World Cup: సెమీస్‌కు చేరువలో ఉన్న జట్లు ఇవే.. ఈ టీంలు ఇక ఇంటికే.. నాకౌట్ రేసుపై సమగ్ర విశ్లేషణ ఇదిగో!
ABN , First Publish Date - 2023-10-30T13:45:59+05:30 IST
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ రసవత్తరంగా సాగుతోంది. చిన్న జట్లు పెద్ద జట్లను ఓడిస్తుండడం.. పెద్ద జట్లు చిన్న జట్ల చేతిలో చిత్తవుతుండడంతో ఈ ప్రపంచకప్ సంచలనాలకు అడ్డాగా మారిపోయింది.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ రసవత్తరంగా సాగుతోంది. చిన్న జట్లు పెద్ద జట్లను ఓడిస్తుండడం.. పెద్ద జట్లు చిన్న జట్ల చేతిలో చిత్తవుతుండడంతో ఈ ప్రపంచకప్ సంచలనాలకు అడ్డాగా మారిపోయింది. గత టోర్నీల్లోనూ పెద్ద జట్లను చిన్న జట్లు ఓడించాయి. కానీ ఈ టోర్నీలో పెద్ద జట్లపై చిన్న జట్లు గెలిచినన్నీ సార్లు మరే ప్రపంచకప్‌లోనూ గెలవలేదు. టోర్నీలోకి పసికూనలుగా అడుగుపెట్టిన అఫ్ఘానిస్థాన్, నెదర్లాండ్స్ వంటి జట్లు ఇంగ్లండ్, సౌతాఫ్రికా, పాకిస్థాన్ వంటి పెద్ద జట్లపై గెలిచాయి. దీంతో సెమీస్ రేసు కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ప్రపంచకప్‌లో చాలా మ్యాచ్‌లు ముగిసినప్పటికీ ఏ జట్టుకు కూడా ఇప్పటివరకు నాకౌట్ బెర్త్ ఖరారు కాలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పాయింట్ల టేబుల్ ఎలా ఉంది? ఆయా జట్లకు నాకౌట్ అవకాశాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం.
ఈ జట్లు నాకౌట్ చేరినట్టేనా..?
లీగ్ దశ మొత్తంగా ముగిశాక పాయింట్ల పట్టికలో టాప్ 4లో నిలిచిన జట్లు సెమీస్ చేరతాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా టాప్ 4లో ఉన్నాయి. ఈ 4 జట్లు కూడా ఆరేసి మ్యాచ్‌ల చొప్పున ఆడాయి. మరో మూడేసి మ్యాచ్‌ల చొప్పున ఆడాల్సి ఉంది. ఆరింటికి ఆరు మ్యాచ్‌ల్లో గెలిచిన భారత్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం మొదటి స్థానంలో ఉంది. జట్టు ఖాతాలో 12 పాయింట్లు ఉండగా.. నెట్‌రన్‌రేటు కూడా +1.405గా ఉంది. దీంతో భారత్ సెమీస్ బెర్త్‌కు చేరువలో ఉంది. టీమిండియా తన తర్వాతి మూడు మ్యాచ్‌ల్లో శ్రీలంక, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఈ మూడింటిలో కనీసం ఒకటి గెలిచినా టీమిండియా సెమీస్ బెర్త్ అధికారికంగా ఖరారు అవుతుంది. ఒకవేళ ఆ మూడు మ్యాచ్‌ల్లో ఓడినా భారత్ సెమీఫైనల్ చేరే అవకాశాలున్నాయి. ఇక రెండో స్థానంలో ఉన్న సౌతాఫ్రికా 5 విజయాలు సాధించి 10 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. నెట్ రన్ రేటు కూడా +2.032గా ఉంది. సౌతాఫ్రికా తన తర్వాతి మూడు మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్, భారత్, అఫ్ఘానిస్థాన్‌తో తలపడనుంది. వీటిలో కనీసం ఒకటి లేదా రెండు మ్యాచ్‌లు గెలిచినా సౌతాఫ్రికాకు సెమీస్ బెర్త్ దక్కుతుంది. అలా కాకుండా మూడింటిలో ఓడితే సెమీస్ బెర్త్ కష్టమవుతుంది. ఇక మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు నాలుగేసి విజయాల చొప్పున సాధించాయి. ఆ జట్ల ఖాతాలో ఎనిమిదేసి పాయింట్ల చొప్పున ఉన్నాయి. కివీస్ రన్ రేటు +1.232గా ఉండగా.. ఆసీస్ రన్ రేటు +0.970గా ఉంది. ఈ రెండు జట్లకు సెమీస్ బెర్త్ ఖరారు కావాలంటే తమ తర్వాతి మూడు మ్యాచ్‌ల్లో కనీసం రెండు మ్యాచ్‌ల చొప్పున గెలవాల్సి ఉంటుంది. ఒక్కొ మ్యాచ్ చొప్పున గెలిస్తే నాకౌట్ బెర్త్ కష్టమవుతుంది. పైగా ఇతర జట్ల మ్యాచ్‌ల ఫలితాలపై అధారపడాల్సి వస్తుంది. మూడేసి మ్యాచ్‌లు గెలిస్తే సెమీస్ బెర్త్ ఖరారు అవుతుంది. ఒక వేళ మిగతా మూడు మ్యాచ్‌ల్లో ఓడితే నాకౌట్ దారులు మూసుకుపోతాయి. కాగా న్యూజిలాండ్ తన తర్వాతి మూడు మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంకలతో తలపడనుంది. ఇక ఆస్ట్రేలియా తమ తర్వాతి మూడు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్, అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్‌తో తలపడనుంది.
వీరికి అవకాశం ఉందా..?
పాయింట్ల పట్టికలో ఐదు, ఆరు, ఏడు, ఎనిమిదో స్థానాల్లో ఉన్న శ్రీలంక, పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్, నెదర్లాండ్స్ జట్లు ఇప్పటివరకు రెండేసి మ్యాచ్‌ల చొప్పున మాత్రమే గెలిచాయి. వాటి ఖాతాలో నాలుగేసి పాయింట్ల చొప్పున ఉన్నాయి. ఈ నాలుగు జట్లకు కూడా సెమీస్ చేరేందుకు ఇంకా అవకాశాలున్నాయి. పైగా శ్రీలంక, అఫ్ఘానిస్థాన్ వంటి జట్లు ఇప్పటివరకు ఐదేసి మ్యాచ్‌ల చొప్పున మాత్రమే ఆడాయి. దీంతో వాటికి నాలుగేసి మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. అవి తమ తర్వాతి అన్ని మ్యాచ్‌ల్లో గెలిస్తే సెమీస్ చేరేందుకు మెరుగైనా అవకాశాలుంటాయి. మూడేసి మ్యాచ్‌ల చొప్పున గెలిచినా అవకాశాలుంటాయి. కాకపోతే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. శ్రీలంక తమ తర్వాతి నాలుగు మ్యాచ్‌ల్లో అప్ఘానిస్థాన్, భారత్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో తలపడనుంది. అప్ఘానిస్థాన్ తమ తర్వాతి మ్యాచ్‌ల్లో శ్రీలంక, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో తలపడనుంది.
ఇక ఆరు, ఎనిమిదో స్థానంలో ఉన్న పాకిస్థాన్, నెదర్లాండ్స్‌కు ఇంకా మూడేసి మ్యాచ్‌ల చొప్పున మిగిలి ఉన్నాయి. అయితే ఈ రెండు జట్లు కచ్చితంగా సెమీస్ చేరతాయని చెప్పలేం కానీ అవకాశాలున్నాయి. అది కూడా తమ తర్వాతి మూడు మ్యాచ్‌ల్లో గెలిస్తేనే. అంతకన్నా తక్కువ మ్యాచ్‌ల్లో గెలిస్తే సెమీస్ బెర్త్‌పై ఆశలు వదులుకోవాల్సిందే. కాగా పాకిస్థాన్ తమ తర్వాతి మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లతో తలపడనుంది. ఇక నెదర్లాండ్స్ తమ తర్వాతి మ్యాచ్‌ల్లో అఫ్ఘానిస్థాన్, ఇంగ్లండ్, ఇండియాలతో తలపడనుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటేంట శ్రీలంక, పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్, నెదర్లాండ్స్ నెట్ రన్ రేటు కూడా మైనస్‌ల్లో ఉంది. దీంతో ఆ జట్లు సెమీస్ చేరాలంటే మిగతా అన్ని మ్యాచ్‌ల్లో గెలవడంతోపాటు రన్ రేటును కూడా మెరుగుపరచుకోవాలి. పైగా ప్రస్తుతం టాప్ 4లో ఉన్న నాలుగు జట్ల రన్ రేటు కూడా ప్లస్‌ల్లో ఉంది.
వీళ్లు ఇంటికే..
ఇక ప్రస్తుతం 9, 10వ స్థానంలో ఉన్న బంగ్లాదేశ్, ఇంగ్లండ్ జట్లు ఆరేసి మ్యాచ్‌ల చొప్పున ఆడి ఒక్కొ మ్యాచ్ మాత్రమే గెలిచాయి. ఈ రెండు జట్లు మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచిన సెమీస్ చేరే అవకాశాలు లేవు. ఎందుకంటే మిగిలిన 3 మ్యాచ్‌ల్లో గెలిచినా 4 విజయాలు మాత్రమే అవుతాయి. పైగా రన్ రేటు కూడా మైనస్‌ల్లో ఉంది. దీంతో అనధికారికంగా బంగ్లాదేశ్, ఇంగ్లండ్ సెమీస్ రేసు నుంచి తప్పుకున్నట్టే. ఏదో ఒకటి ఊహించడానికి సాధ్యం కానీ మహాద్భుతం జరిగితే తప్పే సెమీస్ చేరే అవకాశాలు లేవు. అది ఎలా అంటే పాయింట్ల పట్టికలో 3, 4వ స్థానంలో ఉన్న న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు తమ తర్వాతి అన్ని మ్యాచ్‌ల్లో ఓడాల్సి ఉంటుంది. ఐదు నుంచి 8వ స్థానం వరకు ఉన్న జట్లు కూడా చాలా మ్యాచ్‌లు ఓడాల్సి ఉంటుంది. అలాగే బంగ్లాదేశ్, ఇంగ్లండ్ మెరుగైన రన్ రేటుతో మిగతా అన్ని మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుంది. కానీ ఇది జరగడం చాలా కష్టం కాబట్టి ఇంగ్లండ్, బంగ్లాదేశ్ ఇక ఇంటికి చేరినట్టేనని విశ్లేషకులు సైతం చెబుతున్నారు.