యాచ్ విన్నర్లతో కూడి ఉన్న ఇంగ్లండ్ ఏ క్షణంలోనైనా ఫామ్‌లోకి వచ్చే అవకాశాలుంటాయి. దీంతో ఇంగ్లండ్‌ను ఏ మాత్రం తేలికగా తీసుకోకుండా భారత్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు.


రెండు జట్ల మధ్య గత హెడ్ టూ హెడ్ రికార్డుల విషయానికొస్తే భారత్, ఇంగ్లండ్ వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు 8 సార్లు తలపడ్డాయి. ఈ పోటీలో ఇంగ్లండ్‌దే కాస్త పై చేయిగా ఉంది. ఇంగ్లీష్ జట్టు 4 సార్లు గెలవగా.. భారత్ 3 సార్లు గెలిచింది. రెండు జట్ల మధ్య భారత్ వేదికగా 2011 ప్రపంచకప్‌లో జరిగిన మ్యాచ్ టైగా ముగిసంది. రెండు జట్ల మధ్య పోటీలో ఇరు జట్లది అత్యధిక స్కోర్ 338 కావడం గమనార్హం. 2011లో టైగా ముగిసిన మ్యాచ్‌లో రెండు జట్లు ఈ స్కోర్ సాధించాయి. అయితే రెండు జట్ల మధ్య గత ప్రపంచకప్‌లో జరిగిన పోటీలో టీమిండియా 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. మొత్తంగా రెండు జట్లు వన్డే ఫార్మాట్లో ఇప్పటివరకు 106 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో టీమిండియా అధిపత్యం చెలాయించింది. భారత జట్టు అత్యధికంగా 57 మ్యాచ్‌ల్లో గెలవగా.. ఇంగ్లండ్ 44 మ్యాచ్‌ల్లో గెలిచింది. రెండు మ్యాచ్‌లు టై కాగా.. 3 మ్యాచ్‌లు రద్దయ్యాయి.

Updated Date - 2023-10-29T12:28:17+05:30 IST