World cup: సెమీస్‌లో టీమిండియా ప్రత్యర్థిగా ఆ జట్టు ఫిక్స్‌యినట్టేనా..? పాక్, అఫ్ఘాన్ పరిస్థితేటంటే..?
ABN , First Publish Date - 2023-11-07T13:31:00+05:30 IST
సొంత గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా అదరగొడుతోంది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో అన్నీ గెలిచి 16 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా ఓడిపోని ఏకైక జట్టు భారత్ మాత్రమే.
సొంత గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా అదరగొడుతోంది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో అన్నీ గెలిచి 16 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా ఓడిపోని ఏకైక జట్టు భారత్ మాత్రమే. దీంతో అందరి కంటే ముందుగానే రోహిత్ సేన సెమీస్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత సౌతాఫ్రికా కూడా సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. సెమీస్‌లో మిగిలిన రెండు స్థానాల కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ జట్లు పోటీపడుతున్నాయి. అయితే సెమీస్‌లో టీమిండియా ప్రత్యర్థిగా ఏ జట్టు ఉండబోతుందనేది ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. భారత జట్టు 2015, 2019 ప్రపంచకప్‌లలో టేబుల్ టాపర్‌గా నిలిచింది. కానీ సెమీస్‌లో మాత్రం ఓటమిపాలైంది. 2022 టీ20 ప్రపంచకప్‌లో కూడా సెమీస్‌లో టీమిండియా ఓడిపోయింది. లీగ్ దశలో అద్భుతంగా ఆడుతున్నప్పటికీ సెమీస్‌లో మాత్రం మనవాళ్లు చతికిలపడుతున్నారు. దీంతో భారత జట్టుకు నాకౌట్ గండం ఉందని, ఆటగాళ్లు ఒత్తిడిని అధిగమించి రాణించలేకపోతున్నారనే అభిప్రాయాలు సైతం పలువురిలో వ్యక్తమయ్యాయి. అయితే ఈ సారి అన్ని గండాలను అధిగమించి సెమీస్‌ను దాటి ఫైనల్‌లో కప్ గెలవడమే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతోంది. దీంతో ఈ సారి సెమీస్‌లో టీమిండియా ఢీకొనబోయ్యే జట్టు ఏదనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది.
ఈ ప్రపంచకప్‌లోనూ టీమిండియా టేబుల్ టాపర్‌గా నిలిచింది. చివరి మ్యాచ్‌లో ఓడినా మొదటి స్థానంలో భారత జట్టే ఉండనుంది. పాయింట్ల టేబుల్‌లో మొదటి స్థానంలో ఉన్న జట్టు నాలుగో స్థానంలో ఉన్న జట్టుతో, రెండో స్థానంలో ఉన్న జట్టు మూడో స్థానంలో ఉన్న జట్టుతో సెమీస్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఈ లెక్కన భారత జట్టు నాలుగో స్థానంలో ఉన్న టీంతో సెమీ ఫైనల్‌లో తలపడనుంది. కాగా లీగ్ దశ ముగిసే సమయానికి సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు 2, 3 స్థానాల్లో నిలవడం దాదాపు ఖాయంగా చెప్పుకోవాలి. దీంతో నాలుగో స్థానంలో నిలిచి సెమీస్‌లో భారత్ ప్రత్యర్థిగా ఉండే అవకాశాలు ఏ జట్టుకు ఎక్కువగా ఉన్నాయో ఓ సారి పరిశీలిద్దాం. ప్రస్తుత బలబలాల పరంగా చూస్తే నాలుగో స్థానంలో నిలిచి సెమీస్‌లో భారత్‌తో తలపడే అవకాశాలు న్యూజిలాండ్‌కే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం 7 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో నాలుగో స్థానంలో ఉన్న ఆ జట్టు చివరి మ్యాచ్‌లో గెలిస్తే 10 పాయింట్లతో సెమీస్‌లో అడుగుపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే సెమీస్ రేసులో ఉన్న పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్ జట్లు తమ చివరి మ్యాచ్‌ల్లో గెలిచినా వాటి నెట్ రన్ రేటు కివీస్ కంటే తక్కువగా ఉంది. ప్రస్తుతం న్యూజిలాండ్ నెట్ రన్ రేటు+0.398గా ఉండగా, పాకిస్థాన్‌ది +0.036గా, అఫ్ఘానిస్థాన్‌ది -0.330గా ఉంది. కాబట్టి కివీస్‌కే సెమీస్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పైగా కివీస్ తమ చివరి మ్యాచ్‌లో ప్రస్తుతం ఏ మాత్రం ఫామ్‌లో లేని శ్రీలంకతో తలపడనుంది. దీంతో ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలవడం పెదగా కష్టం కాకపోవచ్చు. కాగా పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ జట్లు కూడా ఆడిన ఏడింట్లో నాలుగేసి మ్యాచ్‌లు గెలిచి 5, 6వ స్థానాల్లో ఉన్న సంగతి తెలిసిందే.
ఆ తర్వాత పాకిస్థాన్‌కు కూడా అవకాశాలున్నాయి. కానీ పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే ఇంగ్లండ్‌తో జరిగే చివరి మ్యాచ్‌లో గెలవడంతోపాటు న్యూజిలాండ్ కన్నా నెట్ రన్ రేటును మెరుగుపరచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత బలబలాల దృష్యా ఇంగ్లండ్‌పై పాకిస్థాన్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ రన్ రేటును మెరుగు పరచుకోవడం అసలైన సమస్యగా ఉంది. ఒక వేళ న్యూజిలాండ్, అఫ్ఘానిస్థాన్ జట్లు తమ చివరి మ్యాచ్‌ల్లో ఓడితే పాక్ సునాయసంగా సెమీస్ చేరుతుంది. ఇక అఫ్ఘనిస్థాన్ విషయానికొస్తే.. నిజానికి న్యూజిలాండ్, పాకిస్థాన్ కన్నా సెమీస్ చేరేందుకు ఆ జట్టుకే ఎక్కువ అవకాశాలున్నాయి. ఎందుకంటే పాకస్థాన్, న్యూజిలాండ్ జట్లకు ఇంకా ఒక్కో మ్యాచ్ మాత్రమే ఆడాల్సి ఉంది. కానీ అఫ్ఘాన్ జట్టుకు మాత్రం ఇంకా రెండు మ్యాచ్‌లున్నాయి. కాబట్టి ఆ రెండు మ్యాచ్‌ల్లో అఫ్ఘానిస్థాన్ జట్టు గెలిస్తే రన్ రేటుతో సంబంధం లేకుండా 12 పాయింట్లతో సెమీస్‌లో అడుగుపెడుతుంది. ఒక వేళ ఒకటి మాత్రమే గెలిస్తే కివీస్, పాక్ కన్నా మెరుగైన రన్ రేటు సాధించాల్సి ఉంటుంది. ఒకవేళ రెండింటిలో గెలిచినా లేదంటే ఒక మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించి మెరుగైన రన్ రేటు సాధిస్తే రెండు లేదా మూడో స్థానంలో నిలిచి అవకాశాలున్నాయి. కానీ అఫ్ఘానిస్థాన్‌కు ఇదంతా సులువు కాదు. ఎందుకంటే అఫ్ఘానిస్తాన్ జట్టు తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో బలమైన, సూపర్ ఫామ్‌లో ఉన్న ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లతో తలపడనుంది. కాబట్టి వాటిని ఓడించడం అఫ్ఘానిస్థాన్‌కు కత్తి మీద సాములాంటిదేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లీగ్ దశలో ఇంగ్లండ్, పాకిస్థాన్ వంటి బలమైన జట్లను ఓడించినప్పటికీ కీలకపోరులో ఒత్తిడిని తట్టుకుని కంగారులు, సఫారీలను ఓడించడం అఫ్ఘానిస్తాన్ జట్టుకు సులువైన పని కాదని అంటున్నారు. కానీ అనూహ్యరీతిలో గెలిచి మళ్లీ సంచలనాలు సృష్టించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మొత్తంగా నాలుగో స్థానంలో నిలిచి సెమీస్‌లో భారత్‌తో తలపడే అవకాశాలు అన్ని జట్ల కంటే ఎక్కువగా న్యూజిలాండ్‌కే ఉన్నాయి. ఆ తర్వాత పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ జట్లకు ఉన్నాయి. ఏదైనా అద్భుతం జరిగి ఆస్ట్రేలియా నాలుగో స్థానంలో నిలిస్తే కంగారులతో కూడా సెమీస్ ఆడే అవకాశలు లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు.