Share News

World Cup Final: ఫైనల్ పోరుకు ముందు భారత్, ఆస్ట్రేలియా బలాబలాలివే! గెలిచే సత్తా ఏ జట్టుకు ఉందంటే..?

ABN , First Publish Date - 2023-11-19T09:31:43+05:30 IST

మరికాసేపట్లో వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ప్రపంచకప్ ట్రోఫీ కోసం అతిథ్య భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్‌కు అతిథ్యం ఇవ్వనుంది.అసలు టేబుల్‌పై రెండు జట్ల బలబలాలు ఎలా ఉన్నాయి? బలహీనతలేంటి? ప్రపంచకప్ గెలిచే సత్తా ఉన్న జట్టు ఏదనే అంశాలని ఒకసారి పరిశీలిద్దాం.

World Cup Final: ఫైనల్ పోరుకు ముందు భారత్, ఆస్ట్రేలియా బలాబలాలివే! గెలిచే సత్తా ఏ జట్టుకు ఉందంటే..?

అహ్మదాబాద్: మరికాసేపట్లో వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ప్రపంచకప్ ట్రోఫీ కోసం అతిథ్య భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్‌కు అతిథ్యం ఇవ్వనుంది. లక్ష 30 వేల మంది ప్రేక్షకుల ముందు మ్యాచ్ జరగనుంది. రెండు జట్లు గెలుపుపై ధీమాగా ఉన్నాయి. ఈ ట్రోఫిని గెలిచి మూడోసారి ప్రపంచకప్‌ను ఖాతాలో వేసుకోవాలని టీమిండియా, ఈ విజయంతో ఆరో సారి కప్ గెలవాలని ఆస్ట్రేలియా జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు టేబుల్‌పై రెండు జట్ల బలబలాలు ఎలా ఉన్నాయి? బలహీనతలేంటి? ప్రపంచకప్ గెలిచే సత్తా ఉన్న జట్టు ఏదనే అంశాలని ఒకసారి పరిశీలిద్దాం.

ఓపెనింగ్‌లో రెండు జట్లు బలంగా ఉన్నాయి. పైగా రెండు జట్ల ఓపెనర్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ జట్టుకు మంచి ఆరంభాలనిస్తున్నారు. ముఖ్యంగా పవర్ ప్లేలో హిట్‌మ్యాన్‌ను ఆపడం బౌలర్లకు కష్టంగా ఉంది. టీ20 స్టైలులో విరుచుకుపడుతున్న రోహిత్ శర్మ జట్టుకు అదిరిపోయే ఆరంభాలనిస్తున్నాడు. అటు ఆస్ట్రేలియాకు కూడా డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్ మంచి ఆరంభాలనిస్తున్నారు. ముఖ్యంగా డేవిడ్ వార్నర్ చెలరేగుతున్నాడు. రోహిత్‌కు గిల్ మాదిరిగా, వార్నర్‌కు హెడ్ కూడా మంచి సపోర్టు ఇస్తున్నాడు. ఓపెనింగ్‌లో టీమిండియాకు రోహిత్, ఆస్ట్రేలియాకు వార్నర్ కీలకంకానున్నారు. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు జాబితాలో వీరిద్దరు టాప్ సిక్సులో ఉన్నారంటేనే తమ తమ జట్లలో వీరు ఎంత కీలకంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు రోహిత్ 550 పరుగులు చేయగా.. వార్నర్ 528 పరుగులు చేశాడు. టీమిండియాలో వన్‌డౌన్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ విశ్వరూపం చూపిస్తున్నాడు. 711 పరుగులతో టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్నాడు. ఆడిన 10 మ్యాచ్‌ల్లో కోహ్లీ ఏకంగా 8 సార్లు 50+ స్కోర్లు సాధించాడు. దీంతో ఫైనల్ పోరులోనూ కింగ్ చెలరేగితే టీమిండియా గెలవడం పెదగా కష్టం కాకపోవచ్చు. అదే సమయంలో ఆస్ట్రేలియాలో వన్ డౌన్‌ బ్యాటింగ్ కాస్త బలహీనంగా కనిపిస్తోంది. మూడో స్థానంలో వచ్చే మిచెల్ మార్ష్‌ టోర్నీలో రాణిస్తున్నప్పటికీ నిలకడగా పరుగులు చేయలేకపోతున్నాడు. సెమీస్‌లోనూ డకౌట్ అయ్యాడు. అలాగని మార్ష్‌ను తేలికగా తీసుకోవడానికి వీల్లేదు. ఒంటి చేతితో మ్యాచ్‌ను గెలిపించగలడు. రోహిత్, గిల్, కోహ్లీతో టీమిండియా టాపార్డర్ బలంగా ఉంది. మన టాపార్డర్‌తో పోలిస్తే ఆసీస్ టాపార్డర్ కాస్త బలహీనంగా ఉందని చెప్పుకోవాలి. పైగా మన టాపార్డర్‌లో ఈ టోర్నీలో 500కు పరుగులు చేసిన బ్యాటర్లు ఇద్దరు ఉండగా.. ఆస్ట్రేలియాలో ఒక్కరే ఉన్నారు.


WhatsApp Image 2023-11-19 at 08.07.16.jpeg

శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజాతో టీమిండియా మిడిలార్డర్ బలంగా ఉంది. టోర్నీ ఆరంభంలో కాస్త నిరాశ పరిచిన శ్రేయస్ అయ్యర్ ఆ తర్వాత దుమ్ములేపుతున్నాడు. నాలుగో స్థానంలో ఆడుతూ వరుసగా హాఫ్ సెంచరీలు, సెంచరీలతో చెలరేగుతున్నాడు. సెమీస్‌తో కలిపి చివరి రెండు మ్యాచ్‌ల్లో సెంచరీలు చేశాడు. ముఖ్యంగా ధాటిగా ఆడుతూ మిడిలార్డర్‌లో టీమిండియాకు వెన్నెముక్కగా నిలుస్తున్నాడు. ఇప్పటికే 500కు పైగా పరుగులు సాధించాడు. వికెట్ కీపింగ్, ఐదో స్థానంలో బ్యాటింగ్‌లో కేఎల్ రాహుల్ అదరగొడుతున్నాడు. జట్టు అవసరాలకు అనుగుణంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ముఖ్యంగా టీం కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులో పాతుకుపోయి వికెట్లకు అడ్డుగోడలా నిలబడుతున్నాడు. టోర్నీ ఆరంభంలో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇదే చేసిన రాహుల్ టీమిండియాను గెలిపించాడు. ఆరో స్థానంలో ఉన్న సూర్యకుమార్ యాదవ్‌, ఏడో స్థానంలో ఉన్న రవీంద్ర జడేజాకు ఇప్పటివరకు సరిగ్గా బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదంటేనే మన బ్యాటింగ్ యూనిట్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కీలక ఇన్నింగ్స్ ఆడిన సూర్య విజయంలో కీలకపాత్ర పోషించాడు. లీగ్ దశలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జడేజా సత్తా చాటాడు. సూర్య, జడేజాకు ఇప్పటివరకు సరిగ్గా బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోయినప్పటికీ అవసరమైనప్పుడు రాణించగలరనే నమ్మకం జట్టు మేనేజ్‌మెంట్‌కు ఉంది. భారత్‌తో పోలిస్తే ఆస్ట్రేలియా మిడిలార్డర్ బలంగా ఉంది. ముఖ్యంగా ఆ జట్టు స్టార్ బ్యాటర్లు స్టీవెన్ స్మిత్, మార్నస్ లబుషేన్ సరైన ఫామ్‌లో లేరు. వీరిద్దరు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు. కానీ కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో వీరిద్దరు ఫామ్‌లోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక లీగ్ దశలో గ్లెయిన్ మాక్స్‌వెల్ ఓ డబుల్ సెంచరీ, సెంచరీతో సత్తా చాటాడు. ఫైనల్ పోరులోనూ మెరుపులు మెరిపించగలడు. దీంతో మాక్స్‌వెల్‌తో టీమిండియా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే మాక్స్‌వెల్ నిలకడగా రాణించకపోవడం భారత్‌కు కలిసొచ్చే అంశం. సెమీస్‌లో మాక్సీ ఒక్క పరుగుకే ఔటయ్యాడు.

WhatsApp Image 2023-11-19 at 08.07.21.jpeg

ఇక బౌలింగ్ యూనిట్ విషయానికొస్తే మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌తో టీమిండియా పేస్ దళం బలంగా కనిపిస్తోంది. టోర్నీలో షమీ ఆడింది ఆరు మ్యాచ్‌లే అయినప్పటికీ అత్యధిక వికెట్లు(23) తీసింది అతనే. బంతి వేస్తే వికెట్ అన్నట్టుగా షమీ బౌలింగ్ కొనసాగుతోంది. కివీస్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అయితే 7 వికెట్లతో షమీ విశ్వరూపం చూపించాడు. పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నాడు. పవర్ ప్లేలో బ్యాటర్లు పరుగులు చేయనీయకుండా అడ్డుకుంటున్నాడు. బంతి ఎప్పుడు చేతికి ఇచ్చిన సత్తా చాటుతున్నాడు. ముఖ్యంగా భాగస్వామ్యాలను విడదీస్తున్నాడు. సిరాజ్ కూడా సత్తా చాటుతున్నాడు. భారత్‌తో పోలిస్తే ఆసీస్ పేస్ దళం కాస్త బలహీనంగానే ఉంది. ఆ జట్టు స్టార్ పేసర్లు మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ అంచనాలకు తగ్గట్టుగా రాణించడం లేదు. 13 చొప్పున వికెట్లు తీసిన వీరిద్దరు ఏకంగా 6కు పైగా ఏకానమీతో పరుగులు సమర్పించుకున్నారు. అయితే హాజిల్‌వుడ్ మాత్రం పొదుపుగా బౌలింగ్ చేసి 14 వికెట్లు సంపాదించాడు. ఇక స్పిన్ యూనిట్ విషయానికొస్తే కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాతో మన బౌలింగ్ బలంగా ఉంది. వీరిద్దరు పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు సాధిస్తున్నారు. ఇప్పటికే జడేజా 16, కుల్దీప్ 15 వికెట్లు తీశారు. ముఖ్యంగా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్‌ల్లోనూ పొదుపుగా బౌలింగ్ చేసి వికెట్లు సాధించాడు. భాగస్వామ్యాలను విడదీయడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా టోర్నీలో అదరగొడుతున్నాడు. ఇప్పటికే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో టాప్ 2లో ఉన్న జంపా ఆసీస్‌కు అత్యంత కీలకం కానున్నాడు. జంపాకు తోడు ఆల్ రౌండర్ మాక్స్‌వెల్ కూడా ఉన్నాడు. అలాగే పార్ట్‌టైమ్ స్పిన్నర్‌గా లబుషేన్ రాణించగలడు.

ఇక రెండు జట్లకు కెప్టెన్లు అతిపెద్ద బలం. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడు. కీలక సమయాల్లో తన నిర్ణయాలతో మ్యాచ్‌ను మలుపుతిప్పుతున్నాడు. ఆసీస్ కెప్టెన్ కమిన్స్ కూడా సత్తా చాటుతున్నాడు. జట్ల పరంగా చూస్తే టోర్నీలో ఒక మ్యాచ్ కూడా ఓడిపోని టీమిండియా ఆడిన 10 మ్యాచ్‌ల్లో ప్రత్యర్థులపై సంపూర్ణ అధిపత్యం ప్రదర్శించింది. కానీ ఆస్ట్రేలియా మాత్రం మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. లీగ్ దశలో అప్ఘానిస్థాన్, సెమీస్‌లో సౌతాఫ్రికాపై కష్టమ్మీద గెలిచింది. కాబట్టి మొత్తంగా చూస్తే ఆస్ట్రేలియాతో పోలిస్తే భారత జట్టే మంచి ఫామ్‌లో ఉంది. ఆటగాళ్ల పరంగానూ టీమిండియా సభ్యులంతా సూపర్ ఫామ్‌లో ఉన్నారు. టీమిండియా బ్యాటర్లలో ముగ్గురు 500+పరుగులు చేయగా.. నలుగురు బౌలర్లు 15+ వికెట్లు తీశారు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో వార్నర్ మాత్రమే 500+ రన్స్ చేశాడు. ఆడమ్ జంపా ఒక్కడే 22 వికెట్లు తీశాడు. మిగతా వారెవరూ కనీసం 15 వికెట్లు కూడా తీయలేదు. మొత్తంగా మ్యాచ్‌కు ముందున్న బలబలాల పరంగా చూస్తే ఆస్ట్రేలియా కన్నా భారత్‌కే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నా్యి. దీంతో ఒత్తిడిని అధిగమిస్తే టీమిండియా గెలవడం పెదగా కష్టం కాకపోవచ్చు. పైగా ప్రేక్షకుల మద్దతు కూడా భారత్‌కే ఉండనుంది. కానీ నాకౌట్ మ్యాచ్‌ల్లో అద్భుతంగా ఆడే ఆస్ట్రేలియాను ఏ మాత్రం తేలికగా తీసుకోవడానికి వీల్లేదు.

Updated Date - 2023-11-19T11:08:22+05:30 IST