Share News

IND vs ENG: భారత్, ఇంగ్లండ్ మ్యాచ్ జరిగే లక్నో పిచ్, వెదర్ రిపోర్టు ఎలా ఉందంటే..?

ABN , First Publish Date - 2023-10-29T11:39:15+05:30 IST

సొంత గడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూకుడు మీదున్న టీమిండియా ఆదివారం మరో పోరుకు సిద్ధమైంది. ఆదివారం డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో రోహిత్ సేన తలపడనుంది.

IND vs ENG: భారత్, ఇంగ్లండ్ మ్యాచ్ జరిగే లక్నో పిచ్, వెదర్ రిపోర్టు ఎలా ఉందంటే..?

లక్నో: సొంత గడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూకుడు మీదున్న టీమిండియా ఆదివారం మరో పోరుకు సిద్ధమైంది. ఆదివారం డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో రోహిత్ సేన తలపడనుంది. ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఐదు మ్యాచ్‌లు గెలిచిన భారత జట్టు ఈ సారి కూడా తమ జైత్ర యాత్ర కొనసాగించాలని పట్టుదలగా ఉంది. టోర్నీలో ఇంగ్లండ్ ఇప్పటివరకు ఫేలవ ప్రదర్శన కనబర్చినప్పటికీ ఆ జట్టును ఏ మాత్రం తక్కువగా అంచనా వేయానికి వీల్లేదు. ప్రస్తుతం ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నప్పటికీ ఒంటి చేతితో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సమర్థులు ఆ జట్టులో చాలా మందే ఉన్నారు. దీంతో భారత్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ మ్యాచ్‌ లక్నోలోని ఏకనా స్టేడియం వేదికగా జరగనుంది.


ఇక ఏకనా స్టేడియం పిచ్ రిపోర్టు విషయానికొస్తే.. ఇక్కడ బ్యాటర్లు సత్తా చాటగలరు. భారీ స్కోర్లు నమెదు కాకపోయినా మంచి స్కోర్లే వస్తుంటాయి. అయితే ఈ పిచ్‌పై బంతి నిదానంగా వస్తుంది. దీంతో ప్రధానంగా స్పిన్నర్లకు సహకరిస్తుంటుంది. ఆరంభంలో పేసర్లు కూడా ప్రభావం చూపుతారు. మ్యాచ్ సాగే కొద్ది స్పిన్నర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే బ్యాటర్లు క్రీజులో కుదురుకుంటే పరుగులు చేయగడం పెద్దగా కష్టం కాకపోవచ్చు. ఏకనా స్టేడియం పిచ్‌పై మొదటి ఆరు ఇన్నింగ్స్‌ల్లో సగటు స్కోర్ 226గా ఉంది. ఈ పిచ్ ఇప్పటివరకు 12 వన్డేలకు అతిథ్యం ఇచ్చింది. అందులో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు మూడు సార్లు, సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు 9 సార్లు గెలిచాయి. మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోర్ 229గా ఉండగా.. సెకండ్ ఇన్నింగ్స్ సగటు స్కోర్ 213గా ఉంది. ఈ వరల్డ్ కప్‌లో ఇక్కడ ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు జరిగాయి. మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై సౌతాఫ్రికా 311 పరుగులు చేసింది. ఇప్పటివరకు ఈ పిచ్‌పై ఇదే అత్యధిక స్కోర్‌గా ఉంది. ఈ మ్యాచ్‌లో విజయం కూడా సౌతాఫ్రికానే వరించింది. రెండో మ్యాచ్‌లో శ్రీలంకపై ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో గెలిచింది. మూడో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై శ్రీలంక 5 వికెట్ల తేడాతో గెలిచింది.

ఇక వెదర్ రిపోర్టు విషయానికొస్తే.. మ్యాచ్ జరిగే మధ్యాహ్నం సమయంలో పొగమంచు వాతావరణం ఉండే అవకాశం ఉంది. అయితే మ్యాచ్‌కు వర్షం నుంచి ఎలాంటి ముప్పు లేదు. దీంతో పూర్తి ఆట జరగనుంది. వాతావరణంలో తేమ 30 శాతం ఉండనుంది. 13 శాతం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రత 18 నుంచి 31 డిగ్రీల సెల్సియస్‌గా ఉండనుంది.

Updated Date - 2023-10-29T11:39:15+05:30 IST