World cup: ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్‌కు కూడా గిల్ దూరం.. మరి పాక్‌తో మ్యాచ్‌ సంగతేంటి?..

ABN , First Publish Date - 2023-10-09T15:52:06+05:30 IST

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలే ఉంది. డెంగ్యూ జ్వరం కారణంగా ఇప్పటికే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌కు స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ దూరమైన సంగతి తెలిసిందే.

World cup: ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్‌కు కూడా గిల్ దూరం.. మరి పాక్‌తో మ్యాచ్‌ సంగతేంటి?..

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. డెంగ్యూ జ్వరం కారణంగా ఇప్పటికే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌కు స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ దూరమైన సంగతి తెలిసిందే. అయితే డెంగ్యూ జ్వరం నుంచి గిల్ ఇంకా కోలుకోలేదు. దీంతో ఈ నెల 11న ఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కు కూడా గిల్ దూరం కానున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం గిల్ ఢిల్లీ వెళ్లడం లేదని, చెన్నైలోనే ఉంటాడని పేర్కొంది. “టీమిండియా బ్యాటర్ శుభ్‌మన్ గిల్ అక్టోబర్ 9, 2023న జట్టుతో కలిసి ఢిల్లీకి వెళ్లడం లేదు. . అతను చెన్నైలోనే వైద్య బృందం పర్యవేక్షణలో ఉంటాడు. ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023లో ఆస్ట్రేలియాతో చెన్నైలో జరిగిన తొలి మ్యాచ్‌కు గిల్ దూరమయ్యాడు. అక్టోబర్ 11న ఢిల్లీలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు" అని బీసీసీఐ వెల్లడించింది.


కాగా గత శుక్రవారం గిల్ డెంగ్యూ జ్వరం బారిన పడ్డాడు. సాధారణంగా డెంగ్యూ జ్వరం వస్తే కోలుకోవడానికి 14 రోజులు పడుతుంది. ఇదే జరిగితే ఈ నెల 14న పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కు కూడా గిల్ దూరమయ్యే అవకాశాలున్నాయి. అదే జరిగితే టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పుకోవాలి. ఇప్పటికే ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఓపెనింగ్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న గిల్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. పాక్‌తో మ్యాచ్ నాటికైన గిల్ కోలుకుంటాడని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది. కాగా ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో సూపర్ ఫామ్‌లో ఉన్న గిల్ 20 వన్డేల్లో 72 సగటుతో 1,230 పరుగులు చేశాడు. ఈ ఏడాది ఇంత అద్భుతమైన రికార్డులున్న గిల్ జట్టుకు దూరమవడం టీమిండియాకు మైనస్‌గానే చెప్పుకోవాలి.

Updated Date - 2023-10-09T16:10:28+05:30 IST