Share News

World Cup: 2003లో ఉన్న టీమిండియాకు, ప్రస్తుతం ఉన్న టీమిండియాకు ఉన్న తేడాలివే!

ABN , First Publish Date - 2023-11-19T11:30:16+05:30 IST

India vs Australia: క్రికెట్ ప్రేమికులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభంకానుంది. తుది పోరులో బలమైన భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడడం ఇదో రెండో సారి. ఈ నేపథ్యంలో 2003 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆడిన టీమిండియాకు, ప్రస్తుత ప్రపంచకప్ ఫైనల్‌లో ఆడబోతున్న టీమిండియాకు ఉన్న తేడాలేంటో ఒకసారి పరిశీలిద్దాం.

World Cup: 2003లో ఉన్న టీమిండియాకు, ప్రస్తుతం ఉన్న టీమిండియాకు ఉన్న తేడాలివే!

అహ్మదాబాద్: క్రికెట్ ప్రేమికులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభంకానుంది. తుది పోరులో బలమైన భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడడం ఇదో రెండో సారి. మొదటిసారిగా 2003 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. సౌతాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో టీమిండియా దారుణ పరాజయం పాలైంది. ఆసీస్‌కు పెదగా పోటీ ఇవ్వకుండానే భారత్ జట్టు తలవంచింది. దీంతో ఆసీస్‌తో ఫైనల్ పోరు అనగానే టీమిండియా అభిమానులను నాటి చేదు జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో 2003 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆడిన టీమిండియాకు, ప్రస్తుత ప్రపంచకప్ ఫైనల్‌లో ఆడబోతున్న టీమిండియాకు ఉన్న తేడాలేంటో ఒకసారి పరిశీలిద్దాం.

WhatsApp Image 2023-11-19 at 08.07.16.jpeg


2003, 2023లో టీమిండియా ఫైనల్ చేరినప్పటికీ నాడు ఉన్న జట్టుకు, నేడు ఉన్న జట్టుకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. నాటి జట్టు ఎక్కువగా సచిన్ టెండూల్కర్‌పై ఆధారపడింది. ఆ టోర్నీలో అద్భుతంగా ఆడిన సచిన్ ఒంటి చేతితో జట్టును ఫైనల్ చేర్చాడు. కానీ ఫైనల్ మ్యాచ్‌లో సచిన్ విఫలమవడంతో భారత్‌కు ఓటమి ఎదురైంది. ఫైనల్‌లోనూ సచిన్ రాణించి ఉంటే టీమిండియా గెలిచేదేమో.. 2003 ప్రపంచకప్ టోర్నీలోని 11 మ్యాచ్‌ల్లో 61 సగటుతో సచిన్ ఏకంగా 673 పరుగులు చేశాడు. ఏకంగా 7 సార్లు 50+ స్కోర్లు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 6 హాఫ్ సెంచరీలున్నాయి. 20 ఏళ్లపాటు ఒక ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు సచిన్ పేరు మీదనే ఉన్నది అంటేనే ఆయన ఏ స్థాయిలో రాణించాడో అర్థం చేసుకోవచ్చు. దురదృష్టవశాత్తూ నాటి టిమిండియాలో సచిన్ మినహా ఇతర బ్యాటర్లెవరూ పెదగా రాణించలేదు. సచిన్ తర్వాత కెప్టెన్ సౌరవ్ గంగూలీ 465 పరుగులు చేశాడు. మిగతావారెవరూ టోర్నీ మొత్తం కలిపి కనీసం 300 పరుగులు కూడా చేయలేపోయారు. వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రావిడ్, యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్, దినేష్ మోంగియా వంటి వాళ్లు రాణించలేకపోయారు. దీంతో టీమిండియా మిడిలార్డర్ కూడా బలహీనంగా ఉన్నది. సచిన్ విఫలమవడం, మిడిలార్డర్ బలహీనంగా ఉండడంతో ఫైనల్‌లో టీమిండియా లక్ష్యాన్ని చేధించలేకపోయింది. ఆ టోర్నీలో మన బౌలర్లు అంతంతమాత్రంగానే రాణించారు. ఏ ఒక్క బౌలర్ కూడా 20 వికెట్ల మార్కు అందుకోలేకపోయారు.

WhatsApp Image 2023-11-19 at 11.19.40.jpeg

ఇక ఫైనల్లో మన బౌలర్లైతే దారుణంగా విఫలమయ్యారు. అంతకుముందు వరకు బాగానే రాణించిన బౌలర్లు ఫైనల్ పోరులో ఆసీస్ బ్యాటర్ల ముందు పూర్తిగా చేతులెత్తేశారు. దీంతో మొదటి 14 ఓవర్లలోనే ఆసీస్ స్కోర్ 100 పరుగులు దాటింది. రికీ పాంటింగ్, డామియన్ మార్టిన్ అయితే మూడో వికెట్‌కు అజేయంగా 30 ఓవర్లలోనే 234 పరుగులు జోడించారు. మన బౌలర్లు వీరి భాగస్వామ్యాన్ని విడదీయలేకపోవడం కొంపముంచింది. అంతేకాకుండా ఎక్స్‌ట్రాల రూపంలోనే మన వాళ్లు ఏకంగా 37 పరుగులు సమర్పించుకున్నారు. 7 నో బాల్స్ కూడా వేశారు. ఆ టోర్నీలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన జహీర్ ఖాన్ ఫైనల్ మ్యాచ్‌లో దారుణంగా విఫలమయ్యారు. ఏకంగా 10 ఏకానమీతో పరుగులిచ్చాడు. శ్రీనాథ్ కూడా దారుణంగా విఫలమయ్యాడు. మన బౌలర్ల బలహీనతలను ఉపయోగించుకున్న ఆస్ట్రేలియా పరుగుల వరద పారించింది. అప్పటికీ ఇంకా టీ20 క్రికెట్ పేరు కూడా లేనప్పటికీ ఆ ఫార్మాట్ మాదిరిగానే కంగారులు పరుగులు సాధించారు. అదే సమయంలో ఆస్ట్రేలియా జట్టు అన్ని విభాగాల్లో బలంగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని డిపార్ట్‌మెంట్లలో ఆ జట్టులో మంచి మంచి ఆటగాళ్లు ఉన్నారు. అందరూ సూపర్ ఫామ్‌లో ఉన్నారు.

WhatsApp Image 2023-11-19 at 11.18.57.jpeg

ప్రస్తుతమున్న టీమిండియా విషయానికొస్తే 2003 జట్టుకు పూర్తి భిన్నంగా ఉంది. అప్పట్లో మాదిరిగా ఒకే బ్యాటర్‌పై ఆధారపడే పరిస్థితులు లేవు. ఓపెనర్లు నుంచి మిడిలార్డర్ వరకు అందరూ పరుగుల వరదపారిస్తున్నారు. 2003లో మన జట్టు నుంచి ఒక సచిన్ మాత్రమే 500+ పరుగులు సాధించాడు. కానీ ప్రస్తుతమున్న టీమిండియాలో ముగ్గురు బ్యాటర్లు 500+ పరుగులు సాధించారు. 2003లో మన బౌలర్లు ఇద్దరు మాత్రమే 15కుపైగా వికెట్లు తీశారు. కానీ ప్రస్తుత జట్టులో ఏకంగా నలుగురు భారత బౌలర్లు 15+ వికెట్లు తీశారు. షమీ అయితే 6 మ్యాచ్‌ల్లోనే 23 వికెట్లు తీసి టాప్ ప్లేసులో ఉన్నాడు. ప్రస్తుతం ఉన్న భారత జట్టు అన్ని విభాగాల్లో బలంగా ఉంది. 2003లో భారత జట్టు లీగ్ దశలో ఒక మ్యాచ్‌లో అది కూడా ఆస్ట్రేలియా చేతిలోనే ఓడిపోయింది. సచిన్ అండతో నాడు ఫైనల్ చేరినప్పటికీ జట్టులో కొన్ని లోపాలున్నాయి. కానీ ప్రస్తుత టోర్నీలో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా 10 వరుస విజయాలతో ఫైనల్ చేరింది. ప్రత్యర్థులపై సునాసయంగా విజయాలు సాధించింది. మొత్తంగా నాటి మ్యాచ్‌లో సచిన్ ఔటైతే టీమిండియా ఓడిపోనట్టే.

WhatsApp Image 2023-11-19 at 11.19.15.jpeg

కానీ ప్రస్తుత జట్టులో అలా లేదు. 11 మంది ఆటగాళ్లు చక్కగా ఆడుతున్నారు. అందరూ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ఒకటి నుంచి ఏడో నంబర్ బ్యాటర్ వరకు అందరూ పరుగులు చేయగలరు. బౌలర్లంతా రాణిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే నాటి మ్యాచ్‌లో టీమిండియాకు సచిన్ ఒక్కడే. కానీ నేడు 11 మంది ఉన్నారు. ఆస్ట్రేలియా విషయానికొస్తే 2003 ప్రపంచకప్‌లో ఆ జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ చేరింది. కానీ ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆరంభ రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. పలు మ్యాచ్‌ల్లో తడబడింది. జట్టులోని ఆటగాళ్లంతా సరైన ఫామ్‌లో లేరు. ఆరంభ మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓడింది. మొత్తంగా చెప్పాలంటే 2003 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఏ విధంగా అన్ని విభాగాల్లో బలంగా ఉందో ప్రస్తుతం టీమిండియా అలా ఉంది. అదే సమయంలో 2003లో టీమిండియా ఎలా అయితే కొన్ని లోపాలతో ఉందో ప్రస్తుతం ఆస్ట్రేలియా అలా ఉంది. పైగా లీగ్ దశలో ఆసీస్‌పై టీమిండియానే గెలిచింది. దీంతో సెంటిమెంట్ ప్రకారం చూసుకుంటే ఫైనల్‌లో టీమిండియానే గెలిచే అవకాశాలున్నాయి.

Updated Date - 2023-11-19T11:30:18+05:30 IST