Share News

World Cup: పాకిస్థాన్ సెమీస్ చేరితే జరిగేది ఇదేనా..? అప్పుడు టీమిండియా పరిస్థితి ఎలా ఉండబోతుందంటే..?

ABN , First Publish Date - 2023-11-09T14:13:01+05:30 IST

India vs Pakistan: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటివరకు జట్లన్నీ 8 మ్యాచుల చొప్పున ఆడాయి. అన్ని జట్లకు ఇంకా ఒక్కో మ్యాచ్ చొప్పున మాత్రమే మిగిలి ఉంది. టాప్ 3లో ఉన్న భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లకు సెమీస్ బెర్త్‌లు కూడా ఖరారు అయిపోయాయి. దీంతో ఇక ఒకే ఒక్క సెమీస్ బెర్త్ మిగిలి ఉంది. ప్రస్తుతం ఈ ఒక్క స్థానం కోసం మూడు జట్లు పోటీపడుతున్నాయి. పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో నిలిచిన సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు సెమీ ఫైనల్‌లో తలపడనున్నాయి.

World Cup: పాకిస్థాన్ సెమీస్ చేరితే జరిగేది ఇదేనా..? అప్పుడు టీమిండియా పరిస్థితి ఎలా ఉండబోతుందంటే..?

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటివరకు జట్లన్నీ 8 మ్యాచుల చొప్పున ఆడాయి. అన్ని జట్లకు ఇంకా ఒక్కో మ్యాచ్ చొప్పున మాత్రమే మిగిలి ఉంది. టాప్ 3లో ఉన్న భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లకు సెమీస్ బెర్త్‌లు కూడా ఖరారు అయిపోయాయి. దీంతో ఇక ఒకే ఒక్క సెమీస్ బెర్త్ మిగిలి ఉంది. ప్రస్తుతం ఈ ఒక్క స్థానం కోసం మూడు జట్లు పోటీపడుతున్నాయి. పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో నిలిచిన సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు సెమీ ఫైనల్‌లో తలపడనున్నాయి. మరో సెమీ ఫైనల్‌లో మొదటి స్థానంలో ఉన్న భారత్‌‌తో నాలుగో స్థానంలో ఉన్న జట్టు తలపడనుంది. దీంతో నాలుగో స్థానంలో నిలిచి సెమీస్‌లో అడుగుపెట్టేందుకు న్యూజిలాండ్, పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ మూడు జట్లు కూడా ఇప్పటివరకు నాలుగేసి మ్యాచ్‌ల చొప్పున గెలిచాయి. సెమీస్ చేరాలంటే ఆయా జట్లు తమకు మిగిలిన ఒకే ఒక మ్యాచ్‌లో కచ్చితంగా గెలిచి తీరాల్సిందే. అప్పుడు ఎక్కువ పాయింట్లు మెరుగైన రన్ రేటు ఉన్న జట్టు సెమీస్‌లో అడుగుపెడుతుంది.


1200-675-19974790-30-19974790-1699442810655.jpg

మెజారిటీ క్రికెట్ అభిమానులు మాత్రం పాకిస్థాన్ సెమీస్ చేరాలని కోరుకుంటున్నారు. అదే జరిగితే సెమీస్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఇక భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉండే క్రీజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పైగా ప్రపంచకప్ సెమీ ఫైనల్‌లో ఈ రెండు జట్లు తలపడ్డాయంటే అప్పటివరకు ఉన్న వ్యూయర్‌షిప్ రికార్డులన్నీ బద్దలవడం ఖాయం. మొత్తంగా పాకిస్థాన్ సెమీస్ చేరితే ఎలా ఉంటుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. పాకిస్థాన్ సెమీస్ చేరితే భారత్‌తో తలపడడం ఖాయం. దీంతో భారత్, పాకిస్థాన్ సెమీస్‌లో తలపడితే గెలుపెవరది? అప్పుడు టీమిండియా పరిస్థితి ఎలా ఉంటుంది? అసలు సెమీస్‌లో పాక్‌తో తలపడితే భారత్‌కు లాభమా? నష్టమా? అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. రెండు జట్ల గత రికార్డులను ఒక సారి పరిశీలిస్తే పాకిస్థాన్‌పై టీమిండియాకు తిరుగులేని రికార్డుంది. వన్డే ప్రపంచకప్ చరిత్రలో భారత్, పాకిస్థాన్ 8 సార్లు తలపడ్డాయి. 8 సార్లు భారతే గెలిచింది. 48 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో భారత్‌పై పాకిస్థాన్ కనీసం ఒక విజయం కూడా నమోదు చేయలేకపోయింది. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో కూడా లీగ్ దశలో రెండు జట్ల మధ్య జరిగిన పోటీలో పాకిస్థాన్‌ను టీమిండియా చిత్తు చిత్తుగా ఓడించింది. పాకిస్థాన్ అంటేను మన వాళ్లు రెచ్చిపోయి ఆడతారు. ఇక ప్రస్తుతం బలబలాల పరంగా చూసుకున్న పాకిస్థాన్ కంటే టీమిండియా అన్ని విధాల బలంగా ఉంది. ముఖ్యంగా మన జట్టులోని ఆటగాళ్లంతా సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రపంచకప్‌లో మన వాళ్లు రెచ్చిపోయి ఆడుతున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరుస్తూ దుమ్ములేపుతున్నారు. లీగ్ దశలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ అయితే ఊచకోత కోశాడు. కోహ్లీ అయితే దాదాపు ప్రతి మ్యాచ్‌లో 50+ రన్స్‌తో అదరగొడుతున్నాడు. శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ కూడా రాణిస్తున్నారు. వికెట్ కీపింగ్‌లో రాహుల్ అదరగొడుతున్నాడు.

World-Cup-2023-ind-pak-points-table.jpg

ఇక మన బౌలింగ్ యూనిట్ కూడా అద్భుతంగా ఉంది. మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్‌లతో కూడిన టీమిండియా బౌలింగ్ యూనిట్ దుర్బేద్యంగా కనిపిస్తోంది. ఈ టోర్నీలో ఏ ఒక్క ప్రత్యర్థిని కూడా మనవాళ్లు 300+ రన్స్ కొటనివ్వలేదనంటే మన బౌలర్లు ఎంత అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే టోర్నీలో ఆడిన 8 మ్యాచ్‌ల్లోనూ గెలిచిన భారత్ 16 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. ఈ టోర్నీలో ఒక మ్యాచ్ కూడా ఓడిపోని జట్టు భారత్ మాత్రమే. అదే సమయంలో పాకిస్థాన్ పరిస్థితి మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది. టోర్నీలో ఆ జట్టు ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతోంది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 4 గెలిచి, 4 ఓడిపోయి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఆటగాళ్లెవరూ కూడా సరైన ఫామ్‌లో లేరు. ముఖ్యంగా కెప్టెన్ బాబర్ అజామ్ రాణిస్తున్నప్పటికీ భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోతున్నాడు. పాక్ బ్యాటింగ్ ఆర్డర్‌లో ఓపెనర్ ఫకర్ జమాన్, మహ్మద్ రిజ్వాన్ మాత్రమే సరైన ఫామ్‌లో ఉన్నారు. పాక్ మిడిలార్డర్, స్పిన్ డిపార్ట్‌మెంట్ బలహీనంగా కనిపిస్తోంది. షహీన్ ఆఫ్రిదీ, హరీస్ రౌఫ్, హసన్ అలీ రూపంలో జట్టులో స్టార్ పేసర్లు ఉన్నప్పటికీ స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోతున్నారు. దీంతో ప్రస్తుతానికి టేబుల్ మీద చూస్తే టీమిండియాకు పాకిస్థాన్ ఏ మాత్రం సమవుజ్జీ కాదు. కాబట్టి సెమీస్‌లో మన వాళ్లు పాక్‌ను ఓడించి ఫైనల్‌ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే జరిగితే సెంటిమెంట్ ప్రకారం టీమిండియానే కప్ గెలిచే అవకాశాలున్నాయి. టీమిండియా చివరగా 2011లో సొంతగడ్డపై జరిగిన ప్రపంచకప్‌ను గెలిచిన సంగతి తెలిసిందే. ఆ ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్‌లో పాక్‌ను ఓడించిన టీమిండియా ఫైనల్‌లో అడుగుపెట్టి కప్ గెలిచింది. దీంతో ఈ సారి కూడా ఆ సెంటిమెంట్ పునరావృతమవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. దీంతో పాకిస్థాన్ సెమీస్ చేరాలని ఆశిస్తున్నారు.

Updated Date - 2023-11-09T14:17:02+05:30 IST