World cup: ఆస్పత్రిలో చేరిన శుభ్‌మన్ గిల్.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు దూరమైనట్టే!..
ABN , First Publish Date - 2023-10-10T11:05:51+05:30 IST
వన్డే ప్రపంచకప్‌లో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు సోకిన డెంగ్యూ జ్వరం ఇప్పట్లో తగ్గేలా లేదు. ఆరోగ్యం విషమించడంతో గిల్‌ను చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.
చెన్నై: వన్డే ప్రపంచకప్‌లో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు సోకిన డెంగ్యూ జ్వరం ఇప్పట్లో తగ్గేలా లేదు. ఆరోగ్యం విషమించడంతో గిల్‌ను చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. గిల్ ప్లేట్‌లెట్ కౌంట్ కూడా తగ్గిపోయింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగానే అతనిని ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది. బీసీసీఐ వైద్య బృందం అతనిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. "శుభ్‌మన్ గిల్ ప్లేట్‌లెట్ కౌంట్ పడిపోయింది. ముందు జాగ్రత్త చర్యగా అతన్ని చెన్నై ఆసుపత్రిలో చేర్చాం. బీసీసీఐ వైద్య బృందం కూడా అతనిని పర్యవేక్షిస్తోంది" అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఓ నివేదిక ప్రకారం గిల్ ప్లేట్‌లెట్స్ సంఖ్య లక్ష కంటే తక్కువగా పడిపోయినట్లు సమాచారం. కాగా గిల్ డెంగ్యూ జ్వరంతో తగ్గని కారణంగా టీమిండియా ఆడే రెండో మ్యాచ్ కోసం ఢిల్లీ వెళ్లలేదు. బుధవారం ఢిల్లీ వేదికగా భారత జట్టు ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడనుంది. కానీ అనారోగ్యం కారణంగా గిల్ జట్టుతోపాటు ఢిల్లీ వెళ్లడం లేదని సోమవారం బీసీసీఐ ప్రకటించింది. "టీమిండియా బ్యాటర్ శుభ్‌మన్ గిల్ 9 అక్టోబర్ 2023న జట్టుతో కలిసి ఢిల్లీకి వెళ్లడం లేదు. చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి మ్యాచ్‌కు గిల్ దూరమయ్యాడు. ప్రస్తుతం అతను డెంగ్యూ జ్వరం తగ్గకపోవడంతో అక్టోబర్ 11న ఢిల్లీలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు. అతను చెన్నైలోనే బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉంటాడు" అని సోమవారం బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది.
అయితే ఈ నెల 14న పాకిస్తాన్‌తో జరిగే కీలకమైన మ్యాచ్ వరకైనా గిల్ పూర్తిగా కోలుకుని జట్టుకు అందుబాటులో ఉంటాడని అంతా భావించారు. కానీ తాజాగా ఆసుపత్రిలో చేరడంతో పాకిస్థాన్‌తో మ్యాచ్ వరకు కూడా కోలుకోవడం సందేహాంగానే కనిపిస్తోంది. ఒక వేళ పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు కూడా గిల్ దూరమైతే టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పుకోవాలి. ఈ నెల 7న గిల్ డెంగ్యూ జ్వరం బారిన పడ్డాడు. డెంగ్యూ జ్వరం సోకితే పూర్తిగా కోలుకోవడానికి 14 రోజులు పడుతుందని వైద్యులు చెబుతున్నారు. దీంతో పాక్‌తో మ్యాచ్‌లో కూడా గిల్ ఆడే అవకాశాలు లేవనే చెప్పుకోవాలి. ఇప్పటికే ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి మ్యాచ్‌లో గిల్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఈ ఏడాది సూపర్ ఫామ్‌లో ఉన్న గిల్ 20 వన్డేల్లో 72 సగటుతో 1,230 పరుగులు చేశాడు. ఈ ఏడాది ఇంత అద్భుతమైన రికార్డులున్న గిల్ జట్టుకు దూరమవడం టీమిండియాకు మైనస్‌గానే చెప్పుకోవాలి. పలువురు మాజీ ఆటగాళ్లు కూడా ప్రపంచకప్ టోర్నీ ఆరంభానికి ముందు గిల్ కనీసం రెండు సెంచరీలైనా చేస్తాడని అంచనా వేసిన సంగతి తెలిసిందే.