Share News

World Cup: హార్దిక్ పాండ్యా గాయం విషయంలో భారత్‌కు షాక్‌ల మీద షాక్‌లు.. నేరుగా సెమీస్‌లోనే బరిలోకి?

ABN , First Publish Date - 2023-10-26T12:20:02+05:30 IST

స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం విషయంలో భారత్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఈ నెల 19న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన హార్దిక్ పాండ్యా ఆ మ్యాచ్‌లో 3 బంతులు మాత్రమే వేసి మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు దూరమయ్యాడు.

World Cup: హార్దిక్ పాండ్యా గాయం విషయంలో భారత్‌కు షాక్‌ల మీద షాక్‌లు.. నేరుగా సెమీస్‌లోనే బరిలోకి?

లక్నో: స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం విషయంలో భారత్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఈ నెల 19న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన హార్దిక్ పాండ్యా ఆ మ్యాచ్‌లో 3 బంతులు మాత్రమే వేసి మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌నాటికి అందుబాటులోకి వస్తాడని అంతా భావించారు. కానీ ఈ నెల 29న ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌తోపాటు నవంబర్ 2న శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లోనూ హార్దిక్ పాండ్యా ఆడడం లేదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. దీంతో సౌతాఫ్రికాతో మ్యాచ్ నాటికి హార్దిక్ అందుబాటులోకి వస్తాడని అంతా భావించారు. కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సౌతాఫ్రికాతో మ్యాచ్ నాటికి కూడా హార్దిక్ పాండ్యా కోలుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. దీంతో హార్దిక్ నేరుగా సెమీ ఫైనల్‌లోనే బరిలోకి దిగనున్నాడని పలు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. లేదంటే నవంబర్ 12 నెదర్లాండ్స్‌తో టీమిండియా ఆడే చిట్టచివరి లీగ్ మ్యాచ్ నాటికి జట్టులో చేరతాడని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. అదే జరిగితే టీమిండియాకు సమస్యలు తప్పకపోవచ్చు. ఇంగ్లండ్, సౌతాఫ్రికా వంటి పెద్ద జట్లతో ఆడే మ్యాచ్‌లలో హార్దిక్ పాండ్యా లేకపోవడం జట్టుకు పెద్ద లోటుగా చెప్పుకోవచ్చు.


బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి నుంచి కాలి చీలమండ గాయంతో బాధపడుతున్నాడు. అయితే ఈ గాయం తీవ్రత ఏ మేరకు ఉంటుందనే దానిపై ఇప్పటివరకు నిర్దారణ లేదు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో హార్దిక్ పాండ్యా కోలుకుంటున్నాడు. ఎన్సీఏ మూలాల ప్రకారం ప్రస్తుతం హార్దిక్ పాండ్యాకు చికిత్స కొనసాగుతోంది. అతని ఎడమ కాలి చీలమండపై అయిన వాపు బాగా తగ్గింది. ఈ వారాంతంలో హార్దిక్ బౌలింగ్ చేయడం ప్రారంభిస్తాడని ఎన్సీఏ వర్గాలు ఆశిస్తున్నాయి. అయితే ప్రస్తుతం హార్దిక్ కోలుకోవడానికి తగినంత సమయం ఇవ్వడం ముఖ్యమని ఎన్సీఏ తన నివేదికలో పేర్కొంది. మైదానంలో గాయం అయినప్పుడు హార్దిక్ చాలా బాధపడ్డాడని, కానీ అదృష్టవశాత్తూ అతనికి ఎలాంటి ఫ్రాక్చర్ కాలేదని బీసీసీఐ మూలాలు తెలిపాయి. కాగా ప్రస్తుతం హార్దిక్ గురించి బీసీసీఐ వైద్య బృందం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. అతను తర్వాతి రెండు మూడు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉన్నప్పటికీ, నాకౌట్ మ్యాచ్‌ల నాటికైనా పూర్తి ఫిట్‌నెస్ సాధించాలని కోరుకుంటున్నట్టు బీసీసీఐ తన మూలంలో పేర్కొంది. మరోవైపు హార్దిక్ పాండ్యాకు గురువారం ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహించే అవకాశాలున్నాయి. ఈ ఫిట్‌నెస్ టెస్టులో హార్దిక్ పాండ్యా ఎలా బౌలింగ్ చేయగలడనే దానిని పరీక్షించి, అతని పునారాగమన తేదీపై బీసీసీఐ వైద్య బృందం స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. నిజానికి సాధారణంగా చీలమండ గాయం అయినవారు కోలుకోవడానికి 3 వారాలు సమయం పడుతుందని సమాచారం. అదే జరిగితే హార్దిక్ పాండ్యా నవంబర్ 12న ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్ నాటికి కోలుకునే అవకాశాలు లేవు.

అయితే ముందే ఆడించి రిస్కు తీసుకోకుండా హార్దిక్ పాండ్యాను నేరుగా నాకౌట్ పోరులో ఆడిస్తారని పలు జాతీయ మీడియాలు పేర్కొటున్నాయి. దాంతో హార్దిక్‌కు కూడా కావాల్సినంత విశ్రాంతి లభిస్తుందని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్టు సమాచారం. పైగా ఈ వరల్డ్ కప్‌‌లో ఇప్పటికే వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచిన భారత జట్టు పాయింట్ల పట్టికలో టాప్ ప్లేసులో ఉంది. మిగిలిన మ్యాచ్‌ల్లో కనీసం రెండు గెలిచినా కచ్చితంగా సెమీస్ చేరుతుంది. దీంతో ప్రస్తుతం జట్టు మంచి స్థితిలోనే ఉంది కాబట్టి హార్దిక్ పాండ్యా విషయంలో రిస్క్ తీసుకునే అవకాశాలు ఉండకపోవచ్చు. అతను పూర్తి ఫిట్‌నెస్ సాధించాక సెమీస్‌లోకి బరిలోకి దింపే అవకాశాలున్నాయి. మరోవైపు న్యూజిలాండ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా లేకపోవడంతో తుది జట్టులో టీమిండియా రెండు మార్పులు చేసింది. శార్దూల్ ఠాకూర్‌ను కూడా తప్పించి సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ షమీని ఆడించింది. భారత్ తమ తర్వాతి మ్యాచ్‌ను లక్నో వేదికగా ఇంగ్లండ్‌తో ఆడనుంది. సాధారణంగా లక్నో పిచ్ స్లోగా ఉంటుంది. అందుకే సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను తుది జట్టులో ఆడించే అవకాశాలున్నాయి. కాబట్టి షమీ లేదా సిరాజ్‌ను తప్పించి అశ్విన్‌ను ఆడించొచ్చు. లేదంటే సూర్యకుమార్ యాదవ్ స్థానంలో అశ్విన్‌ను తుది జట్టులోకి తీసుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

Updated Date - 2023-10-26T12:20:02+05:30 IST